Breaking News: యువకుడి ప్రాణం తీసిన క్రికెట్ మ్యాచ్.. నడిరోడ్డుపై కత్తితో

విశాఖపట్నం, ఏపీబీ న్యూస్: సరదాగా ఆడుకోవాల్సిన క్రికెట్ మ్యాచ్ ఒక యువకుడి జీవితాన్ని బలితీసుకుంది. ఆటలో మొదలైన చిన్న గొడవ కక్షగా మారి, చివరకు ఒకరి ప్రాణం తీసే వరకు వెళ్ళింది. విశాఖపట్నంలోని ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలు రేకెత్తించింది.

వివరాల్లోకి వెళ్తే.. ఆరిలోవ పెద్దగదిలి ప్రాంతంలో శనివారం కొంతమంది యువకులు క్రికెట్ మ్యాచ్ ఆడారు. ఈ క్రమంలో అజిత్ (23) మరియు కిషోర్ (26) అనే ఇద్దరు యువకుల మధ్య ఆట విషయంలో వాగ్వాదం చోటుచేసుకుంది. అప్పటికి గొడవ సద్దుమణిగినట్లు కనిపించినా, కిషోర్ మనసులో అజిత్పై కక్ష పెంచుకున్నాడు.

పెద్దగదిలి జంక్షన్ వద్ద అజిత్ వెళ్తున్న సమయంలో కిషోర్ అడ్డుకున్నాడు. అందరూ చూస్తుండగానే తన వద్ద ఉన్న కత్తితో అజిత్పై దాడి చేశాడు. విచక్షణారహితంగా పొడవడంతో అజిత్ రక్తపు మడుగులో కుప్పకూలిపోయాడు. తీవ్ర గాయాలైన అజిత్ను ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు సమాచారం. నడిరోడ్డుపై అందరి ముందే ఈ హత్య జరగడంతో జనం భయంతో పరుగులు తీశారు.

సమాచారం అందుకున్న ఆరిలోవ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, నిందితుడు కిషోర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

చిన్నపాటి ఆటల విషయంలో కూడా యువత సంయమనం కోల్పోయి నేరాలకు పాల్పడటం ఆందోళన కలిగించే విషయం. క్షణికావేశంలో చేసే తప్పులు ఇటు ఒకరి ప్రాణాన్ని తీయడమే కాకుండా, అటు నిందితుడి భవిష్యత్తును కూడా చీకట్లోకి నెట్టేస్తున్నాయి. క్రీడలు అనేవి ఐక్యతను పెంచాలి కానీ, ఇలాంటి హింసకు తావివ్వకూడదు.

Share
Share