APB News Exclusive: మును‘గోడు’కోసం.. మళ్లీ రాజీనామా దిశగా రాజగోపాల్​ సంకేతాలు

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్:  ఫ్లోరైడ్ పీడిత ప్రాంతమైన మునుగోడు అభివృద్ధి కోసం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. గత 8 ఏళ్ల నుంచి వెనకబడ్డ ప్రాంత ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు అలుపెరగని పోరాటం చేస్తున్న ఆయన ఏకంగా అధికార పార్టీనే టార్గెట్ చేశారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి, అక్కడి నుంచి మళ్లీ కాంగ్రెస్లో చేరినా రాజగోపాల్ దూకుడు మాత్రం తగ్గలేదు. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాలు సృష్టించే ఆయన అధికారంలో ఉన్నప్పటికీ స్వపక్షం పైన చిందులు వేయడం పొలిటికల్ సర్కిల్లో తెగ వైరల్ అవుతోంది. మునుగోడు గోస తీర్చేందుకు ఎందాకైనా పోరాడేందుకు సిద్ధమని శపథం చేసే రాజగోపాల్రెడ్డి.. ఆదివారం అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వ చర్యలను తీవ్రస్థాయిలో ఎండగట్టారు. ఓవైపు ప్రభుత్వం పైన పొగడ్తల వర్షం కురిపిస్తూ.. మరోవైపు నల్లగొండ, ఖమ్మం జిల్లా మంత్రులకు చురకలు అంటించారు. 

మునుగోడు నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షించే రాజగోపాల్ రెడ్డి చివరకు తన పదవిని త్యాగం చేశారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించడమే లక్ష్యంగా ప్రజాక్షేత్రంలో తాడోపేడో తేల్చుకునేందుకు 2022 లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి తొలిసారి మునుగోడు ఎమ్మెల్యేగా ఎన్నికైన రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం శతవిధాలుగా ప్రయత్నించినప్పటికీ కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. నియోజకవర్గ అభివృద్ధి పనులను అప్పటి అధికార పార్టీ నాయకులు అడ్డుకున్నారు. మాజీమంత్రి జగదీష్ రెడ్డి మునుగోడులో తలదూర్చి గొడవలకు మరింత ఆజ్యం పోశారు. ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలు ఆపేశారు. రోడ్లు, తాగు, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయలేదు. దీంతో విసుగు చెందిన రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవిని వదులుకున్నారు. దాంతో బీఆర్ఎస్ సర్కార్ మునుగోడు ముందు ప్రత్యక్షమైంది. 2022లో జరిగిన ఉప ఎన్నికలు మునుగోడు తలరాతనే మార్చేశాయి. అప్పటికప్పుడు వందల కోట్ల నిధులు శాంక్షన్ అయ్యాయి. గ్రామాల్లో, మండలాల్లో కొత్త రోడ్లు వెలిశాయి. చండూరు రెవిన్యూ డివిజన్ ఏర్పాటైంది. ఆసుపత్రులకు కొత్త బిల్డింగ్లు, గట్టుప్పుల్ కొత్త మండలం ఏర్పాటు, గొర్రెల యూనిట్లు, దళిత బంధు, బీసీ బంధు ఇలా.. నాలుగేళ్ల పాటు ప్రజలకు అందని పథకాలు అన్నీ రాజగోపాల్ రాజీనామాతో ప్రజలకు చేరాయి. ముఖ్యంగా మునుగోడులో బీజేపీకి ఊహించనంత బలం పెరిగింది. రాజగోపాల్ ఓడిపోయినప్పటికీ ఆయన సత్తా ఏంటో బీజేపీ రూపంలో కేసీఆర్కు చూపించారు.

‘ఎవరికీ తలవొంచను… ఎలాంటి ప్రలోభాలకు తలొగ్గను’.. అని గొప్పగా చెప్పుకునే రాజగోపాల్ రెడ్డి ఈ సారి ఏకంగా స్వపక్షాన్నే టార్గెట్ చేయడం సంచలనం రేకెత్తించింది. అసెంబ్లీలో రాజగోపాల్ వ్యాఖ్యలకు మద్ధతుగా పలువురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు సైతం చప్పట్లతో మద్ధతు తెలపడం మరింత కలవరపాటుకు గురిచేసింది. తన సొంత అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డిని సైతం వదిలిపెట్టకుండా సీనియర్ మంత్రి ఉత్తమ్, ఖమ్మం జిల్లా మంత్రుల పైన ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి విషయంలో సీఎం రేవంత్ను పొగడ్తలతో ముంచెత్తిన రాజగోపాల్… మంత్రులకు చురకులు అంటించడం వెనక ఆంతర్యం ఏంటో ఎవరికీ బోధ పడట్లేదు. అప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా కేసీఆర్ సర్కార్ను ఇరకాటంలో పడేసినట్టుగా.. ఇప్పుడు ఏకంగా అధికార పార్టీ పైన అదే రకమైన ప్రయోగం చేస్తారనే టాక్ వినిపిస్తోంది.

ఎమ్మెల్యేగా రెండున్నరేళ్ల పదవీ కాలం ముగిసింది. 2018లో మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి 2026 వరకు (8ఏళ్లు) మునుగోడును బాగుచేసేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నా సమస్యలు మాత్రం తీరట్లేదు. ఇరిగేషన్ ప్రాజెక్టులు, రోడ్లు, ఇతర మౌలిక వసతుల పనులన్నీ పెండింగ్లోనే ఉన్నాయి. ముఖ్యంగా ఫ్లోరైడ్ పీడను వదిలించేందుకు తలపెట్టిన డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం పనులు మొదలు కాలేదు. కొత్తగా కోరిన లిఫ్ట్ స్కీంలు శాంక్షన్ కాలేదు. ఇందిరమ్మ ఇళ్లు సరిపోలేదు. ఈ ప్రాంతానికి ఒక్కసారి కూడా సీఎం రేవంత్, మంత్రులు పర్యటించిన దాఖలాల్లేవు, పైగా రాజగోపాల్కు ఇస్తామని హామీ ఇచ్చిన మంత్రి పదవి దక్కలేదు. అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ప్రాంతం లో కాలుమోపలేదు. మంత్రుల నియోజకవర్గాలకే భారీగా నిధులు వస్తున్నందున.. తనకు కూడా మంత్రి పదవి వస్తే ఈ ప్రాంతం బాగుపడుతుందనే ఉద్దేశం రాజగోపాల్కు ఉండొచ్చు. మంత్రులతో సమానంగా ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వకుంటే తనకు ఈ పదవి దండగా అని అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు మరోసారి రాజగోపాల్ రాజీనామాకు సంకేతాలుగానే కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రతిపక్ష ఎమ్మెల్యేగా మునుగోడు డెవలప్మెంట్ కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని ప్రగల్భాలు పలికిన రాజగోపాల్రెడ్డి ఇప్పుడు అధికారం పక్షం చూపిస్తున్న వివక్షకు నిరసనగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. అసెంబ్లీలో రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్నప్పుడే మునుగోడులో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మీడియా సమావేశం పెట్టి రాజగోపాల్ పైన ఘాటైన విమర్శలు చేశారు. ఎమ్మెల్యే రాజీనామా చేస్తేనే మునుగోడుకు మంచిరోజులు వస్తాయని, ఆ దిశగానే అసెంబ్లీలో ఆయన వ్యాఖ్యలు చేసి ఉండొచ్చని అంటున్నారు. లేదంటే రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించి స్వపక్షాన్నే బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని మరో వర్గం ఆరోపిస్తోంది.

Share
Share