హైదరాబాద్, ఏపీబీ న్యూస్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల టీచర్లు, కళాశాల అధ్యాపకులు మరియు బోధనేతర సిబ్బంది జీతాలు మార్కెట్ ప్రమాణాల కంటే అధికంగా ఉన్నాయని విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేసిన నివేదికలో స్పష్టం చేశారు. ఈ జీతాలు, అలవెన్సులను సమీక్షించి క్రమబద్దీకరించాలని కమిషన్ సూచించింది.
రాష్ట్ర ఖజానాపై భారం
ప్రభుత్వ ఉపాధ్యాయులకు చెల్లిస్తున్న, పెరుగుతున్న జీతాలు మరియు అలవెన్సులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు తీవ్రమైన భారంగా మారాయని నివేదిక పేర్కొంది. దీని కారణంగా పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, నాణ్యమైన విద్య అందించడం కష్టంగా తయారవుతుందని కమిషన్ అభిప్రాయపడింది. టీచర్ల జీతాలు తగ్గించడం ద్వారా మిగిలే నిధులను పాఠశాలల మౌలిక వసతుల కల్పనకు వినియోగించవచ్చని నివేదిక సూచించింది.
ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు సిఫార్సు
ప్రైవేట్ కాలేజీలకు ఇప్పటివరకు అందిస్తున్న ఫీజు రీయింబర్స్మెంట్ను రద్దు చేయాలని కమిషన్ రేవంత్ రెడ్డికి సిఫార్సు చేసింది. ఈ పథకం కారణంగా రాష్ట్ర ఖజానాపై ఏటా వందల కోట్ల రూపాయల భారం పడుతుందని, ఈ మొత్తాన్ని ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతానికి మళ్ళించాలని నివేదిక స్పష్టం చేసింది.
ఉపాధ్యాయ సంఘాల వ్యతిరేకత
ఈ నివేదిక వెలువడిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ‘ఉపాధ్యాయుల జీతాలు తగ్గించడం విద్యా వ్యవస్థను బలోపేతం చేయదు, బదులుగా మరింత నీరసింపజేస్తుంది’ అని సంఘాలు హెచ్చరిస్తున్నాయి. 6వ వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా నిర్ణయించిన జీతాలను ఏకపక్షంగా తగ్గించడం న్యాయసమ్మతం కాదని టీచర్లు వాదిస్తున్నారు.
ప్రభుత్వ విద్యా వ్యవస్థను సంస్కరించాలనే లక్ష్యం సాధువైనదే అయినా, టీచర్ల జీతాలను తగ్గించడం ఒక్కటే పరిష్కారం కాదు. నిజంగా సంస్కరణ కావాలంటే.. టీచర్ల జీతాల నాణ్యత కాపాడుతూనే, అవినీతి లేకుండా నిధులు ఖర్చు చేయడంపై దృష్టి పెట్టాలి. విద్యా వ్యవస్థ బలహీనతకు టీచర్ల జీతాలు కారణం కావు, పాలనా వైఫల్యాలే అసలు కారణం. రేవంత్ సర్కారు ఈ నివేదికను అమలు చేయడానికి ముందు, ఉపాధ్యాయులతో, సంఘాలతో, విద్యా నిపుణులతో విస్తృత చర్చలు జరపాలని APB News అభిప్రాయపడుతోంది.