Breaking News: తెలంగాణలో గులాబీ జోరు.. వరుసగా మున్సిపాలిటీలు కైవసం!

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో భారత రాష్ట్ర సమితి (BRS) తన సత్తా చాటుతోంది. సంగారెడ్డి జిల్లాతో పాటు పలు జిల్లాల్లో గులాబీ జెండా రెపరెపలాడింది. రాష్ట్రవ్యాప్తంగా వెలువడుతున్న ఫలితాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శిస్తూ మున్సిపల్ పీఠాలను కైవసం చేసుకుంటున్నారు.

హైదరాబాద్, ఏపీబీ న్యూస్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్లో బీఆర్ఎస్ (BRS) పార్టీ అంచనాలను మించి దూసుకుపోతోంది. సంగారెడ్డి జిల్లాలో వరుస విజయాలతో ప్రత్యర్థులకు షాక్ ఇస్తూ, కీలక మున్సిపాలిటీలను తన ఖాతాలో వేసుకుంది. ప్రధానంగా గడ్డపొతారం, గుమ్మడిదల వంటి ప్రాంతాల్లో బీఆర్ఎస్ ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది.

సంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ తన పట్టును నిరూపించుకుంది. గడ్డపొతారం మున్సిపాలిటీని కైవసం చేసుకోవడం ద్వారా ఎన్నికల ఫలితాల్లో మొదటి బోణీ కొట్టింది. ఇక్కడి మొత్తం వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు 14 చోట్ల విజయం సాధించగా, కాంగ్రెస్ 3 స్థానాలకు పరిమితమైంది. ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు.

అదేవిధంగా, గుమ్మడిదల మున్సిపాలిటీలోనూ బీఆర్ఎస్ జైత్రయాత్ర కొనసాగింది. మొత్తం 22 వార్డులకు గాను బీఆర్ఎస్ 14 వార్డులను గెలుచుకుని మున్సిపల్ పీఠాన్ని దక్కించుకుంది. కాంగ్రెస్ 4, బీజేపీ 2, స్వతంత్రులు 1 స్థానంలో గెలుపొందారు.

పటాన్చెరు నియోజకవర్గంలోని నాలుగు మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న బీఆర్ఎస్ పార్టీ గడ్డపోతారం, జిన్నారం, గుమ్మడిదల, ఇంద్రేశం.

మంచిర్యాల జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మంత్రి వివేక్ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలోని క్యాతనపల్లి మున్సిపాలిటీని బీఆర్ఎస్ సొంతం చేసుకుంది. ఇక్కడ 22 వార్డులకు గాను బీఆర్ఎస్ 10 వార్డులను గెలుచుకోగా, కాంగ్రెస్ 7, సీపీఐ 4, స్వతంత్ర అభ్యర్థి ఒకరు విజయం సాధించారు.

తిరుమలగిరి మున్సిపాలిటీ: బీఆర్ఎస్ తన ఖాతాలో వేసుకున్న 4వ మున్సిపాలిటీ ఇది. ఇక్కడ మొత్తం 15 వార్డులు ఉండగా, 8 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించి మెజారిటీని నమోదు చేశారు.

తొర్రూరు మున్సిపాలిటీ: 5వ మున్సిపాలిటీగా తొర్రూరును బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మొత్తం 16 వార్డులకు గాను బీఆర్ఎస్ 10 స్థానాలను దక్కించుకోగా, కాంగ్రెస్ 6 స్థానాలకు పరిమితమైంది.

రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ సాధిస్తున్న ఈ వరుస విజయాలు ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. మెజారిటీ స్థానాల్లో గులాబీ అభ్యర్థుల గెలుపు ఖాయం కావడంతో మున్సిపల్ కార్యాలయాల వద్ద సంబరాలు అంబరాన్నంటుతున్నాయి.

Share
Share