- తిరుమలగిరిలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ
- మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు ఓటమి
- బీఆర్ఎస్ను గెలిపించిన పట్టణ ప్రజలు
- కొంప ముంచిన ముందస్తు చైర్మన్ అభ్యర్థి ప్రకటన
- సొంత పార్టీలో గొడవలు…బీఆర్ఎస్కు చీలిన ఓట్లు
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: రాష్ట్రంలో రేషన్ కార్డుల కార్యక్రమాన్ని ప్రారంభించిన తిరుమలగిరి మున్సిపాలిటీలోనే కాంగ్రెస్ ఘోరంగా దెబ్బతిన్నది. గతేడాది జులై 14న సీఎం రేవంత్ రెడ్డి తిరుమలగిరి లో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్నగర్ లో ఉగాది నాడు సన్నబియ్యం ప్రారంభించగా, తాను పుట్టిన తాటిపాముల గ్రామం తిరుమలగిరి లో ఉండటంతో సెంటిమెంట్ కలిస్తొదని ప్రత్యేక శ్రద్ధ వహించి అక్కడే సీఎం సభ నిర్వహించారు, కానీ ఏడాది కూడా తిరగముందే జరిగిన మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది. పట్టణ ఓటర్లు బీఆర్ఎస్ ను గెలిపించారు. 15 వార్డుల్లో 10 వార్డులు బీఆర్ఎస్, 5 వార్డులు కాంగ్రెస్ గెలిచింది. పార్టీ ఓడిపోవడాని గల కారణాలు విశ్లేషిస్తే సీనియర్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
మంత్రి ఉత్తమ్ ఇంచార్జి… అయినా తప్పని ఓటమి
సూర్యాపేట జిల్లాలోని మున్సిపాలిటీల గెలుపు బాధ్యతలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భుజాన వేసుకున్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా హెలికాప్టర్లో సుడిగాలి పర్యటనలు చేశారు. తిరుమలగిరిని గెలిపించి మంత్రి ఉత్తమ్ కు బహుమతిగా ఇస్తామని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సైతం ఇదే సభలో ప్రకటించారు. దీనిలో భాగంగానే తిరుమలగిరి సభలో మంత్రి ఉత్తమ్ చైర్మన్ అభ్యర్థిని ముందుగానే ప్రకటించారు. అప్పటికే బీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థిగా రఘునందన్ రెడ్డిని ప్రకటించిన నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ సైతం అశోక్ రెడ్డి భార్యను వెల్లడించారు. తన సొంత నియోజక వర్గాల్లో చైర్మన్ అభ్యర్థులు ప్రకటించకుండా జాగ్రత్త పడ్డ ఉత్తమ్, తిరుమలగిరి, సూర్యాపేటలో మాత్రమే చైర్మన్ ను అధికారికంగా ప్రకటించారు. అయితే సూర్యాపేటలో చైర్మన్ అభ్యర్థి ఎన్నికల్లో పెట్టుబడి పెడ్తారనే ఒప్పందం మేరకు ముందస్తు ప్రకటన జరిగింది.

తిరుమలగిరిలో సైతం ఎమ్మెల్యే మందుల సామేలు సూచన మేరకు ఉత్తమ్ ప్రకటించారని తెలిసింది. అయితే పార్టీలో చర్చించకుండా ఏక పక్షంగా ఎమ్మెల్యే తీసుకున్న నిర్ణయం పట్ల అభ్యర్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన అశోక్ రెడ్డి భార్య బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు సర్పంచ్, భర్త మార్కెట్ కమిటీ చైర్మన్గా పనిచేశారు. దీంతో మళ్లీ చైర్మన్ పదవి కూడా అశోక్ రెడ్డి అని ప్రకటించడంతో అభ్యర్థులు తలోదిక్కుకు వెళ్లారు, చివరకు అశోక్ రెడ్డి భార్యను కూడా ఓడించారు.
10 వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి కేవలం రెండు ఓట్ల తేడాతో ఓడిపోయారు. కౌన్సిలర్ క్యాండేట్లను ప్రకటించడం కూడా ఆలస్యం చేశారు. బీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థితో సహా, కౌన్సిలర్లను ప్రకటించిన పదిహేను రోజులు ఆలస్యంగా కాంగ్రెస్ అభ్యర్థులను అనౌన్స్ చేశారు. దీంతో రెబల్ అభ్యర్థులు పోటీ చేయడం, అభ్యర్థుల పట్ల పార్టీల్లో, ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమైంది. సొంత పార్టీ లీడర్లే లోపాయికారికంగా క్రాస్ ఓటింగ్ పాల్పడటంతో కాంగ్రెస్ పుర పీఠం చేజారిపోయింది. మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ ప్రకటించిన చైర్మన్ క్యాండేట్ రఘునందన్ రెడ్డి పట్ల ప్రజ ల్లో సానుకూల స్పందన ఉండటం, ఎన్నికల ఖర్చు వెనాకాడకుండా పెట్టడంతో ఆపార్టీ 10 వార్డులను కైవసం చేసుకుంది.