- కోర్టు ఆదేశాలు ఓ వైపు.. ప్రభుత్వ నిర్ణయం మరోవైపు
- బీఆర్ఎస్ హయాం పాలకవర్గాల కొనసాగింపుతో కాంగ్రెస్ ఆశావహులకు నిరాశ
- బాధ్యతలు చేపడితే పదవులు పోతాయన్న భయం..
- దూరంగా డీసీసీబీల చైర్మన్లు, డైరెక్టర్లు
- నల్లగొండ డీసీసీబీకి చివరకు త్రిసభ్య కమిటీ
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల (డీసీసీబీ) పాలకవర్గాల వ్యవహారం రాజకీయ పంచాయితీగా మారింది. హైకోర్టు ఆదేశాలు పాత పాలక వర్గాలకు అనుకూలంగా ఉండగా.. ప్రభుత్వం మాత్రం కొత్త పాలకవర్గాల ఏర్పాటుకు ప్రయత్నిస్తుండటంతో డీసీసీబీల్లో అనిశ్చితి నెలకొంది. కోర్టు ఆదేశాల మేరకు బాధ్యతలు చేపడితే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించినట్టవుతుందన్న ఆందోళనతో పలువురు చైర్మన్లు, డైరెక్టర్లు బాధ్యతలు స్వీకరించేందుకు వెనుకంజ వేస్తున్నారు. దీంతో పంట రుణాలు, ఇతర సహకార పథకాల అమలుపైనా ప్రభావం పడుతోంది.
పీఏసీఎస్లు, డీసీసీబీలను ప్రభుత్వం రద్దు చేసి పర్సన్ ఇన్చార్జిలను నియమించడాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ మద్దతుదారులు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఎన్నికలు జరిగే వరకు గతంలో ఉన్న పాలకవర్గాలనే కొనసాగించాలని హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో పర్సన్ ఇన్చార్జిలు పక్కకు తప్పుకుని పీఏసీఎస్ చైర్మన్లు, డైరెక్టర్లు తిరిగి బాధ్యతలు చేపట్టారు. అయితే డీసీసీబీ పాలకవర్గాలు మాత్రం బాధ్యతలు చేపట్టేందుకు వెనుకంజ వేశాయి.
కరీంనగర్ ఘటనతో కలకలం
కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకున్న పరిణామం డీసీసీబీ పాలకవర్గాలను మరింత ఆందోళనకు గురిచేసింది. బీఆర్ఎస్ హయాంలో టెస్కాబ్ చైర్మన్గా పనిచేసిన రవీందర్రావు కరీంనగర్ డీసీసీబీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. అయితే ఆయన బీఆర్ఎస్ హయాంలోనే ఎన్నికైన పీఏసీఎస్ చైర్మన్ కావడంతో.. డీసీసీబీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజే ఆయన ఎన్నికైన పీఏసీఎస్ పాలకవర్గాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో డీసీసీబీ చైర్మన్ పదవితోపాటు పీఏసీఎస్ చైర్మన్ పదవిని కూడా కోల్పోయారు. ఈ పరిణామం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. హైకోర్టు ఆదేశాల మేరకు డీసీసీబీ బాధ్యతలు చేపడితే తమపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనన్న ఆందోళన చైర్మన్లు, డైరెక్టర్లలో నెలకొంది. దీంతో చాలా ప్రాంతాల్లో వారు బాధ్యతలు స్వీకరించేందుకు ఆసక్తి చూపలేదు.
నామినేటెడ్ అస్త్రం పారలే..
పీఏసీఎస్ చైర్మన్లు, డైరెక్టర్లను నామినేటెడ్ పద్ధతిలో నియమించాలని ప్రభుత్వం కొద్దినెలల క్రితం డీసీఓలకు మౌఖిక ఆదేశాలు ఇచ్చింది. అయితే కరీంనగర్, వరంగల్, ఖమ్మం, యాదాద్రి జిల్లాల్లో మినహా పెద్దగా నామినేటెడ్ నియామకాలు జరగలేదు. నామినేటెడ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ కొంతమంది సొసైటీ చైర్మన్లు, డైరెక్టర్లు హైకోర్టును ఆశ్రయించారు. నామినేటెడ్ విధానం సహకార చట్టానికి విరుద్ధమని, సొసైటీల్లో ఓటర్లుగా ఉన్న రైతులు తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని వారు వాదించారు. అంతేకాకుండా నామినేటెడ్ పాలకవర్గాలకు ఆరు నెలల కాల పరిమితి మాత్రమే ఉండటంతో మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం ఈ విధానంపై పెద్దగా ఆసక్తి చూపలేదు.
హైకోర్టు ఆదేశాల మేరకు ప్రస్తుతం కొనసాగుతున్న చైర్మన్లు, డైరెక్టర్లలో ఎక్కువ మంది బీఆర్ఎస్ హయాంలో ఎన్నికైనవారే కావడం గమనార్హం. దీంతో కాంగ్రెస్లో సొసైటీ పదవులు ఆశిస్తున్న ఆశావహులకు నిరాశ ఎదురవుతోంది.
నల్లగొండలోనూ అదే పరిస్థితి
నల్లగొండ డీసీసీబీ విషయంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ చైర్మన్ కుంభం శ్రీనివాస్రెడ్డి, డైరెక్టర్లు బాధ్యతలు స్వీకరించకుండా దూరంగా ఉండాల్సి వచ్చింది. కుంభం శ్రీనివాస్రెడ్డి మినహా మిగతా డైరెక్టర్లంతా బీఆర్ఎస్ హయాంలో డైరెక్టర్లుగా ఎన్నికై.. కాంగ్రెస్లో చేరినవారే కావడం గమనార్హం.
హైకోర్టు ఆదేశాల మేరకు తాము బాధ్యతలు చేపడితే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించినట్టవుతుందని భావించడంతో వారు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. దీంతో పీఏసీఎస్ల తరహాలోనే డీసీసీబీ చైర్మన్లు, డైరెక్టర్లు కూడా బ్యాంకు కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. ఫలితంగా సహకార బ్యాంకుల నిర్వహణలో అనిశ్చితి నెలకొంది. ఇద్దరు సీనియర్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ డీసీసీబీ పాలకవర్గాన్ని కొనసాగించడంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం.
చివరకు త్రిసభ్య కమిటీ దిక్కు
పాలకవర్గాలపై స్పష్టత లేకపోవడంతో ప్రభుత్వం తాజాగా డీసీసీబీల నిర్వహణకు త్రిసభ్య కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ), జిల్లా సహకార అధికారి( డీసీఓ), డీసీసీబీ సీఈఓ, జేడీఏలతో కమిటీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. గత ఏడాది ఫిబ్రవరిలోనే పీఏసీఎస్ల పాలక వర్గాల పదవీకాలం పూర్తయినా ఎన్నికలు జరగకపోవడం, పాత పాలకవర్గాలు–ప్రభుత్వం మధ్య నెలకొన్న వివాదంతో సహకార వ్యవస్థలో స్పష్టత కొరవడింది. ప్రస్తుతం త్రిసభ్య కమిటీల ద్వారా బ్యాంకుల కార్యకలాపాలను కొనసాగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే పాలకవర్గాల వ్యవహారానికి శాశ్వత పరిష్కారం లభించకపోవడంతో పంట రుణాలు, సకార పథకాల అమలు, రైతులకు అందాల్సిన సేవలపై ప్రభావం ఎంత కాలం కొనసాగుతుందన్నది ప్రశ్నార్థకంగా మారింది.