తిరుపతి, ఏపీబీ న్యూస్: ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త బాధ్యతారాహిత్యం, అప్పుల బాధ వెరసి ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి. తనతో పాటు ఏ పాపం తెలియని ఇద్దరు చిన్నారులను ఆ తల్లి అనంతలోకాలకు తీసుకెళ్లిపోయింది. తిరుపతి జిల్లా పుత్తూరు మండలంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ప్రేమ వివాహం.. తీరని వేదన:
నేషనూరుకు చెందిన పద్మ (28), తొరూరుకు చెందిన శివశంకర్ డిగ్రీ చదువుకునే రోజుల నుంచి ప్రేమించుకున్నారు. వీరి కులాలు వేరు కావడంతో పాటు, శివశంకర్ ప్రవర్తన సరిగ్గా లేదని పద్మ తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించారు. అయినప్పటికీ, 2019లో పెద్దలను ఎదిరించి వారు వివాహం చేసుకున్నారు. వీరికి తేజ (6), లాస్య (5) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
బాధ్యత మరచిన భర్త:
వివాహం జరిగిన నాటి నుండి శివశంకర్ కుటుంబ బాధ్యతలను విస్మరించినట్లు తెలుస్తోంది. ఇంటి అద్దె, పిల్లల స్కూలు ఫీజుల విషయంలో తరచూ గొడవలు జరిగేవి. పెద్దమనుషులు నచ్చజెప్పినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. శ్రీసిటీలో ఉద్యోగం వచ్చిందని నమ్మబలికిన శివశంకర్, బయట విచ్చలవిడిగా అప్పులు చేసి కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టాడు.
కలచివేసిన డెత్ నోట్:
ఆత్మహత్యకు ముందు పద్మ రాసిన లేఖ అందరినీ కన్నీరు పెట్టిస్తోంది. “ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు నా జీవితం ఒక గుణపాఠం కావాలి. ఒక భార్య తన భర్తలో ఏ లక్షణాలు ఉండకూడదని కోరుకుంటుందో, నా భర్తలో అవన్నీ ఉన్నాయి. ఊరంతా అప్పులు చేసి తీర్చలేనంటే నేనేం చేయాలి?” అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. చివరగా “నేను పోయాక ఎలాగో మరో పెళ్లి చేసుకుంటావు.. కనీసం ఆ సారైనా లైఫ్ సెటిల్ అయ్యాక చేసుకో” అంటూ భర్తను ఉద్దేశించి రాసింది.ఘటన జరిగిన తీరు: డ్వాక్రా అప్పు కట్టలేదని భర్త ఫోన్లో చెప్పడంతో తీవ్ర మనస్తాపానికి గురైన పద్మ, బెడ్ రూమ్లో పిల్లలిద్దరికీ ఉరివేసి, ఆపై హాల్లో తానూ ఉరివేసుకుని ప్రాణాలు విడిచింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్ కి తరలించారు. భర్త శివశంకర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ముఖ్య గమనిక: ఆత్మహత్య ఏ సమస్యకూ పరిష్కారం కాదు. మీకు ఎలాంటి మానసిక ఒత్తిడి లేదా సమస్యలు ఉన్నా సహాయం కోసం ప్రభుత్వ హెల్ప్లైన్ నంబర్లను (‘14416’ లేదా ‘104’) సంప్రదించండి.