ఖబర్దార్ రేవంత్ రెడ్డి..కొండా సురేఖపై కుట్రలను..బీసీలపై దాడిగానే చూస్తాం: పుటం పురుషోత్తమరావు పటేల్

హైదరాబాద్(APB News): రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి కొండా సురేఖపై సొంత కాంగ్రెస్ పార్టీలోని అగ్రవర్ణ నాయకులు చేస్తున్న కుట్రలను బీసీలపై జరుగుతున్న దాడిగానే చూస్తామని మున్నూరుకాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు సర్దార్ పుటం పురుషోత్తమ రావు పటేల్ అన్నారు. బీసీలపై దాడులను ఇకపై సహించబోమని పుటం హెచ్చరించారు.
రాష్ట్రంలోనే బలమైన క్యాడర్ కలిగిన కొండా కుటుంబంపై భారీ కుట్రలకు తెరలేపిన అగ్రవర్ణ నాయకులు కొండా సురేఖతోపాటు, ఆమె భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు, ఆమె కూతురు కొండా సుస్మితా పటేల్ లను రాజకీయంగా టార్గెట్ గా చేసి దెబ్బతీయాలని చూస్తున్నారని పుటం ఆవేదన వ్యక్తం చేశారు.
తెరవెనుక ఉండి కొండా కుటుంబంపై కుట్రలు చేస్తున్న పాత్రదారులు, సూత్రదారులు ఎవరో తేల్చాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పుటం పురుషోత్తమరావు కోరారు. కుట్రదారులను తేల్చకపోతే.. ఈ కుట్రల వెనుక రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డే ఉన్నారని మున్నూరుకాపు సమాజం నిర్దారణ చేసుకోవాల్సి వస్తుందని పుటం హెచ్చరించారు.

       
Share
Share