- మాదిగ సామాజిక వర్గానికి పెద్దపీట
- రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీనియార్టీ
- జిల్లాకు మరో కేబినెట్ హోదా దక్కే అవకాశం
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్లగొండ జిల్లాకు మరో కేబినెట్ హోదా దక్కనుంది. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశానికి మాదిగ సామాజిక వర్గం కోటాలో ప్రభుత్వ విప్ ఖాయమనే సంకేతాలు వస్తున్నాయి. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీనియార్టీ వీరేశానికి కలిసొస్తుంది. పైగా రాష్ట్రంలో మాదిగ సామాజికవర్గం నుంచి వీరేశానికి ప్రయార్టీ ఇస్తే నల్లగొండ కాంగ్రెస్లో పార్టీకి మైలేజ్ పెరుగుతుంది. మందుల సామేలు ఒకటే సామాజికవర్గం అయినప్పటికీ వీరేశం మూడు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేయగా రెండు సార్లు గెలిచారు. వీరేశానికి హోదా పెంచడం వల్ల అటు బీఆర్ఎస్ ముఖ్యనేతలను సైతం టార్గెట్ చేయోచ్చన్నది కాంగ్రెస్ వ్యూహాం.
ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ప్రభుత్వ చీప్ విప్ కాగా, వీరేశానికి విప్ పదవి లభిస్తే కేబినెట్ హోదా లభిస్తుంది. గతంలో మాదిగ సామాజిక వర్గం నుంచి సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు రాష్ట్ర, జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పారు. ఇప్పుడు అదే పోకడ వీరేశంలోనూ కనిపిస్తోందని, ఆయనకు నిజంగా విప్ అవకాశం దక్కితే అణగారిన వర్గాలకు మరింత మేలు జరుగుతుందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.