- హైదరాబాద్ పక్కనే ఉన్నా అత్యంత వెనకబడ్డ ప్రాంతం
- ఎక్కడో ఉన్న కోదాడ, హుజూర్నగర్ వంద రెట్లు అభివృద్ధి
- పేరుకు పోరాటాల ఖిల్లా.. కానీ అభివృద్ధిలో అంతరం
- పాతికేళ్లు కమ్యూనిస్టులు పాలించినా అభివృద్ధి శూన్యం
- ఇది మంత్రుల టైగర్ జోన్.. రాష్ట్ర రాజకీయాలను శాసించే జిల్లా
- యంగ్ ఇండియా స్కూల్స్ భేష్.. సీఎంకు అండగా ఉంట
- మూడేళ్ల సమయం ఉంది.. మునుగోడును ఆదరించండి
- సీఎం రేవంత్ పైన మారిన ఎమ్మెల్యే రాజగోపాల్ వైఖరి
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: సీఎం రేవంత్ రెడ్డి పైన విమర్శలు ఎక్కుపెట్టే ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వైఖరిలో అనూహ్యమైన మార్పు కనిపించిది. ఆదివారం మునుగోడులో యంగ్ ఇండియా స్కూల్స్ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే.. సీఎం పైన ఆచితూచి వ్యాఖ్యలు చేశారు. సందర్భం చిక్కిన ప్రతిసారి సీఎం పైన ఒంటికాల్తో ఎగిరిపడే రాజగోపాల్ రెడ్డి ఈ దఫా కొంత తగ్గినట్టు కనిపించారు. తన మంత్రి పదవి ప్రస్తావన తేకుండా జాగ్రత్త పడ్డారు. విద్యాశాఖ మంత్రిగా, సీఎం రేవంత్ రెడ్డి యంగ్ ఇండియా స్కూల్స్ నిర్మించి దేశానికి ఆదర్శంగా నిలిచిండని పొగడ్తలతో ముంచెత్తిన రాజగోపాల్ రెడ్డి మునుగోడు అభివృ ద్ధి విషయంలో మాత్రం రాజీపడే ప్రసక్తే లేదని మరోసారి స్పష్టం చేశారు.
అభివృద్ధి అంతరం ఎందుకు..?
నల్లగొండ జిల్లా… మంత్రుల టైగర్ జోన్ అని హాట్కామెంట్స్ చేసిన రాజగోపాల్ రెడ్డి ఉత్తమ్, వెంకటరెడ్డి నియోజకవర్గాలతో పోలిస్తే తన నియోజకవర్గం అభివృద్ధిలో ఎందుకు వెనకబాటుకు గురియైందని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ఎక్కడో మూలకు ఉన్న కోదాడ, హుజూర్నగర్ ప్రాంతాలు వంద రెట్లు అభివృద్ధి సాధిస్తుంటే… హైదరాబాద్కు సమీపంలో ఉన్న మునుగోడు మాత్రం అత్యంత వెనకబడ్డ ప్రాంతంగానే ఉందని విచారం వ్యక్తం చేశారు. రాష్ట్ర రాజకీయాలను శాసించే జిల్లాగా నల్లగొండకు గుర్తింపు ఉందని, కానీ అభివృద్ధిలో వివక్ష చూపడం సరికాదని చురకలు అంటించారు. నల్లగొండ, మిర్యాలగూడ, నాగార్జునసాగర్లో జరుగుతున్న అభివృద్ధి కూడా మునుగోడులో జరగట్లేదని విచారం వ్యక్తం చేశారు. ఫ్లోరైడ్ రక్కసి పట్టిపీడిస్తున్న ఈ ప్రాంతంలో విద్యా, వైద్యం, తాగు, సాగునీటి సమస్యలతో ప్రజలు అవస్థలు పడుతున్నారని, ఈ ప్రాంతాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత సీఎం పైన ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
యంగ్ ఇండియా స్కూల్ మొదటి అడుగు…
విద్యాశాఖ మంత్రిగా, సీఎం రేవంత్ రెడ్డి యంగ్ ఇండియా స్కూల్ స్థాపించి దేశానికి తలమానికంగా నిలిచిండని, ఆయనకు నా అండ తప్పక ఉంటదని స్పష్టం చేశారు. ఇదే స్పూర్తితో మునుగోడును కూడా ఆదుకోవాలని, ఈ ప్రాంతానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని కోరారు. పోరాటాల ఖిల్లాగా కీర్తిగడించిన ఈ జిల్లాలో మునుగోడులో పాతికేళ్లు కమ్యూనిస్టులు పాలించారని, కానీ పరిస్థితుల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదని, గత రెండేళ్లలో సాధించిన అభివృద్ధి కూడా చెప్పోదగ్గ స్థాయిలో లేదని అన్నారు. రూ.250 కోట్లతో యంగ్ ఇండియా స్కూల్ శంకుస్థాపనతో మునుగోడు అభివృద్ధిలో మొదటి అడుగు పడిందని ఈ స్కూల్ శాంక్షన్ చేసిన సీఎంకు ధన్యావాదాలు చెప్పారు. ఇదే క్రమంలో మునుగోడు అభివృద్ధికి ఇంకా మూడేళ్ల సమయం ఉందని, ఇప్పటికైనా ఈప్రాంత ప్రజల పైన కరుణ చూపాలని కోరారు. నా విజ్ఞప్తి మేరకు మంత్రి ఉత్తమ్ డిండి లిఫ్ట్ ఇ రిగేషన్ టెండర్లు పిలిచారని రాజగోపాల్ రెడ్డి చెప్పారు.