- మున్సిపల్ ఎన్నికల్లో జీరో రెబల్స్ స్ట్రాటజీనీ అమలు చేయాలని హైకమాండ్ ఆదేశం
- ఉమ్మడి జిల్లాలో పనిచేయని కాంగ్రెస్ మంత్రం..భారీగా ఆశావాహుల నామినేషన్లు
- అగ్ర నేతలకు ఇబ్బందిగా మారిన అభ్యర్థుల ఎంపిక
- 407 వార్డులకు 3,209 మంది పోటీ
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: రాష్ట్రంలో కాంగ్రెస్ కంచుకోటగా పేరొందిన నల్లగొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు వేడిపుట్టిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన రెండేళ్ల గ్యాప్ తర్వాత పార్టీ సింబల్ మీద జరుగుతున్న ఎన్నికలు జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ ఎన్నికల్లో రెబల్స్‌కు తావులేకుండా, జీరో రెబల్స్ స్ట్రాటజీ అమలు చేయాలని పార్టీ హైకమాండ్ ఆదేశించింది. కానీ ఉమ్మడి జిల్లాలోని 18 మున్సిపాలిటీల్లో నామినేషన్లు పరిశీలిస్తే మాత్రం రెబల్స్‌ను బుజ్జగించడం ఆషామాషీ కాదని తెలుస్తోంది. అభ్యర్థుల ఎంపిక విధానంలోనే ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్టు వ్యవహారించారు. పీసీసీ నిబంధనలకు వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు సొంత ఏజెండా అమలు చేశారు. పంచాయతీ ఎన్నికల తరహాలోనే పార్టీ విధేయులను కాదని, తమ అనుచరులు, కుటుంబ సభ్యులు, సన్నిహితులకు ప్రయార్టీ ఇచ్చారు. దీంతోనే ఈ ఎన్నికల్లో సైతం రెబల్స్ పోటాపోటీగా నామినేషన్లు వేశారు. 18 మున్సిపాలిటీల్లో 407 వార్డులకు 1267 మంది కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్లు వేయడంతో ఎమ్మెల్యేలు, మంత్రులు కంగుతిన్నారు.
అన్ని స్థానాల్లో పోటాపోటీ
మున్సిపల్ ఆశావహులను ఏవిధంగా బుజ్జగించాలో కూడా ఎమ్మెల్యేలకు అంతుచిక్కడం లేదు. కాంగ్రెస్ క్యాండేట్లు, బీఆర్ఎస్ నుంచి వలసొచ్చిన లీడర్లు టికెట్ల కోసం పోటీపడుతున్నారు. ఇది చాలదన్నట్టు ఎమ్మెల్యేల అనుచరుల ఒత్తిడి మరింత ఎక్కువైంది. కౌన్సిలర్ ఒక్కటేగాక, చైర్మన్ పదవి కోసం పట్టుబడుతున్నారు. జనరల్, జనరల్ మహిళలకు రిజర్వు అయిన మున్సిపాలిటీల్లో పోటీ తీవ్రంగా కనిపిస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో జనరల్ సీట్లలో అగ్రకులాల ప్రభావం అంతగా కనిపించలేదు. కానీ ఈ ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో అగ్రకులాలకు ధీటుగా బీసీలు పోటీకి సిద్ధమయ్యారు. దీంతో ఎవరికి ఏవిధంగా సర్ధిచెప్పాలో ఎమ్మెల్యేలకు పాలుపోవడం లేదు. 17 మున్సిపాలిటీలు, ఒక కార్పోరేషన్‌తో కలిపి మొత్తం 407 వార్డులు కాగా, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఇండిపెండెంట్లు కలిపి మొత్తం 3,209 మంది పోటీలో ఉన్నారు.
బహుముఖ పోటీ తప్పదేమో..?
నామినేషన్ల ఉపసంహరణ సోమవారంతో ముగియనుంది. రెబల్స్‌ను బుజ్జగించేందుకు రెండు రోజుల గడువు మాత్రమే మిగిలింది. కానీ శనివారం సాయంత్రం వరకు ఎమ్మెల్యేలు, మంత్రులు ఆశావహులతో జరిపిన చర్చలు కొలిక్కిరాలేదని తెలిసింది. కాంగ్రెస్ ధీటుగా బీఆర్ఎస్, బీజేపీ అన్ని మున్సిపాలిటీల్లో నామినేషన్లు దాఖలు చేసింది. దీన్ని బట్టి చూస్తే ప్రధాన పార్టీల మధ్య త్రిముఖ పోటీ తప్పేలా లేదు. దీనికితోడు స్వతంత్రులు గట్టిగానే నిలబడ్డారు. రెబల్స్ పోటీ నుంచి తప్పుకోనట్లయితే ఓట్లు చీలిపోయి కాంగ్రెస్ అభ్యర్థుల కు నష్టం జరిగే ప్రమాదం ఉంది.
ఈ మున్సిపాలిటీల్లోనే రెబల్స్ బెడద
నల్లగొండ కార్పోరేషన్ తో పాటు, మేజర్ మున్సిపాలిటీల్లోనే రెబల్స్ బెడద తీవ్రంగా ఉంది. సూర్యాపేటలో 176, కోదాడలో 122, హుజూర్ నగర్లో 92, నల్లగొండలో 143, మిర్యాలగూడలో 213, దేవరకొండ లో 105, భువనగిరిలో 55 మంది పోటీలో ఉన్నారు. ద్వితీయ శ్రేణి పట్టణాల్లో చౌటుప్పుల్‌లో 43, తిరుమలగిరిలో 51, హాలియా 61, చండూరులో 45, చిట్యాల 34, నందికొండ మున్సిపాలిటీలో 30, నేరేడుచర్లలో 27, మంది పోటీలో ఉన్నారు. ఒక్క ఆలేరు మున్సిపాలిటీలో మాత్రమే 12 వార్డులకు 12 మంది పక్కగా పోటీలో ఉన్నారు.
జిల్లాల వారీగా పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలు
| జిల్లా | సీట్లు | కాంగ్రెస్ | బీఆర్ఎస్ | బీజేపీ | స్వతంత్రులు |
| నల్లగొండ | 161 | 631 | 474 | 287 | 234 |
| సూర్యాపేట | 141 | 468 | 302 | 161 | 140 |
| యాదాద్రి | 104 | 168 | 157 | 130 | 57 |