తిరుమలగిరి, ఏపీబీ న్యూస్: తిరుమలగిరి మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. మున్సిపాలిటీ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ (గులాబీ జెండా) విజయకేతనం ఎగురవేయడంతో, ఆ పార్టీ శ్రేణులు నిర్వహించ తలపెట్టిన విజయోత్సవ ర్యాలీని పోలీసులు అడ్డుకోవడం స్థానికంగా కలకలం రేపింది.
పోలీసుల లాఠీఛార్జ్ – ఎమ్మెల్యేపై ఆరోపణలు:
బీఆర్ఎస్ కార్యకర్తల కథనం ప్రకారం.. స్థానిక ఎమ్మెల్యే మందుల సామెల్ ఒత్తిడితోనే పోలీసులు తమ విజయోత్సవాలను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ర్యాలీని నిలువరించే క్రమంలో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. ఈ క్రమంలో పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. శాంతియుతంగా జరుగుతున్న ర్యాలీని కావాలనే భగ్నం చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు.
ఎస్.ఐ తీరుపై నిరసన:
ర్యాలీ సందర్భంగా అర్వపల్లి ఎస్.ఐ సైదులు బీఆర్ఎస్ కార్యకర్తలను ఉద్దేశించి దుర్భాషలాడారని సమాచారం. దీనిని తీవ్రంగా పరిగణించిన పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు ఎస్.ఐని నిలదీశారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. పోలీసులు కార్యకర్తలపై విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేయడంతో తిరుమలగిరి పట్టణంలో భయాందోళనలు నెలకొన్నాయి.
అణచివేత రాజకీయాలు సాగవు: బీఆర్ఎస్ మెజారిటీ వార్డుల్లో గెలిచి మున్సిపాలిటీని కైవసం చేసుకున్న ఆనందంలో ఉన్న తమపై, అధికార బలంతో దాడులు చేయించడం ప్రజాస్వామ్య విరుద్ధమని బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఎమ్మెల్యే మందుల సామెల్ పోలీసులను పావులుగా వాడుకుంటున్నారని వారు విమర్శించారు. ప్రస్తుతం తిరుమలగిరిలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు.