Breaking News: బెంగళూరులో తెలంగాణ టెక్కీల విషాదాంతం: ప్రియుడి ఆత్మహత్య తట్టుకోలేక..

బెంగళూరు/హైదరాబాద్, ఏపీబీ న్యూస్: ఐటీ హబ్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా స్థిరపడిన ఇద్దరు తెలంగాణ యువతీయువకుల ప్రేమకథ విషాదాంతమైంది. తన కళ్లముందే విగతజీవిగా పడి ఉన్న ప్రియుడిని చూసి తట్టుకోలేక, ఆ యువతి అపార్ట్మెంట్ 17వ అంతస్తు నుండి దూకి ప్రాణాలు వదిలింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

సిద్దిపేట జిల్లా ములుగు మండలం అన్నాసాగర్ గ్రామానికి చెందిన రఘుపతిరెడ్డి, జయమ్మ దంపతుల పెద్ద కుమారుడు భానుచందర్ రెడ్డి (32) గత 13 ఏళ్ల క్రితం ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్ళాడు. రెండేళ్ల క్రితం తిరిగి వచ్చి బెంగళూరులో స్థిరపడి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో, తనతో పాటు చదువుకున్న మేడ్చల్ జిల్లాకు చెందిన బీబీ షాజియా సిరాజ్ (31) అనే యువతితో సహజీవనం (Live-in Relationship) చేస్తున్నాడు.

వీరిద్దరూ బెంగళూరులోని ధణసింద్ర మెయిన్ రోడ్డులో ఉన్న ‘నికో హోమ్స్’ అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు.

ప్రియుడి బలవన్మరణం: ఇటీవల షాజియా తన స్వగ్రామానికి వెళ్లి, తిరిగి బెంగళూరుకు వచ్చేసరికి అపార్ట్మెంట్లో భానుచందర్ రెడ్డి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని కనిపించాడు.

ప్రియురాలి సాహసం: అప్పటివరకు తనతో ప్రాణంగా ఉన్న వ్యక్తి విగతజీవిగా మారడం చూసి షాజియా తీవ్ర మనస్తాపానికి గురైంది. ఆ బాధను తట్టుకోలేక వెంటనే అపార్ట్మెంట్ 17అంతస్తు పైకి వెళ్లి అక్కడి నుండి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టారు.

తల్లిదండ్రులకు తెలియదు: తమ కుమారుడు ఇండియాకు తిరిగి వచ్చాడనే విషయమే తమకు తెలియదని భానుచందర్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

అనారోగ్య కారణమా?: గత కొంతకాలంగా భానుచందర్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడని, ఆ మానసిక వేదనతోనే అతను ఆత్మహత్య చేసుకుని ఉంటాడని స్థానికులు పోలీసులకు తెలిపారు.

మిస్టరీగా వివరాలు: షాజియా కుటుంబ సభ్యులు ఆమెకు సంబంధించిన వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు. ఘటనా స్థలంలో ఎటువంటి సూసైడ్ నోట్ లభించకపోవడంతో పోలీసులు దీనిని అనుమానాస్పద మరణాలుగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఉన్నత చదువులు చదివి, విదేశాల్లో స్థిరపడి, మంచి జీతాలు పొందుతున్న యువత ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం ఆందోళన కలిగిస్తోంది. ప్రేమ విఫలమవ్వడం లేదా అనారోగ్య సమస్యలు ఎదురైనప్పుడు మనోస్థైర్యాన్ని కోల్పోయి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం గమనార్హం. తల్లిదండ్రులకు కనీస సమాచారం కూడా లేకుండా ప్రాణాలు తీసుకోవడం ఆ కుటుంబాలకు తీరని లోటును మిగిల్చింది. సమస్య ఏదైనా ప్రాణం తీసుకోవడం పరిష్కారం కాదని యువత గుర్తించాలి.

Share
Share