- ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక పార్కింగ్ స్థలాలు
- ఎన్నికల ఫలితాల అనంతరం విజయోత్సవ ర్యాలీలకు అనుమతులు లేవు: జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్
నల్లగొండ, ఏపీబీ న్యూస్: నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు ఆరు మున్సిపాలిటీలలో నిర్వహించబడిన మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా మరియు నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సమగ్ర భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, తెలిపారు. జిల్లాలోని అన్ని కౌంటింగ్ కేంద్రాలు మరియు స్ట్రాంగ్ రూముల వద్ద మూడంచెల భద్రతా వ్యవస్థను అమలు చేసినట్లు ఆయన వెల్లడించారు. టీజీఎస్పీ, ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్), సివిల్ పోలీస్ సిబ్బందిని నియమించి 24 గంటల నిఘా కొనసాగుతోందన్నారు. స్ట్రాంగ్ రూముల వద్ద సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణతో పాటు ప్రవేశ, నిష్క్రమణ పాయింట్ల వద్ద కఠిన తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు.
కౌంటింగ్ కేంద్రాలు ఇవీ
ఉదయం 8.00 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతున్న నేపథ్యంలో నల్లగొండ కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు ఆర్జాలబావి కౌంటింగ్ కేంద్రంలో, చిట్యాల, దేవరకొండ, చండూరు, నిడుమనూరు మున్సిపాలిటీల కౌంటింగ్ నల్లగొండ సోషల్ వెల్ఫేర్ స్కూల్ లో, మిర్యాలగూడ, హాలియా, నందికొండ మున్సిపాలిటీల కౌంటింగ్ మిర్యాలగూడ మండలం అవంతీపురం మార్కెట్ యార్డు ప్రాంగణం లో జరుగనున్నాయని తెలిపారు.
పకడ్బందీగా పోలీస్ బందోబస్తు
ప్రత్యక్ష పర్యవేక్షణలో ప్రతి కౌంటింగ్ కేంద్రం వద్ద ఒక డీఎస్పీ అధికారి ఆధ్వర్యంలో 15 మంది సీఐలు, 40 మంది ఎస్ఐలు ,ఇతర సిబ్బందితో కలిపి సుమారు 600 మంది పోలీస్ సిబ్బందిని బందోబస్తుకు నియమించినట్లు తెలిపారు. కౌంటింగ్ హాల్లోకి ఇంక్ బాటిల్స్, పెన్నులు, మార్కర్లు, సెల్ ఫోన్లు, కెమెరాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, బ్యాగులు, పర్సులు అనుమతించరు.
ఎన్నికల అధికారులు ఇచ్చిన గుర్తింపు కార్డులు కలిగిన సిబ్బంది, అభ్యర్థుల ఏజెంట్లు మాత్రమే నిర్దిష్ట నియమ నిబంధనల ప్రకారం లోపలికి అనుమతిస్తారు. కౌంటింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయబడినట్లు తెలిపారు. అభ్యర్థులు, ఏజెంట్లు, అధికారుల వాహనాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.
విజయోత్సవ ర్యాలీలు నిషేదం
కౌంటింగ్ అనంతరం ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున గెలుపొందిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు, భారీ ఊరేగింపులు, బాణాసంచా కాల్చడం, డీజే సౌండ్ సిస్టమ్ వినియోగించడం వంటి కార్యక్రమాలకు అనుమతి లేదని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు.