నాంపల్లి, ఏపీబీ న్యూస్: నల్గొండ జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నాంపల్లి మండలంలోని దేవతపల్లి గేట్ సమీపంలో అతివేగంగా వచ్చిన ఒక లారీ, ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను వెనుక నుండి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం మల్లేపల్లిలో నిర్వహించే సంత కోసం వెళ్ళగా తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు ప్రయాణికులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నల్గొండ జిల్లా చింతపల్లి మండల నుంచి మల్లేపల్లి(హైదరాబాద్ రోడ్డు) వైపుకు 12 మంది ప్రయాణికులతో ఆటో బయలుదేరింది. ఈ క్రమంలో దేవతలపల్లి గేట్ వద్ద లారీ టైర్ పేలడంతో లారీ అదుపు తప్పి ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను వెనుక నుండి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న నల్గొండ జిల్లా చింతపల్లి మండలం కొర్ర మాన్సింగ్ తండా కు చెందిన కుర్రబద్య (57), నాంపల్లిలో ఇటుక బడ్డీలో పని చేసే బీహార్ రాష్ట్రానికి చెందిన సంతోష్ ఖలీఫా(40), అక్కడికక్కడే మృతి చెందగా ఏపీ రాష్ట్రంలోని బాపట్ల జిల్లాకు చెందిన బండారు విశాక్ (55) ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మద్యంలోనే మృతి చెందారు. గాయపడిన క్షతగాత్రులను దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్ట్ మార్దం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఆటోలో సామర్థ్యానికి మించి ప్రయాణికులు
ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో సామర్థ్యానికి మించి ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఎదురుగా వస్తున్న లారీ నియంత్రణ కోల్పోయి ఆటోను ఢీకొట్టడంతో, ఆటో పూర్తిగా ధ్వంసమైంది. లోపల ఉన్న వారు బయటకు రాలేక తీవ్ర గాయాలపాలయ్యారు. స్థానికులు వెంటనే స్పందించి, పోలీసులకు సమాచారం అందించి సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో గాయపడిన ఆరుగురిని చికిత్స నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉండడంతో మెరుగైన ట్రీట్మెంట్ కొరకు హైదరాబాద్ కు తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే దేవతపల్లి గేట్ వద్ద రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. ధ్వంసమైన వాహనాలను రోడ్డుపై నుంచి తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు నాంపల్లి ఎస్ ఐ లింగారెడ్డి తెలిపారు.