జాజి రెడ్డిగూడెం(APB News):
విద్యార్థుల జీవితాల్లో వెలుగు రేఖలు నింపిన గురువు మీరు
దేశానికి అన్నం పెట్టే రైతన్న బాగుకోసం పరితపించిన హృదయం మీది.
- ప్రజాస్వామ్యంలో ప్రజలే శక్తివంతులని విశ్వసించిన రాజనీతిజ్జులు మీరు
- హక్కుల చట్టాలను ఆయుధంగా మలిచిన సామాన్యుల హక్కుల పరిరక్షకులు మీరు
- అక్రమార్కుల పాలిట కొదమ సింహం మీరు
- ప్రజల తరఫున అలుపెరగని పోరాటం చేసినవారు మీరు
కార్యసాధకుడా వందనం
ఓ …కష్టజీవీ అభివందనం
సమాజ హితుడా పాదాభివందనం..
మీరు మానుంచి భౌతికంగా దూరమైనా
మా గుండెల్లో మీ స్ఫూర్తి నిత్యం సజీవంగానే వుంటది.
మీ ఆశయాలను కొనసాగిస్తాం ..
కిష్టయ్యసార్ గురించి..
జాజిరెడ్డి గూడెం గ్రామంలో ఓ పేద మున్నూరు కాపు కుటుంబంలో అర్వయ్య, సత్తెమ్మ దంపతులకు కిష్టయ్య సార్ జన్మించారు. కోటమర్తి గ్రామానికి చెందిన వారి సమీప బంధువు నువ్వుల వీరయ్య గారి కుమార్తె లక్ష్మమ్మను వివాహం చేసుకున్నారు. కిష్టయ్యసార్ దంపతులకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. అందరూ వారి వారి జీవితాల్లో ఉన్నతంగానే స్థిరపడ్డారు. పేద కుటుంబం.. అనేక కష్టాలు ఎదుర్కొన్నారు.. బిఎ, బీఈడీ చదివి ఉపాధ్యాయుడు అయ్యారు.
మునుగోడు గ్రామంలో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టిన కిష్టయ్యసార్ ఉపాధ్యాయ ప్రస్థానం ఫణిగిరి హైస్కూల్ హెడ్ మాస్టర్ గా రిటైర్ కావడంతో ముగిసింది.
ఉపాధ్యాయ వృత్తిలో వేల మంది విద్యార్థుల జీవితాలలో వెలుగులు నింపారు. విద్యతో పాటు విద్యార్థుల్లో శారీరక దృఢత్వాన్ని సాధించాలనే స్ఫూర్తిని రగిలించిన క్రీడా గురువు ఆయన. ప్రముఖ వాలీబాల్, కబడ్డీ క్రీడాకారులుగా ఎన్నెన్నో విజయాలు అందించి అవార్డులు (షీల్డ్ లు )సాధించి ఊరికి పేరు తెచ్చిన జాజిరెడ్డి గూడెం ముద్దుబిడ్డ సుతారపు కిష్టయ్యసార్.
మరోవైపు- జిల్లా వినియోగదారుల సంఘం కన్వీనర్ గా, సమాచార హక్కు చట్టంతో సమాజ హితం కోసం శ్రమించారు.
నకిలీ విత్తన కంపెనీలు చేసిన మోసాల మీద పోరాడి న్యాయం జరిపించి రైతుకు నష్టపరిహారం ఇప్పించిన ఘనత వారి సొంతం. మండలం, జిల్లా వ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహించి ప్రజల్ని చైతన్య పరిచారు. నిత్యావసర సరుకుల కొనుగోలులో సామాన్యులకు జరుగుతున్న మోసాలను అరికట్టాలని వినియోగదారుల సంఘంతో ప్రజల హక్కులు కాపాడిన యోధులు వారు.
లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపక సభ్యునిగా పనిచేసి ప్రజా రాజకీయాలు కొనసాగించారు. భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అదే విధంగా అర్వపల్లి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ బోర్డు మెంబర్ గా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టిన దైవ సేవలో కూడా తరించిన భిన్న కోణాల, విభిన్న సామార్థ్యాల సమాహారం కిష్టయ్య సార్ జీవితం. ఉపాధ్యాయుడిగా, జిల్లా వినియోగదారుల సంఘం ప్రతినిధిగా, సమాచార హక్కు చట్టం పరిరక్షకుడిగా, రైతుబిడ్డగా, రాజనీతిజ్జుడిగా, పలు రంగాల్లో ప్రతిభను చాటిన బహుముఖ ప్రజ్జాశాలి కిష్టయ్య సార్.
పరోపకారిగా, ప్రజల మనిషిగా, హితుడుగా, సన్నిహితుడుగా అన్ని వర్గాల ప్రజల అభిమానాన్ని చూరగొన్న తన జీవితం అంతా సమాజం కోసం పరితపించిన కృషీవలుడు జనం మనిషి ఆయన. అందరి సుఖం కోరిన సమసమాజ స్వాప్నికుడు, కార్యసాధకుడు సుతారపు కిష్టయ్య సారు ఒక వ్యక్తి నుంచి వ్యవస్థగా ఎదిగారు. అటువంటి గొప్ప వ్యక్తి కిష్టయ్య సార్ మరణం తో జాజిరెడ్డి గూడెం గ్రామం ఒక మేధావిని నాయకుణ్ణి కోల్పోయింది.
వారందించిన సేవలను ఈ గ్రామం ఏనాడూ మరవదు.
సుతారపు కిష్టయ్య సార్ యాదిలో … సంస్మరణ సభ ను ఈ నెల 31న సూర్యాపేట జిల్లా, జాజి రెడ్డిగూడెం శ్రీ రామరాజు లక్ష్మీ రాఘవరావు కల్యాణ మండపం ఉదయం 11గంటలకు కిష్టయ్య సార్ కుటుంబ సభ్యులు, స్నేహితులు, వారి శిష్యుల సహకారంతో నిర్వహించనున్నారు.