APB News Exclusive: అన్న వెంకన్న రోడ్ల పైన… రాజగోపాల్​ హాట్​ కామెంట్స్​

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన తమ్ముడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఎప్పటి నుంచో మంత్రి పదవి ఆశిస్తున్న రాజగోపాల్ అసెంబ్లీ సాక్షిగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్నే లేపాయి. వెంకటరెడ్డి గొప్పగా చెప్పుకుంటున్న హ్యామ్(HAM) రోడ్ల పైన రాజగోపాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే టెండర్లు పూర్తియి, టెక్నికల్ బిడ్ ఓపెన్ చేసిన హ్యామ్ రోడ్ల పనులకు రేపో, మాపో ప్రైస్ బిడ్ కూడా ఫైనల్ చేయనున్నారు. ఈ దశలో రాజగోపాల్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. దేశంలో హ్యామ్ రోడ్లు నిర్మాణం సక్సెస్ అయినట్టు చరిత్రలోనే లేదని, సరియైన ప్రమాణాలు పాటించకపోతే ప్రమాదాలకు దారితీస్తాయని హెచ్చరించారు. మూల మలుపుల దగ్గర ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో భూసేకరణ చేయకుండా, బ్లాక్ స్పాట్స్ గుర్తించకుండా పనులు ఏవిధంగా చేపడ్తారని ప్రశ్నించారు. భద్రతా ప్రమాణాలు పాటించాకే టెండర్లు ఫైనల్ చేయాలని, లేదంటే కాంట్రాక్టర్లు ఎక్సెస్ రేట్లతో ఎక్కువ నిధులు రాబట్టేందుకు ప్రయత్నిస్తారని, దాంతో ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని హెచ్చరించారు. రోడ్ల పనుల పర్యవేక్షణకు థర్డ్ పార్టీ ఇండిపెండెంట్ ఇంజనీరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు.

రాష్ట్రంలో 13 వేల కోట్లతో 441 ఆర్అండ్ బి(R&B) రోడ్లను 34 ప్యాకేజీలుగా విడగొట్టి టెండర్లు పిలిచారు. త్వరలో ప్రైస్ బిడ్ ఓపెన్ చేయనున్నారు. (Hybrid Annuity Model) హ్యామ్ రోడ్ల ప్రాజెక్ట్ వ్యయంలో 40 శాతం ప్రభుత్వం (వాయిదాల పద్ధతి లో) సమకూరుస్తే, 60 శాత డెవలపర్ పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. రోడ్డు నిర్మించిన తర్వాత ఐదేళ్ల పాటు రోడ్డు నిర్వహణ, రిపేర్ల బాధ్యత నిర్మాణ సంస్థదే. ఉమ్మడి నల్గొండ, మహాబూబ్నగర్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాలోనే ఎక్కువ పనులు గుర్తించారు. స్వతాహగా కాంట్రాక్టర్ అయిన రాజగోపాల్ రెడ్డి తనకున్న అపార అనుభవం దృష్ట్యా హ్యామ్ రోడ్లు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడంతో ప్రభుత్వం మరింత ఇరకాటంలో పడినట్లైంది.

Watch Video: https://www.instagram.com/reel/DWeT_cpD7Kp/?igsh=MWNpbTVraXYxMXZheQ==

జిల్లా ప్రాజెక్టుల నిర్మాణంలో మంత్రి ఉత్తమ్ వివక్ష చూపిస్తున్నారని  మండిపడ్డారు. హుజూర్నగర్ నియోజకవర్గంలో ఎకరానికో లిఫ్ట్, ఐదొకరాలకు ఒక లిఫ్ట్ పెడుతున్నారని, కానీ నల్లగొండ, మనుగోడు పాలమూరు, దేవరకొండ ప్రాంతాలకు అవసరమయ్యే డిండి లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో మాత్రం వివక్ష చూపిస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వం భూసేకరణ చేయకుండా 5 వేల కోట్లతో ముందుగా రిజర్వాయర్లు నిర్మించి నిధులు దండుకున్నారని, నీళ్లు ఎక్కడి నుంచి తేవాలో చెప్పకుండా అడ్డగోలుగా పనులు చేయడం వల్ల ఇప్పటి వరకు సమస్య తేల్చకుండానే ఉందన్నారు. మంత్రి ఉత్తమ్ పైన ఒత్తిడి తేవడంతో టెండర్లు పూర్తిచేశామని, కానీ నీటి పంపకాల్లో జరుగుతున్న అన్యాయ్యాన్ని ఇప్పటి వరకు ఎందుకు పరిష్కరించలేదని అన్నారు. ఎస్ఎల్బీసీ(SLBC), ఉదయ సముద్రం, బ్రహ్మణ వెల్లంల ప్రాజెక్టుల పనులు పెండింగ్లోనే ఉన్నాయని, బీ వెల్లంల ప్రాజెక్టును ‘ఏ’కే టగిరీలో చేర్చి తొందరగా పూర్తిచేయాలని డిమాండ్ చేశారు.

సీఎం రేవంత్ సొంత నియోజకవర్గం కొడంగల్, నల్లగొండ, ఖమ్మం ఉమ్మడి జిల్లాల మంత్రులు ఉన్న నియోజకవర్గాలకే భారీగా నిధులు మళ్లిస్తున్నారని, ఎమ్మెల్యేలకు ప్రియార్టీ ఇవ్వడం లేదని రాజగోపాల్ ధ్వజమెత్తారు. అసెంబ్లీలో బీఆర్ఎస్లో లేని లోటు నేను తీరుస్తానని, అధికారంలో ఉండి ప్రతిపక్ష పాత్ర పోషించాల్సి వస్తోందని విచారం వ్యక్తం చేశారు. నిధుల కోసం, పనుల కోసం మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోందని, ఎంత మాత్రం ఇది కరెక్ట్ కాదని, సీఎంకు కొడంగల్ ఎంత ముఖ్యమో, నాకు మునుగోడు కూడా అంతే ప్రధానమని, నిధుల వివక్ష చూపడం సరియైన విధానం కాదని మండిపడ్డారు. గతంలో కూడా రాజగోపాల్ నిధుల వివక్ష పైన జిల్లా మంత్రులను టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే.

Share
Share