Breaking News: రేపే ఇంటర్ ఫలితాలు: ఇక వాట్సాప్‌లోనే రిజల్ట్స్.. ఐటీ మంత్రి

హైదరాబాద్, ఏపీబీ న్యూస్: తెలంగాణ విద్యా రంగంలో మరో కీలక ముందడుగు పడింది. రేపు (ఏప్రిల్ 12) విడుదల కానున్న ఇంటర్మీడియట్ ఫలితాలను విద్యార్థులు ఎంతో సులభంగా, తమ వాట్సాప్ ద్వారానే పొందే సౌకర్యాన్ని తెలంగాణ ప్రభుత్వం కల్పించింది. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీ డి. శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో ప్రారంభమైన ‘మీసేవా వాట్సాప్’ చాట్బాట్ ఈ అద్భుతమైన సేవను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువచ్చింది.

వెబ్సైట్లు మొరాయించడం, సర్వర్ డౌన్ అవ్వడం వంటి సమస్యలకు ఇక చెక్ పడనుంది. విద్యార్థులు ఈ క్రింది విధానం ద్వారా ఫలితాలను పొందవచ్చు:

  1. ముందుగా 8096958096 నంబర్ను మీ ఫోన్లో సేవ్ చేసుకోండి.
  2. వాట్సాప్లో ఆ నంబర్కు “Hi” అని మెసేజ్ చేయండి.
  3. మెనూలో “BIE Exam Result” ఆప్షన్ను ఎంచుకోండి.
  4. మీ హాల్ టికెట్ నంబర్, సంవత్సరం, స్ట్రీమ్ వివరాలు నమోదు చేయండి.
  5. తక్షణమే మీ ఫలితాల వివరాలు పిడిఎఫ్ (PDF) రూపంలో వాట్సాప్లోకి వచ్చేస్తాయి.

గతంలో ఇదే ప్లాట్ఫామ్ ద్వారా లక్షలాది మందికి హాల్ టిక్కెట్లను పంపిణీ చేసి విజయవంతమైన ఐటీ శాఖ, ఇప్పుడు ఫలితాలను కూడా చేరవేస్తోంది. ప్రస్తుతం ఈ వాట్సాప్ చాట్బాట్ ద్వారా 580కి పైగా ప్రభుత్వ సేవలను పౌరులు తమ ఇంటి వద్దే పొందుతున్నారు. “పాలనను ప్రతి పౌరుడి అరచేతిలోకి తీసుకురావడమే మా లక్ష్యం” అని మంత్రి శ్రీధర్ బాబు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

సాధారణంగా ఫలితాల విడుదల సమయంలో వెబ్సైట్లు ఓపెన్ కాక విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతుంటారు. మీసేవా వాట్సాప్ ద్వారా ఫలితాలు అందించడం వల్ల అటు విద్యార్థులకు మానసిక ప్రశాంతత, ఇటు ఇంటర్నెట్ సెంటర్లకు వెళ్లే ఖర్చు, సమయం ఆదా అవుతాయి. దేశంలోనే అత్యంత వేగంగా సేవలు అందిస్తున్న డిజిటల్ పబ్లిక్ సర్వీస్ ఛానెల్గా తెలంగాణ మీసేవా నిలవడం గర్వకారణం.

Share
Share