- మొంథా తుఫాన్తో నష్టపోయిన రైతులు
- వడ్లను మర ఆడించి నష్టాన్ని లెక్కగడుతున్న మిల్లర్లు
- క్వింటాల్కు 10 నుంచి 20 శాతం కోత
- బియ్యం రంగు మారితే రైతుల పైనే నష్టం
- 3,280 క్వింటాళ్లకు ట్రక్ షీట్లు ఇవ్వకుండా తిరకాసు
- మిల్లుల అలాట్మెంట్లో చేతులు మారిన లక్షలు
నల్గొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: మొంథా తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకుంటామని చెప్పిన జిల్లా అధికార యంత్రాంగం చివరకు ప్లేట్ పిరాయించింది. తుఫాను కారణంగా ప్రభుత్వ కేంద్రాల్లో కొనుగోలు చేసిన వడ్లను దింపుకునేందుకు మిల్లర్లను ఒప్పిస్తామని చెప్పి ఇప్పుడు మాట మార్చారు. మిల్లర్లతో కుమ్మకై లోపాయికారికంగా 10, 20 శాతం ప ర్సంటేజీలు మాట్లాడుకున్నట్టు తెలిసింది. రైతులు వడ్లు అమ్మి నెలలు గడుస్తున్నా ట్రక్షీట్లు ఇవ్వకుండా మిల్లర్లు పేచీలు పెడుతున్నారు. తడిసిన వడ్లను మిల్లులో మర ఆడించి ఎంత మేరకు బియ్యం రంగు మారిందో తనిఖీ చేస్తున్నారు. రంగు మారిన బియ్యం వల్ల వచ్చిన నష్టాన్ని రైతులే భరించాలని, అప్పుడే ట్రక్ షీట్లు రిటర్న్ ఇస్తామని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. సెంటర్లలో మద్ధతు ధరకు కొనుగోలు చేసిన వడ్లను యధావిధిగా మిల్లర్లు అన్లోడ్ చేసుకోవాలి. కానీ జిల్లాస్థాయిలో కొందరు సీనియర్ ఆఫీసర్ల అండతో నష్టాన్ని రైతుల పైన మోపుతున్నారు.
సెంటర్ల పైన ఆఫీసర్ల బెదిరింపులు..
మొంథా తుఫాను అధికారులకు, మిల్లర్లకు కాసులు కురిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ సీజన్లో మిల్లర్లతో పలువురు ఆఫీసర్లు చేతులు కలిపిన తీరు విమర్శలకు దారితీస్తోంది. మిల్లర్లను ఒప్పించి రంగు మారిన వడ్లును అన్లోడ్ చేయిస్తామని ప్రగల్భాలు పలికిన ఆఫీసర్లు రివర్స్ గేమ్ ఆడారు. అక్టోబర్, నవంబర్లో తుఫాన్ వల్ల తడిసిన 10 వేల క్వింటాళ్ల వడ్లు అన్లోడ్ అయ్యాక మిల్లర్లు ట్రక్ షీట్లు ఇవ్వకుండా బెదిరింపులకు దిగారు. తడిసిన వడ్లను మర ఆడించడం వల్ల బియ్యం రంగు మారుతోందని, ఆ నష్టాన్ని రైతులు భరించాలని, ఆ మేరకు ట్రక్షీట్లు చేంజ్ చేసి తేవాలని సెంటర్ల పైన ఒత్తిడి చేశారు. ఈ విషయంలో మిల్లర్ల పైన చర్యలు తీసుకోవాల్సిన ఆఫీసర్లు తడిసిన వడ్లు కొనుగోలు చేసిన సెంటర్ల పైన యాక్షన్ తీసుకుంటామని వార్నింగ్ ఇవ్వడం వివాదస్పదమైంది.
సివిల్ సప్లై ఆఫీసర్లు డమ్మీ…
వడ్ల కొనుగోళ్లలో కఠినంగా వ్యవహారించాల్సిన సివిల్ సప్లై శాఖలు కీలుబొమ్మగా మారాయి. ఆఫీసర్లను అడ్డం పెట్టుకుని కొందరు సీనియర్లు కర్రపెత్తనం చేస్తున్నట్టు తెలిసింది. అంతర్గతంగా జరగాల్సిన మీటింగ్ల్లో మిల్లర్లను, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లను పక్కనే కూర్చుపెట్టుకుని రివ్యూలు చేయడం వల్ల సివిల్ ఆఫీసర్లు డమ్మీలుగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. తుఫాను వల్ల తడిసిన వడ్లను కొనేందుకు ప్రత్యేక కమిటీ వేయాలని చేసిన సూచన కూడా పై ఆఫీసర్లు పెడచెవిన పెట్టారని, దాంతోనే ఇప్పుడు రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి ఎదురైందని సివిల్ సప్లై సీనియర్ ఆఫీసర్ ఒకరు చెప్పారు.

అనుమల మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రంలో రికార్డులను పరిశీలిస్తున్న కలెక్టర్ ఇలా త్రిపాఠి (ఫైల్)
మిల్లుల అలాట్మెంట్లో గోల్మాల్…
వడ్లు కేటాయించేందుకు మిల్లుల అలాట్మెంట్లో కూడా భారీ ఎత్తున గోల్మాల్ జరిగినట్టు తెలిసింది. మిర్యాలగూడెం, నల్లగొండలో తక్కువ కెపాసిటీ కలిగిన మిల్లులకు ఎక్కువ వడ్లు అలాట్ చేశారని, దానికిగాను ఒక్కో మిల్లు నుంచి రెండు లక్షల వరకు వసూలు చేశారనే టాక్ వినిపిస్తోంది. సివిల్ సప్లైలోని పలువురు ఆఫీసర్లు దీని వెనక ఉన్నారని, ఈ అక్రమాల పైన సివిల్ సప్లై ఉన్నతాధికారులకు సైతం ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.
82 ట్రక్షీట్లు మిల్లర్ల వద్దే…
సుమారు 3,500 క్వింటాళ్ల విలువైన 82 ట్రక్షీట్లను అడ్డంపెట్టుకున్న మిల్లర్లు డ్రామా ప్లే చేస్తున్నారు. కనగల్ మండలం తేలికంటిగూడెం సెంటర్లో ఓ రైతు నుంచి కొనుగోలు చేసిన 732 బస్తాల వడ్లలో 95 బస్తాలు కటింగ్ పెడ్తామని దానికి ఒప్పుకుంటేనే ట్రక్షీట్ ఇస్తామని శెట్టిపాలెం మిల్లర్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడని తెలిసింది. వడ్ల కొనుగోళ్లు చివరి దశకు చేరుకున్న మిర్యాలగూడ, నాగార్జున సాగర్ ప్రాంతాల్లో మిల్లర్లు 10 నుంచి 20 శాతం కోత పెడ్తున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయి. 82 ట్రక్షీట్లలో 32 లారీలు అన్లోడ్ చేయకుండా ఇంకా మిల్లుల వద్దే వెయిటింగ్లో పెట్టారు. మరో 40 షీట్లు రిటర్న్ చేయకుండా రైతులను ఇబ్బందులు గురిచేస్తున్నారు. ట్రక్షీట్ల కోసం వెళితే సెంటర్ల నిర్వహకుల పైన ఘర్షణకు దిగుతున్నారని తెలిసింది.
ట్రక్షీట్లు పెండింగ్లో ఉన్న మండలాలు…
వేములపల్లి 11, త్రిపురారం 4, నార్కట్పల్లి 7, మునుగోడు 10, మా డ్గులపల్లి 10, మర్రిగూడ 2, కేతేపల్లి 4, కట్టంగూరు 6, కనగల్ 12, గుర్రంపోడు 3, అనుమల రెండు, తిరుమలగిరి(సాగర్) 10, నిడమనూరు మండలానికి చెందిన 8 ట్రక్షీట్లు, మిర్యాలగూడ, శెట్టిపాలెం, తిరుమలగిరి(సాగర్), నిడమనూరు, ఉరుమడ్ల, నకి రేకల్, యాద్గార్ పల్లి, తుంగపహాడ్, కొండమల్లేపల్లిలోని మిల్లర్ల వద్ద ట్రక్షీట్లు ఉన్నట్టు తెలిసింది.