- బీఆర్ఎస్, బీజేపీ సపోర్టర్స్‌కు మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి అండ
- హుజూర్నగర్ నియోజకవర్గంలో అభ్యర్థుల పక్షాన ప్రచారం
- ఇంటింటి వెళ్లి పలకరింపులు…కేడర్‌తో మంతనాలు
- సొంత ఊరు గుండ్లపల్లిలో బరిలో ఉన్న ఉమ్మడి అభ్యర్థి
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: హుజూర్నగర్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నేత శానంపూడి సైదిరెడ్డి మళ్లీ ప్రత్యక్షమయ్యారు. గతకొంత కాలంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆయన పంచాయతీ ఎన్నికల్లో మరోసారి ఎంట్రీ ఇచ్చారు. నియోజకవర్గంలో బీఆర్ఎస్, బీజేపీ మద్ధతుదారులకు భరోసా ఇస్తున్నారు. నేరేడుచర్ల, గరిడేపల్లి, మఠంపల్లి, మేళ్లచెర్వు మండలాల్లో తన అనుచరులతో భేటీ అయ్యారు. భాహాటంగా ఎన్నికల ప్రచారం కనిపించకపోయినప్పటికీ తెరవెనక మద్ధతుదారులకు అండగా నిలుస్తున్నారు. నియోజకవర్గంలో బీఆర్ఎస్ క్యాండేట్లు గట్టి పోటీ ఇస్తున్న గ్రామాల్లో భయాందోళనలు పరి స్థితులు నెలకొన్నాయని, తమకు అండగా నిలిచేందుకు బలమైన లీడర్ లేడని నియోజకవర్గం నుంచి పలువురు పార్టీ సీనియర్లకు సై దిరెడ్డికి మొరపెట్టకున్నారు.

మాజీ మంత్రి ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆడపాదడపా ప్రచారం నిర్వహించినప్పటికీ స్థానికంగా తమకు అండగా నిలబడే లీడర్ లేకపోవడంతో పార్టీ కేడర్ అయోమయంలో పడింది. సీనియర్ నేత ఒంటెద్దు నర్సింహారెడ్డి సమన్వయ కర్తగా వ్యవహరిస్తున్నప్పటికీ పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదా లు, ఎన్నికల్లో నిలబడ్డ అభ్యర్థుల పక్షాన నియోజకవర్గంలో గట్టిగా నిలబడే లీడర్ లేకపోవడంతో బీఆర్ఎస్ కేడర్ చిక్కుల్లో పడింది. స్థానిక బీఆర్ఎస్లోని ఓ వర్గం కోరిక మేరకు సైదిరెడ్డి తన సొంత ఊరు మఠంపల్లి మండలం గుండ్లపల్లి తో సహా, నేరేడుచర్ల, గరిడేపల్లి మండలాల్లో బీఆర్ఎస్, బీజేపీ కలిసి పోటీ చేస్తున్న చోట సైదిరెడ్డి కేడర్ తో చర్చలు జరిపారు.
బీజేపీలో సైదిరెడ్డి ఇమడలేకపోతున్నాడని, బీఆర్ఎస్లో చేరేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం ఇంకోవైపు వినిపిస్తోంది. కానీ పార్టీ హైకమాండ్ సైదిరెడ్డి రాకను అంగీకరించే పరిస్థితుల్లో లేదని, కష్టకాలంలో పార్టీని వీడిపోవడం వల్ల తామంతా అనేక ఇబ్బందులు పడ్డామని మరోవర్గం ఆరోపిస్తోంది. ఏదిఏమైనప్పటికీ త్వరలో జరిగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నాటికి సైదిరెడ్డి రీఎంట్రీ పైన క్లారిటీ వస్తదనే ప్రచారం జరుగుతోంది.