Breaking News: 48 వార్డులకు 600కు పైగా ఆప్లికేషన్స్​..

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆపరేషన్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డిని రాజకీయంగా దెబ్బతీసేందుకు మున్సిపల్ ఎన్నికల్లో పక్కా వ్యూహాంతో ముందుకు వెళ్లేందుకు వ్యూహం రూపొందిస్తున్నారు. తిరుమలగిరి రేషన్ కార్డు సభలో సీఎం రేవంత్ రెడ్డి సూర్యాపేట, తుంగతుర్తి బాధ్యతను మంత్రి ఉత్తమ్కు అప్పగించిన సంగతి తెలిసిందే, దాంతో అప్పటి నుంచి ఉత్తమ్ అన్నీతానై వ్యవహారిస్తున్నారు. ముఖ్యంగా దివంగత నేత, మాజీ మంత్రి దామోదర్ రెడ్డి మరణం తర్వాత సూర్యాపేట, తుంగతుర్తిలో పార్టీ బలోపేతం కోసం మంత్రి ఉత్తమ్ మరింత చొరవ చూపించాల్సి వస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో రెబల్స్ కారణంగా కాంగ్రెస్ పార్టీ ఆశించిన స్థాయిలో స్థానాలు కైవసం చేసుకోలేకపోయింది. పార్టీ సింబల్స్తో జరిగే ఈ ఎన్నికలు ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకంగా మారాయి. అయితే దామోదర్ రెడ్డి లేకపోవడంతో సూర్యాపేట కాంగ్రెస్లో సమన్వయం లోపించింది. వర్గ పోరు మరింత ముదిరింది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా మార్కెట్ కమిటీ చైర్మన్, దామోదర్ రెడ్డి సన్నిహితుడు కొప్పుల వేణారెడ్డి తానే మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిని అని ప్రకటించుకోవడం పటేల్ రమేష్ రెడ్డి వర్గానికి అస్సలు నచ్చలేదు. వేణారెడ్డి అంటే గిట్టని నేతలు సైతం దామోదర్ రెడ్డి టీమ్లు ఉండటంతో పార్టీలో విభేదాలు మరింత ముదిరాయి.

48 వార్డులకు 600 మంది ఆశావహులు కౌన్సిలర్ టికెట్ కోసం ఆప్లై చేశారు. దీంతో పార్టీలో అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎవరిని అభ్యర్థిగా డిసైడ్ చేయాలో కూడా పాలుపోని పరిస్థితి నెలకొంది. నోటిఫికేషన్ ప్రకటించిన నాటి నుంచే సర్వోత్తమ్ రెడ్డి ఆప్లికే షన్స్ తీసుకోవడం మొదలు పెట్టారు. దీంతో పార్టీ కార్యకర్తలు, అభిమానులు కలిసి 600 పై చిలుకు అప్లై చేశారు. వార్డుకు రెండు ఆప్లికేషన్స్ ఉండాలని పార్టీ ఆదేశిస్తే ఏకంగా 6 వందల మంది పోటీ పడటంతో పార్టీ హైకమాండ్ కంగుతిన్నది. దీంతో మంత్రి ఉత్తమ్ ఎంట్రీ ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పటి వరకు సర్వోత్తమ్ రెడ్డి, వేణారెడ్డి సూచన మేరకే పార్టీ కార్యక్రమాలు అమలు చేస్తున్నా మంత్రి ఉత్తమ్, అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహారించేందుకు సమన్వయ కమిటీ వేయాలనే నిర్ణయానికి వచ్చారు.

అభ్యర్థులను వడపోసేందుకు హైకమాండ్ ప్రత్యేకంగా సమన్వయ కమిటీ ని నియమించింది. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య, సర్వోత్తమ్ రెడ్డి, వేణారెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి, పోతు భాస్కర్ మరికొంత మంది సీనియర్లతో కలిపి కమిటీ వేయనున్నారు. 48 వార్డుల్లో అభ్యర్థులను తేలుస్తారు. రెబల్స్ లేకుండా కట్టడి చేస్తేనే ఎన్నికల్లో పార్టీ గెలవడం సాధ్యమవుతుందని లేదంటే పంచాయతీ ఎన్నికల ఫలితాలే పట్టణంలో కూడా రిపీట్ అయ్యే ప్రమాదం ఉందని సీనియర్లు హెచ్చరిస్తున్నారు. చైర్మన్ పీఠం దక్కాలంటే కనీసం 30 వార్డులు గెలుపొందాలని, ఆమేరకు అభ్యర్థుల ఎంపికలో జాగ్రత్తలు పాటించాలని చెప్తున్నారు. చైర్మన్ అభ్యర్థి ఎవరనేది ముందుగానే ప్రకటిస్తే లేనిపోని సమస్యలు వస్తాయని, ఎన్నికలయ్యాకే చైర్మన్ ను డిక్లేర్ చేయాలని కమిటీ సభ్యులు భావిస్తున్నారు.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో మూడు వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందిన జగదీష్ రెడ్డిని మున్సిపల్ ఎన్నికల్లో దెబ్బతీయాలంటే పదునైన వ్యూహాన్ని అమలు చేసేందుకు పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. గత మున్సిపల్ ఎన్నికల్లో జనరల్ మహిళ చైర్మన్ స్థానాన్ని ఎస్సీ మహిళకు కేటాయించి రాజకీయంగా క్రెడిట్ కొట్టేశారు. బీసీలు, ఓసీలు పోటీ పడటంతో ఎస్సీ మహిళను చైర్మన్ చేసి రికార్డు సృష్టించారు. ఇప్పుడు జనరల్ చైర్మన్కు రిజర్వు అయ్యింది. కాబట్టి చైర్మన్ స్థానాన్ని బీసీలకు లేదంటే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త కోడలును రంగంలోకి దింపాలని చూస్తున్నారు.

తుంగుతుర్తి నియోజకవర్గంలో కూడా సూర్యాపేట పరిస్థితులే కనిపిస్తున్నాయి. తిరుమలగిరి చైర్మన్ పదవి జనరల్ కోటా జనరల్కు రిజర్వు అయ్యింది. కాంగ్రెస్ తరపున 40 మందికి పైగా అభ్యర్థులు ఆప్లై చేశారు. చైర్మన్ పదవి కోసం రెడ్డి వర్గం నేతలోపాటు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన మాజీ ప్రజాప్రతినిధులు సైతం పోటీ పడుతున్నారు. మోత్కూరు ఎస్సీ మహిళకు రిజర్వు కాగా, ఇక్కడ కూడా పార్టీలో విభేదాలు భగ్గుమంటున్నాయి. అభ్యర్థుల ఎంపికను చేసేందుకు ఎమ్మెల్యే మందుల సామేలు వార్డుల వారీగా సర్వే నిర్వహించారు. ముగ్గురు సభ్యులతో కూడిన బృందంతో అభ్యర్థుల గురించి సర్వే చేయించారు. ఈ రెండు నియోజకవర్గాల ఆప్లికేషన్స్ హైకమాండ్ కు చేరాయి. వీళ్లలో అభ్యర్థులను ఎంపిక చేసే బాధ్యత సమన్వయ కమిటీకి మంత్రి ఉత్తమ్ అప్పగించినట్టు తెలిసింది.

Share
Share