Breaking News: పసిపిల్లలు తాగే పాలను కూడా కల్తీ చేసిండ్రు: నలుగురు మృతి, 13 బృందాలతో ఇంటింటా సర్వే!

రాజమండ్రి, ఏపీబీ న్యూస్: నగరంలో కల్తీ పాలు పెను విషాదాన్ని నింపాయి. పాలు తాగిన కొద్దిసేపటికే అస్వస్థతకు గురై నలుగురు మరణించడం స్థానికంగా తీవ్ర భయాందోళనలు రేకెత్తిస్తోంది. చౌడేశ్వరి నగర్, వెంకటేశ్వర నగర్ కాలనీలకు చెందిన ప్రజలు ఈ ఘటనలో తీవ్రంగా ప్రభావితమయ్యారు.

ఆదివారం ఉదయం ఒకే వ్యాపారి వద్ద పాలు కొనుగోలు చేసిన పలువురు బాధితులు.. పాలు తాగిన కొద్దిసేపటికే వాంతులు, విరేచనాలు, తీవ్రమైన కడుపునొప్పితో విలవిలలాడారు. బాధితులను వెంటనే రాజమండ్రిలోని పలు ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. వీరిలో ముగ్గురు పసిపిల్లల పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు వారికి డయాలసిస్ నిర్వహిస్తున్నారు.

ఇప్పటికే అదే వ్యాపారి వద్ద రెగ్యులర్గా పాలు వాడుతున్న ఇద్దరు వృద్ధులు (60 ఏళ్ల పైబడిన వారు) కిడ్నీ సంబంధిత సమస్యలతో మరణించగా, తాజాగా మరో ఇద్దరు మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. బాధితుల్లో చాలామంది ‘అనూరియా’ (Anuria) అంటే కిడ్నీలు పనిచేయక మూత్ర విసర్జన ఆగిపోయే ప్రమాదకర లక్షణాలతో బాధపడుతున్నారు.

ఈ ఘటనపై మున్సిపల్ కమిషనర్ సీరియస్ అయ్యారు. మున్సిపల్ హెల్త్ డిపార్ట్మెంట్, వైద్యులు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలతో కూడిన 13 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఈ బృందాలు ప్రభావిత కాలనీల్లో ఇంటింటా సర్వే నిర్వహించి, బాధితులను గుర్తిస్తున్నాయి.

పోలీసుల దర్యాప్తు: పాలలో ఏవైనా ప్రమాదకర రసాయనాలు కలిశాయా? లేక పాలు నిల్వ ఉండటానికి వాడే యూరియా, కాస్టిక్ సోడా వంటి పదార్థాలు మితిమీరాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సదరు పాల వ్యాపారిని అదుపులోకి తీసుకున్నారు. పోస్టుమార్టం నివేదిక వస్తే మరణాలకు అసలు కారణం స్పష్టమవుతుందని అధికారులు తెలిపారు.

ఈ మధ్యకాలంలో పాలు తెల్లగా, చిక్కగా కనిపించడానికి యజమానులు యూరియా, డిటర్జెంట్, హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటి ప్రాణాంతక రసాయనాలు కలుపుతున్నారు. రాజమండ్రి ఘటన మన కళ్లముందున్న అతిపెద్ద హెచ్చరిక. కేవలం ప్రభుత్వం చర్యలు తీసుకునే వరకు ఆగకుండా, ప్రజలు కూడా తాము కొనే పాలలో స్వచ్ఛతను పరీక్షించుకోవాలి. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు ఉన్న ఇళ్లలో ప్యాకెట్ పాలు లేదా నమ్మకమైన డెయిరీల నుండి వచ్చే పాలను ఎంచుకోవడం ఉత్తమం. లాభాపేక్ష కోసం సామాన్యుల ప్రాణాలతో చెలగాటమాడే ఇలాంటి ‘వైట్ పాయిజన్’ వ్యాపారులపై కఠిన చట్టాలు అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Share
Share