మునుగోడులో ₹200 కోట్ల యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ భూమిపూజ

మునుగోడు, ఏపీబీ న్యూస్: మునుగోడు నియోజకవర్గ కేంద్రంలోని దుబ్బ కాలువ రోడ్డులో ₹200 కోట్ల వ్యయంతో 2,500 మంది విద్యార్థులకు అత్యాధునిక సౌకర్యాలు అందించే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భూమిపూజ నిర్వహించారు. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, TGEWIDC MD గణపతి రెడ్డి కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చిన్నప్పటి విద్యాభ్యాసాన్ని గుర్తు చేసుకుంటూ.. ‘మేం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు కులాల గురించి తెలియదు, అన్ని కులాల, అన్ని మతాల వాళ్ళం ఒకే ప్రాంగణంలో చదువుకునేవాళ్ళం.. ఇప్పుడు ఈ ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు కూడా అలాంటివే’ అని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత విస్తృతంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పథకం అమలు చేయలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చిందని ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశంసించారు.

సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ అంతటా 79 ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు ప్రారంభమవుతున్నాయని, వాటిలో సుమారు 2 లక్షల మంది విద్యార్థులు చదువుకోబోతున్నారని రాజగోపాల్ రెడ్డి వివరించారు. మునుగోడులో మాత్రమే 330 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నా, వాటిలో కేవలం 9,700 మంది విద్యార్థులు మాత్రమే చదువుతున్నారని పేర్కొన్నారు. విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పు అవసరమని, ఈ ఇంటిగ్రేటెడ్ స్కూలు అందుకు మొదటి అడుగని ఆయన స్పష్టం చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో 76 లక్షల 35 వేల 115 మంది విద్యార్థులు చదువుతున్నారని, వారిలో ప్రైవేట్ సెక్టార్లో 44 లక్షల మంది ఉండగా, ప్రభుత్వ సెక్టార్లో కేవలం 24 లక్షల మంది మాత్రమే ఉన్నారని రాజగోపాల్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. విద్య మొత్తం కార్పొరేట్ చేతిలోకి వెళ్ళిపోయిందని, కనీసం 50 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే అవకాశం రావాలని పేర్కొన్నారు. అందుకు బడ్జెట్లో 10 నుండి 15 శాతం విద్యకు కేటాయించాలని సూచించారు. గత ప్రభుత్వం విద్య, వైద్యాన్ని గాలికి వదిలిపెట్టిందని మండిపడ్డారు.

ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధి కోసం రాజగోపాల్ రెడ్డి తనవంతు ప్రయత్నం చేస్తున్నారని అభినందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించుకోవడం ప్రభుత్వాల బాధ్యత అని, విద్య వైద్యాన్ని కార్పొరేట్ శక్తులు వ్యాపారంగా మార్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల కొరత ఉందని, కనీస వసతులు కల్పించి ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో పేద విద్యార్థులకు నైపుణ్యంతో కూడిన విద్యను అందించే ప్రయత్నం జరుగుతుందని తెలిపారు.

Share
Share