హైదరాబాద్, ఏపీబీ న్యూస్ డెస్క్: 28 ఫిబ్రవరి 2026, ప్రపంచ చరిత్రలో ఒక నిర్ణయాత్మక రోజు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయిల్ PM నెతన్యాహు కలిసి ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ (అమెరికా) మరియు ‘రోరింగ్ లయన్’ (ఇజ్రాయిల్) అనే సంకేత నామాలతో ఇరాన్పై భీకరమైన సంయుక్త సైనిక దాడి ప్రారంభించారు. తెహ్రాన్, ఇస్ఫహాన్, కోమ్, కరాజ్, కెర్మాన్షా నగరాలపై విమాన దాడులు జరిగాయి. ఇరాన్ సుప్రీమ్ లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ (86) హతమయ్యారని ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ స్టేట్ టెలివిజన్ కూడా ఆయన మరణాన్ని నిర్ధారించింది. ఇరాన్ ప్రతీకారంగా మధ్యప్రాచ్యంలోని 27 అమెరికా సైనిక స్థావరాలపై మరియు ఇజ్రాయిల్పై క్షిపణి దాడులు చేసింది.
ఏం జరిగింది?
తెల్లవారుజామున ఇజ్రాయిల్ F/A-18 యుద్ధ విమానాలు, అమెరికా యుద్ధనౌకలు ఒకేసారి ఇరాన్పై మోహరించాయి. తెహ్రాన్లో Pasteur Street పరిసరాల్లో.. ఖమేనీ కాంపౌండ్ సమీపంలో పేలుళ్లు జరిగాయి. ఇరాన్లో అనేక నగరాల్లో ఒకేసారి పేలుళ్లు వినిపించాయి. ఖమేనీ కాంపౌండ్ పూర్తిగా ధ్వంసమైంది. ట్రంప్ Truth Social లో వీడియో పోస్ట్ చేసి ‘ఇరాన్ ప్రజలారా, మీ స్వేచ్ఛ సమయం వచ్చింది’ అని ప్రకటించారు. ఇరాన్ IRGC (రివల్యూషనరీ గార్డ్స్) ప్రతీకారంగా UAE, కతర్, కువైట్, బహ్రెయిన్ వంటి Gulf దేశాల్లోని 27 US స్థావరాలు, ఇజ్రాయిల్ Tel Nof వాయు స్థావరం, Tel Aviv సైనిక కేంద్రంపై దాడులు చేసింది. UAE 137 క్షిపణులు, 209 డ్రోన్లు అడ్డుకుందని నిర్ధారించింది.
అసలు ఎందుకు ఈ దాడి? అధికారిక కారణాలు & నిజమైన కారణాలు
ట్రంప్ మరియు నెతన్యాహు చెప్పిన అధికారిక కారణాలు మూడు: ఇరాన్ అణు కార్యక్రమాన్ని నాశనం చేయడం, ఇరాన్ క్షిపణి సామర్థ్యాన్ని తొలగించడం, మరియు ‘రెజిమ్ చేంజ్’ అంటే ఇరాన్ పాలన మార్చడం. నెతన్యాహు మాటల్లో చెప్పాలంటే ‘ఇరాన్ అణ్వాయుధాలు పొందడం ఇజ్రాయిల్ ఉనికికి ముప్పు.’ ట్రంప్ ఇరాన్ ప్రజలను ‘మీ స్వేచ్ఛ తీసుకు రావడానికి వచ్చాం’ అని సంభాషించారు.
కానీ విశ్లేషకులు చెప్పేది వేరు.. Al Jazeera కోసం మాట్లాడిన Center for International Policy సీనియర్ ఫెల్లో Negar Mortazavi చెప్పారు.. ‘ఇది నిజంగా అమెరికా యుద్ధం కాదు. ఇజ్రాయిల్ రెండు దశాబ్దాలుగా అమెరికాను ఒప్పించిన యుద్ధం. ఇజ్రాయిల్ పుష్ చేసింది, ట్రంప్ అంగీకరించాడు.’ Washington Post నివేదించిన ముఖ్యమైన విషయం: సౌదీ క్రౌన్ ప్రిన్స్ MBS మరియు ఇజ్రాయిల్ ప్రభుత్వం పదే పదే ట్రంప్ను ఒప్పించాయి.. అప్పుడే ట్రంప్ ఈ దాడికి సమ్మతించాడు. అంతేకాదు, US Intelligence Director Tulsi Gabbard జనవరి 2026లో కాంగ్రెస్లో ‘ఇరాన్ అణు ఆయుధం నిర్మిస్తోందని మా అంచనా కాదు’ అని చెప్పింది. అయినా దాడి జరిగింది, అంటే అణ్వాయుధ ముప్పు నిజమైన కారణం కాదు.
యుద్ధం-నేపథ్యం:
| సంవత్సరం | సంఘటన |
| 2018 | ట్రంప్ JCPOA (అణు ఒప్పందం) నుండి US వైదొలిగింది, ఇరాన్ యురేనియం నిల్వలు పెంచింది |
| అక్టో. 2023 | Hamas అక్టోబర్ 7 దాడి, ఇజ్రాయిల్-గాజా యుద్ధం మొదలు |
| ఏప్రిల్ 2024 | ఇజ్రాయిల్ డమాస్కస్లో ఇరాన్ కాన్సులేట్పై దాడి, ఇరాన్ ప్రత్యక్ష క్షిపణి దాడి |
| జూన్ 2025 | 12-రోజుల యుద్ధం: ఇజ్రాయిల్-ఇరాన్. US ఇరాన్ అణు స్థావరాలు బాంబు వేసింది, Ceasefire. |
| జన. 2026 | ఇరాన్లో ఆర్థిక సంక్షోభం, నిరసనలు, ప్రభుత్వం అణచివేత |
| ఫిబ్ర. 6 | Oman మధ్యవర్తిత్వంలో US-ఇరాన్ అణు చర్చలు మొదలు |
| ఫిబ్ర. 27 | జెనీవాలో 3వ రౌండ్ చర్చలు, ‘సానుకూల పురోగతి’ అని Oman ప్రకటన |
| ఫిబ్ర. 28 | చర్చలు జరుగుతుండగానే దాడి. ఖమేనీ హతం. ప్రపంచం మారింది. |
బలాలు & బలహీనతలు: ఎవరు ఎంత శక్తివంతులు?
| US + ఇజ్రాయిల్: బలాలు | ఇరాన్: బలాలు | US + ఇజ్రాయిల్: బలహీనతలు |
| ప్రపంచంలో అత్యుత్తమ వాయుసేన, Stealth విమానాలు, Precision bombs, నౌకాదళ ఆధిక్యం. | హోర్ముజ్ జలసంధి నియంత్రణ, ప్రపంచ చమురు 20% ఇరాన్ గుండా పోతుంది, అనేక దేశాల్లో Proxy దళాలు. | నేల దళాల యుద్ధంలో భారీ నష్టాలు తప్పవు. దీర్ఘకాల ఆర్థిక వ్యయం, అమెరికా ప్రజలకు యుద్ధ అలసట. |
| Iron Dome + David’s Sling అత్యాధునిక క్షిపణి నిరోధ వ్యవస్థ. | భూభాగం విస్తారం (ఇజ్రాయిల్ కంటే 80 రెట్లు), Ballistic missiles, drones పెద్ద సంఖ్యలో. | Congress అనుమతి లేకుండా యుద్ధం-రాజ్యాంగ వివాదం, US అంతర్గత రాజకీయ వ్యతిరేకత. |
ఎవరికి లాభం? ఎవరికి నష్టం?
| లాభపడే వారు ✅ | నష్టపడే వారు ❌ |
| ఇజ్రాయిల్: 20 ఏళ్ళ కల నెరవేరింది. అక్టోబర్ ఎన్నికలకు నెతన్యాహుకి రాజకీయ ఊపు. | ఇరాన్ ప్రజలు: నిర్దోషుల మరణాలు, నగరాలు ధ్వంసం. |
| సౌదీ అరేబియా: ప్రాంతీయ ప్రత్యర్థి ఇరాన్ బలహీనపడింది. | భారత్, చైనా, జపాన్: హోర్ముజ్ మూసుకుంటే చమురు సంక్షోభం, పెట్రోల్ ధరలు భారీగా పెరుగుతాయి. |
| ఇరాన్ ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తులు: Reza Pahlavi వంటి ప్రవాస నాయకులకు అవకాశం. | Gulf Arab దేశాలు: ఇరాన్ క్షిపణి దాడులు వారి మీదా పడ్డాయి. |
ఖమేనీ హతం పరిణామాలు: ఇరాన్లో ఏం జరుగుతుంది?
1989 నుండి ఇరాన్ను పాలించిన ఖమేనీ (86) హతం అవడంతో ఇరాన్ పాలనా వ్యవస్థలో అధికార శూన్యత ఏర్పడింది. రెండు సాధ్యమైన దిశలు:
మొదటి దిశ: IRGC నేతృత్వంలో ఇరాన్ మరింత తీవ్రమైన ప్రతీకారం చేస్తుంది. ‘అమెరికా-ఇజ్రాయిల్ ఆస్తులన్నీ లక్ష్యం అవుతాయి, red lines అంటూ ఏమీ లేవు’ అని IRGC ఇప్పటికే ప్రకటించింది.
రెండో దిశ: అంతర్గత అధికార పోరు కారణంగా పాలనా వ్యవస్థ కుప్పకూలి, ట్రంప్ చెప్పిన ‘రెజిమ్ చేంజ్’ నిజమవుతుంది. ఇరాన్ ప్రవాసంలో ఉన్న Reza Pahlavi (పూర్వ షా కుమారుడు) సంసిద్ధంగా ఉన్నాడు, Kurdish political forces కూడా ‘ఇరాన్ లోపల సేనలు సిద్ధంగా ఉన్నాయి’ అని ప్రకటించాయి.
మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా?
UN Secretary General Guterres ‘ఏ నిమిషమైనా నియంత్రణ తప్పిపోయే ప్రమాదం ఉంది’ అని హెచ్చరించారు. Russia ఇరాన్కు అస్త్ర సాయం ఇచ్చింది, సంపూర్ణ సైనిక మద్దతు ప్రకటించలేదు. China ఖండించింది కానీ సైనికంగా జోక్యం చేసుకోలేదు. Pakistan ఖండించింది. ఈ దశలో అమెరికా నేలపై సేనలు ఇరాన్ ప్రవేశించకపోతే, రష్యా-చైనా ప్రత్యక్షంగా జోక్యం చేసుకోకపోతే, 3వ ప్రపంచ యుద్ధం అవుతుందని చెప్పలేం. కానీ Gulf దేశాల్లో US స్థావరాలపై దాడులు జరుగుతున్నాయి. ఒక US సైనికుడు చనిపోయినా అమెరికా భారీ ప్రతీకారం చేస్తుందని ట్రంప్ హెచ్చరించారు. ఒక్క తప్పు నిర్ణయం, escalation అనేది ఎవరూ ఊహించని దిశకు వెళ్ళవచ్చు.
భారత్‌పై ప్రభావం: మన దేశానికి ఏం జరుగుతుంది?
హోర్ముజ్ జలసంధి గుండా భారత్ చమురు దిగుమతిలో 80 శాతానికి పైగా జరుగుతుందని విశ్లేషకుల అంచనా, ఇరాన్ హోర్ముజ్ మూసివేస్తే Crude oil బ్యారెల్ ధర $15-20 పెరుగుతుంది, పెట్రోల్ ధరలు 30-50 పైసలు పెరుగుతాయి. UAE, కువైట్, బహ్రెయిన్, ఒమాన్, కతర్లో 90 లక్షలకు పైగా భారతీయులు పని చేస్తున్నారు, పేలుళ్లు వ్యాపిస్తే వారి భద్రత, భారత్ అమెరికా వ్యూహాత్మక భాగస్వామి, ఇరాన్తో Chabahar port, చమురు వ్యాపార సంబంధాలు ఉన్నాయి. భారత MEA ‘situation closely monitoring’ అని మాత్రం చెప్పి, ఎటు తేల్చుకోకుండా జాగ్రత్తగా తటస్థంగా ఉంది.
యుద్ధం: నిర్ధారిత ముఖ్యాంశాలు
| అంశం | వివరాలు |
| ఆపరేషన్ పేర్లు | Operation Epic Fury (US) | Roaring Lion (Israel) |
| దాడి తేదీ | 28 ఫిబ్రవరి 2026: తెల్లవారుజామున |
| లక్ష్య నగరాలు | తెహ్రాన్, ఇస్ఫహాన్, కోమ్, కరాజ్, కెర్మాన్షా |
| హతమైన నేత | అయతొల్లా అలీ ఖమేనీ (86): సుప్రీమ్ లీడర్ |
| ఇరాన్ ప్రతీకారం | 27 US స్థావరాలు + ఇజ్రాయిల్ సైనిక కేంద్రాలు |
| UAE అడ్డుకున్నది | 132 క్షిపణులు, 194 డ్రోన్లు నిర్వీర్యం |
| US లక్ష్యాలు (అధికారిక) | అణు నిరోధం, క్షిపణి నాశనం, Regime Change |
| ఇరాన్ 40 రోజులు | జాతీయ సంతాపం ప్రకటించింది |
| UN స్పందన | Emergency UNSC సమావేశం, దాడిని ఖండించింది |
| WW3 ప్రమాదం | అమెరికా నేల దళాలు ప్రవేశించకుంటే తక్కువ, కానీ escalation అనిశ్చితం |
APB News ప్రత్యేక విశ్లేషణ: ‘ఇది శాంతి యుద్ధమా, ఆధిపత్య యుద్ధమా?’
చర్చలు జరుగుతుండగానే.. ఇరాన్ ‘ఎన్నటికీ యురేనియం నిల్వ చేయం’ అని అంగీకరించిన తర్వాత దాడి జరిగింది. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా తెలుస్తోంది.. ఈ యుద్ధం ఎన్నటికీ అణ్వాయుధ నిరోధం గురించి కాదు. Negar Mortazavi చెప్పినట్లు ‘ఇది ఇజ్రాయిల్ యుద్ధం, అమెరికా సాయుధ చేతిగా ఉపయోగించబడుతోంది.’ ఇరాక్లో 2003లో అయిన తప్పు అదే Script, అదే పాత్రలు, కానీ ఇప్పుడు మరింత ప్రమాదకర ప్రాంతంలో, ఇరాన్ ప్రజలకు నిజంగా స్వేచ్ఛ కావాలి, కానీ చరిత్ర చూస్తే బయటి శక్తులు ‘స్వేచ్ఛ’ పేరిట ఇచ్చిన యుద్ధాలు అఫ్ఘానిస్తాన్, ఇరాక్, లిబియాలా ముగిశాయి. ఇప్పుడు ప్రపంచం అత్యంత కీలకమైన ప్రశ్న అడగాలి.. ఈ యుద్ధం ఆగడానికి ఏ దేశం ముందుకు వస్తుంది?