ఏపీ తరహా తెలంగాణలో కూడా వాలంటీర్ల వ్యవస్థ: నేడే శిక్షణా కార్యక్రమం..

హైదరాబాద్, ఏపీబీ న్యూస్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా మరో కీలక అడుగు వేసింది. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లోని వాలంటీర్ల వ్యవస్థ తరహాలో, తెలంగాణలో కూడా వాలంటీర్లను నియమించాలని నిర్ణయించింది. అయితే, ఇవి కేవలం సంక్షేమ పథకాల కోసమే కాకుండా, పూర్తిగా వ్యవసాయాధారిత ‘సాయిల్ హెల్త్ వాలంటీర్లు’ (Soil Health Volunteers) గా పని చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివరాలను వెల్లడించారు.

వ్యవసాయ శాఖ ప్రణాళిక ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామానికి ముగ్గురు వాలంటీర్లను కేటాయించనున్నారు. తద్వారా రాష్ట్రం మొత్తం మీద సుమారు 30,000 మంది యువతకు ఈ వాలంటీర్ వ్యవస్థలో అవకాశం లభించనుంది. వీరు నేరుగా రైతులకు మరియు వ్యవసాయ అధికారులకు మధ్య వారధిలా పనిచేస్తారు.

మట్టి నమూనాల సేకరణ: గ్రామాల వారీగా రైతుల పొలాల్లో మట్టి నమూనాలను సేకరించి, పరీక్షల కోసం ల్యాబ్లకు పంపించడం.

సాయిల్ హెల్త్ కార్డులు: భూమి సారం ఆధారంగా ఏ పంటలు వేయాలి? ఏ ఎరువులు ఎంత మోతాదులో వాడాలో రైతులకు వివరించడం.

అవగాహన కల్పించడం: విచ్చలవిడిగా ఎరువులు వాడటం వల్ల కలిగే నష్టాలపై రైతులకు అవగాహన కల్పించి, పెట్టుబడి ఖర్చు తగ్గించడంలో తోడ్పడటం.

ఈ వాలంటీర్ వ్యవస్థను వేగంగా అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్న ప్రభుత్వం, వీరికి ఇవాల్టి నుండి శిక్షణా కార్యక్రమాలను ప్రారంభించనుంది. మట్టి పరీక్షలు ఎలా చేయాలి, సాంకేతిక పరికరాలను ఎలా వాడాలి అనే అంశాలపై వీరికి నిపుణుల ద్వారా శిక్షణ ఇవ్వనున్నారు.

తెలంగాణలో ఏఈవోలు (AEO) ఉన్నప్పటికీ, ప్రతి గ్రామానికి ముగ్గురు వాలంటీర్లు అందుబాటులో ఉండటం వల్ల రైతులకు సేవలు మరింత వేగవంతం అవుతాయి. ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ సామాజిక పింఛన్లు, రేషన్ కార్డులపై దృష్టి సారించగా, తెలంగాణ ప్రభుత్వం దీనిని కేవలం వ్యవసాయానికి పరిమితం చేయడం విశేషం. ఇది రైతుల ఆదాయాన్ని పెంచడమే కాకుండా, భూసారాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది.

Share
Share