రైతులు ఆందోళన చెందొద్దు: జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
సూర్యాపేట, ఏపీబీ న్యూస్: సూర్యాపేట జిల్లాలో ఈ యాసంగి సీజన్లో రైతులకు సరఫరా చేసేందుకు యూరియా కొరత లేదని, అందువల్ల రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. సోమవారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ అధికారులతో రబీ సీజన్లో యూరియా పంపిణీ పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ జిల్లాలో యూరియా పంపిణీ పై అధికారులతో సమీక్షించారు.
2025 యాసంగి సీజన్లో జిల్లాలో ప్రస్తుతం 10,508 మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు సరఫరా చేసేందుకు వివిధ సొసైటీలు, డీలర్లు,ఎన్ డి సి ఎం ఎస్, ఏ ఆర్ ఎస్ కె, మార్క్ఫెడ్ గోదాములలో అందుబాటులో ఉన్నట్టు తెలిపారు. కాగా, ఇప్పటివరకు జిల్లాలో ఈ సీజన్ లో రైతులకు 32,910 మెట్రిక్ టన్నుల యూరియాను పంపిణీ చేయడం జరిగిందని స్పష్టం చేశారు. జిల్లాలోని 544 సెంటర్ల ద్వారా యూరియాను పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.
యూరియా సరఫరాను ఎప్పటికప్పుడు తాను పర్యవేక్షించడం జరుగుతున్నదని, ఎవరైనా ప్రైవేటు డీలర్లు, సహకార సంఘాలు, మార్క్ఫెడ్, తదితర సంస్థలు ప్రభుత్వం నిర్దేశించిన పరిమాణం కన్నా ఎక్కువ పరిమాణంలో యూరియాను అమ్మినా లేదా అధిక ధరకు విక్రయించిన అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. జిల్లాలో అవసరమైనంత యూరియా అందుబాటులో ఉన్నందున రైతులు యూరియా కై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. యూరియా కు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 6281492368 కు సంప్రదించాలని ఆయన కోరారు.