Breaking News: ఏపీలో భారీగా నమోదవుతున్న టీనేజ్ ప్రెగ్నెన్సీలు

అమరావతి, ఏపీబీ న్యూస్: ఆంధ్రప్రదేశ్లో టీనేజ్ ప్రెగ్నెన్సీలు (బాల్య గర్భధారణలు) ఆందోళనకర రీతిలో పెరుగుతున్నాయి. తాజా ‘పాపులేషన్ మేనేజ్మెంట్ సర్వే 2025-26’ నివేదిక ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా సగటున 8.8 శాతం టీనేజీ గర్భధారణలు నమోదయ్యాయి. ప్రభుత్వం నిర్దేశించుకున్న 5 శాతం బెంచ్ మార్క్ కంటే ఇది చాలా ఎక్కువగా ఉండటం గమనార్హం.

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ సమస్య తీవ్రత ఎక్కువగా ఉంది. ముఖ్యంగా పల్నాడు, కర్నూలు జిల్లాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

  • పల్నాడు జిల్లా: అత్యధికంగా 14.94% టీనేజ్ ప్రెగ్నెన్సీలు నమోదై రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది.
  • కర్నూలు జిల్లా: 13.50% గర్భధారణలతో రెండో స్థానంలో ఉంది.
  • ఇతర జిల్లాలు: నెల్లూరు, ప్రకాశం, అనంతపురం, బాపట్ల జిల్లాల్లో కూడా 12 శాతానికి పైగా గర్భధారణలు నమోదయ్యాయి.
  • అత్యల్పం: విశాఖపట్నం జిల్లాలో మాత్రమే అత్యల్పంగా 3.98% నమోదై, రాష్ట్రంలో బెంచ్ మార్క్ (5%) కంటే తక్కువ ఉన్న ఏకైక జిల్లాగా నిలిచింది.

టీనేజ్ వయసులో బాలికలు గర్భం దాల్చడానికి ప్రధానంగా బాల్యవివాహాలు కారణమని అధికారులు గుర్తించారు. ఇంకా..

  1. అత్యాచారాలు: కొన్ని ప్రాంతాల్లో లైంగిక దాడుల కారణంగా బాలికలు గర్భం దాల్చుతున్న ఘటనలు కూడా గణాంకాల పెరుగుదలకు కారణమవుతున్నాయి.
  2. అవిద్య: గ్రామీణ ప్రాంతాల్లో సరైన అవగాహన లేకపోవడం, పేదరికం వల్ల బాలికలను త్వరగా వివాహం చేయడం ఈ సమస్యకు దారితీస్తోంది.
  3. సామాజిక పరిస్థితులు: కొన్ని సామాజిక వర్గాల్లో ఆచారాల పేరుతో చిన్న వయసులోనే అత్తవారింటికి పంపడం వంటివి టీనేజ్ ప్రెగ్నెన్సీలకు ఊతమిస్తున్నాయి.

19 ఏళ్ల కంటే తక్కువ వయసులో గర్భం దాల్చడం వల్ల తల్లి, శిశువు ఇద్దరికీ ప్రాణాపాయం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అధిక రక్తపోటు (Preeclampsia), శిశువు తక్కువ బరువుతో జన్మించడం, ప్రసవ సమయంలో మరణాల రేటు పెరగడం వంటి ముప్పులు పొంచి ఉన్నాయి. ప్రభుత్వం 2026-27 నాటికి ఈ శాతాన్ని 5 లోపుకు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Share
Share