బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ తన ముంబై నివాసంలో గురువారం తెల్లవారుజామున దుండగుడి చేతిలో కత్తిపోట్లకు గురయ్యారు.ఈ ఘటనలో ఆయన వెన్నెముక సమీపంలో ఆరు కత్తిపోట్లతో గాయపడ్డారు. తక్షణమే లీలావతి ఆసుపత్రికి తరలించబడిన సైఫ్కు అత్యవసర శస్త్రచికిత్స నిర్వహించి, వెన్నెముక సమీపం నుంచి 2.5 అంగుళాల పొడవైన కత్తి భాగాన్ని తొలగించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండడంతో ఐసీయూ నుంచి ప్రత్యేక గదికి మార్చారు.
ముంబై పోలీసులు ఈ కేసులో ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారు. సీసీటీవీ ఫుటేజ్లో నిందితుడు ఎరుపు స్కార్ఫ్తో ముఖాన్ని కప్పుకుని మెట్లు ఎక్కుతున్న దృశ్యాలు రికార్డయ్యాయి. దర్యాప్తు కోసం ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయక్ను నియమించారు.

సైఫ్ అలీ ఖాన్ తన భార్య కరీనా కపూర్, ఇద్దరు కుమారులు తైమూర్, జెహ్లతో కలిసి ముంబైలోని బాంద్రా ప్రాంతంలోని ‘సద్గురు శరణ్’ భవనంలోని 12వ అంతస్తులో నివసిస్తున్నారు. దుండగుడు గురువారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో అపార్ట్మెంట్లోకి చొరబడి సైఫ్పై దాడి చేశాడు. దాడి సమయంలో నిందితుడు సైఫ్ను బెదిరించి రూ. కోటి డిమాండ్ చేసినట్లు సమాచారం.
ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్యం మెరుగ్గా ఉంది. వైద్యులు ఆయనకు విశ్రాంతి అవసరమని సూచించారు. ముంబై పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.