భర్త చేసిన మోసానికి భార్యకు శిక్ష.. అంగన్‌వాడీ టీచర్‌ను చెట్టుకు కట్టేసిన బాధితులు..

కంగ్టి/సంగారెడ్డి, ఏపీబీ న్యూస్: సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని దామరగిద్ద గ్రామంలో సభ్య సమాజం తలదించుకునే ఘటన చోటుచేసుకుంది. భర్త చేసిన ఆర్థిక మోసానికి సంబంధం లేని భార్యను బలిపశువును చేస్తూ, ఆమెను బహిరంగంగా చెట్టుకు కట్టేసి అవమానపరిచారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

వివరాల్లోకి వెళ్తే.. దామరగిద్ద గ్రామానికి చెందిన వసంతకుమారి అంగన్వాడీ టీచర్గా పనిచేస్తోంది. ఆమె భర్త ప్రభాకర్ గత కొంతకాలంగా ‘హెచ్బీఎం ఫైనాన్స్’ (HBM Finance) పేరుతో ఒక ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థను నడుపుతున్నాడు. అధిక వడ్డీలు ఇస్తామని ఆశచూపి గ్రామానికి చెందిన పలువురు నిరుపేదల వద్ద లక్షలాది రూపాయలు వసూలు చేశాడు. అయితే, కొద్దిరోజుల క్రితం ప్రభాకర్ ఆ డబ్బులతో ఊరు విడిచి పరారయ్యాడు.

తాము మోసపోయామని గ్రహించిన బాధితులు ఆగ్రహంతో ఊగిపోయారు. బుధవారం వసంతకుమారి యధావిధిగా తన విధులకు హాజరవ్వగా, బాధితులంతా ఒక్కసారిగా ఆమెను చుట్టుముట్టారు. నీ భర్త ఎక్కడ? మా డబ్బులు మాకు ఇప్పించు అంటూ గొడవకు దిగారు. ఆమెకు సంబంధం లేదని చెబుతున్నా వినకుండా, తాడుతో ఆమెను బహిరంగంగా చెట్టుకు కట్టేసి నానా రకాలుగా అవమానించారు.

సమాచారం అందుకున్న కంగ్టి పోలీసులు వెంటనే గ్రామానికి చేరుకుని వసంతకుమారిని బంధ విముక్తురాలిని చేశారు. ఆర్థిక లావాదేవీల విషయంలో చట్టపరంగా వెళ్లాల్సింది పోయి, ఒక మహిళను ఇలా హింసించడం నేరమని పోలీసులు హెచ్చరించారు. భర్త ప్రభాకర్ కోసం గాలింపు చర్యలు చేపట్టడంతో పాటు, మహిళను కట్టేసిన వారిపై కూడా చర్యలు తీసుకునే దిశగా దర్యాప్తు చేస్తున్నారు.

డబ్బులు పోగొట్టుకున్న వారి ఆవేదన అర్థం చేసుకోదగినదే అయినా, ఒక మహిళను ఇలా చెట్టుకు కట్టేయడం అనాగరిక చర్య. భర్త చేసిన తప్పుకు భార్య ఎలా బాధ్యురాలు అవుతుంది? ఫైనాన్స్ నిర్వాహకులపై పోలీసులకు ఫిర్యాదు చేయాలి కానీ, ఇలాంటి దాడులు చేయడం వల్ల బాధితులే నేరస్తులుగా మారే అవకాశం ఉంది. ఇలాంటి చీటీలు, ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల విషయంలో ప్రజలు ముందే జాగ్రత్తగా ఉండాలి.

Share
Share