నల్లగొండ, ఏపీబీ న్యూస్: తెలంగాణ పోలీస్ శాఖ పౌర సేవలలో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. దేశంలోనే మొదటిసారిగా, కొన్ని ప్రత్యేక కేసుల్లో బాధితులు పోలీస్ స్టేషన్కు రావాల్సిన అవసరం లేకుండా, వారి ఇంటి వద్దే ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేసే విధానాన్ని అమలులోకి తెచ్చింది. బుధవారం నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఈ విప్లవాత్మక మార్పు గురించి కీలక వివరాలు వెల్లడించారు.
ఒక్క ఫోన్ కాల్తో ఇంటికే పోలీసులు
బాధితుల హక్కులను కాపాడుతూ, వారి గౌరవానికి భంగం కలగకుండా వృత్తిపరమైన సేవలు అందించడమే ఈ విధానం ప్రధాన ఉద్దేశమని ఎస్పీ తెలిపారు. ఏదైనా నేరం జరిగినప్పుడు బాధితులు డైల్ 100 లేదా 112 కు ఫోన్ ద్వారా సమాచారం అందిస్తే చాలు. బాధితులు మహిళలు, చిన్నారులు లేదా తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నవారైతే, పోలీసులే నేరుగా వారి ఇంటికి లేదా వారు కోరిన ప్రదేశానికి (ఆసుపత్రి లేదా ఘటనా స్థలం) చేరుకుంటారు.
ఏయే కేసుల్లో ఈ సదుపాయం ఉంటుంది?
ఎస్పీ శరత్ చంద్ర పవార్ వివరణ ప్రకారం, ఈ కేసుల్లో బాధితులు ఇంటి వద్దే ఫిర్యాదు చేయవచ్చు:
- మహిళలు మరియు చిన్నారులపై జరిగే నేరాలు.
- శారీరక దాడులు మరియు ఆస్తి వివాదాలు.
- పోక్సో (POCSO) చట్టం కింద నమోదయ్యే కేసులు.
- ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద వచ్చే కేసులు.
- బాల్య వివాహాల నిషేధ చట్టం మరియు ర్యాగింగ్ నిరోధక చట్టం ఉల్లంఘనలు.
- దొంగతనాలు మరియు రోడ్డు ప్రమాదాలు.
అక్కడికక్కడే విచారణ – వేగవంతమైన ప్రక్రియ
కొత్త నిబంధనల (భారతీయ నాగరిక సురక్తా సంహిత – BNSS) ప్రకారం, పోలీస్ అధికారులు బాధితుల వద్దే ఫిర్యాదు స్వీకరించి, వారి స్టేట్మెంట్ను రికార్డ్ చేస్తారు. అక్కడికక్కడే ఆధారాలను సేకరించి, ఎఫ్ఐఆర్ కాపీని బాధితులకు అందజేస్తారు. నిన్ననే (జనవరి 21, 2026) రాష్ట్రంలో మొదటిసారిగా ఈ విధానం కింద కేసు నమోదు కావడం విశేషం. జిల్లాలో ఈరోజు ఆసుపత్రికి పోలీసులు వెళ్లి మొదటి ఎఫ్ఐఆర్ ని నమోదు చేశారు. బాధితులకు తక్షణ సాయం అందించడం లక్ష్యంగా నల్గొండ పోలీసులు పౌర కేంద్రీకృత పోలీసింగ్ ను చాటుకున్నారు దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మదనపురం నివాసి గురువయ్య వద్దకే కనగల్ పోలీసులు స్వయంగా వెళ్లారు స్టేషన్కు రాలేని స్థితిలో ఉన్న ఆయన వాంగ్మూలాన్ని బెడ్ పైన నమోదు చేసి అక్కడికక్కడే కేసు ఫైల్ చేశారు.
“బాధితులు స్టేషన్కు వచ్చి గంటల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదు. వారి వద్దకే వెళ్లి సత్వర న్యాయం అందించడమే మా లక్ష్యం.” – ఎస్పీ శరత్ చంద్ర పవార్