హైదరాబాద్, ఏపీబీ న్యూస్: కాంగ్రెస్ పార్టీ బలోపేతమే ధ్యేయంగా రెండు తెలుగు రాష్ట్రాల డీసీసీ (జిల్లా కాంగ్రెస్ కమిటీ) అధ్యక్షులకు నిర్వహిస్తున్న శిక్షణ తరగతుల ముగింపు సమావేశంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తన రాజకీయ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపారు.
జడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి వరకు.. 19 ఏళ్ల పోరాటం
తాను సాధారణ స్థాయి నుంచి ఈ స్థాయికి ఎలా వచ్చారో వివరిస్తూ రేవంత్ రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. “నేను కేవలం 19 ఏళ్ల కాలంలో జడ్పీటీసీ సభ్యుడి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు ఎదిగాను. ఈ ప్రయాణంలో ఎమ్మెల్యేగా ప్రజల పక్షాన నిలబడి ఎంతో అనుభవాన్ని గడించాను. పార్టీలోనూ వివిధ హోదాల్లో పనిచేశాను. నా రాజకీయ జీవితంలో నేను ఎప్పుడూ పైరవీలకు తావివ్వలేదు. కేవలం ప్రజా సమస్యలపై గళం విప్పడమే నా బాధ్యతగా భావించాను” అని ఆయన స్పష్టం చేశారు.
అణచివేతను ఎదుర్కొన్నా.. వెనకడుగు వేయలేదు
ప్రజాక్షేత్రంలో పోరాడుతున్నప్పుడు తనపై అనేక కేసులు నమోదయ్యాయని, అయినప్పటికీ భయపడలేదని సీఎం అన్నారు. “ప్రజల కోసం పోరాడుతుంటే నాపై అక్రమ కేసులు పెట్టారు, పరువు నష్టం దావాలు వేశారు. నిన్న కూడా నేను కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. కానీ ఇవేవీ నన్ను ఆపలేవు. సోనియా గాంధీ గారి పేరుతో తెలంగాణలో అధికారాన్ని సాధించాం, ఇప్పుడు రాహుల్ గాంధీ గారిని ప్రధాని పీఠంపై కూర్చోబెట్టడమే మన తదుపరి లక్ష్యం” అని పిలుపునిచ్చారు.
దేశం కోసం రాహుల్ గాంధీ ప్రధాని కావాలి
గత ఐదేళ్లుగా రాహుల్ గాంధీ అనేక పోరాటాలు చేసి ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎదిగారని రేవంత్ రెడ్డి కొనియాడారు. దేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై రాహుల్ నిరంతరం పోరాడుతున్నారని, దేశ భవిష్యత్తు కోసం ఆయన ప్రధాని కావడం అత్యవసరమని అభిప్రాయపడ్డారు.
రేవంత్ రెడ్డి ‘మెరిట్’ మంత్రం:
ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి కేవలం రాజకీయ ప్రసంగం మాత్రమే చేయకుండా, ఒక కీలకమైన సంకేతాన్ని పంపారు. “కాంగ్రెస్లో ఇకపై ‘మెరిట్’ కోటా తప్ప ఏ కోటా ఉండదు” అని ఆయన స్పష్టం చేయడం విశేషం. సాధారణంగా రాజకీయాల్లో వారసత్వం లేదా సిఫార్సులకు ప్రాధాన్యత ఉంటుందనే విమర్శ ఉంటుంది. కానీ, డీసీసీ అధ్యక్షులను ఉద్దేశించి “మీ పనితీరు బాగుంటేనే పదవులు ఉంటాయి” అని ఖరాకండిగా చెప్పడం ద్వారా, పార్టీలో పని చేసే వారికే ప్రాధాన్యత ఉంటుందని రేవంత్ రెడ్డి బల్లగుద్ది చెప్పారు. ఇది పార్టీ గ్రౌండ్ లెవల్ కేడర్లో కొత్త ఉత్సాహాన్ని ఇచ్చే అంశం.