- కలెక్టర్లు ప్రతి నెల 15 రోజుల్లో ఫీల్డ్లోనే ఉండాలి
- గ్రామాలు, పట్టణాల్లోని సమస్యల పైనే ఫోకస్ పెట్టాలి దీనికోసం ప్రత్యేకంగా వాట్సాప్
- ప్రతిరోజు కార్యక్రమాల పైన నివేధికలు రూపొందించాలి
- రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాను అగ్రస్థానంలో నిలబెట్టాలి
- వేసవిలో తాగునీటి సమస్యలు పరిష్కరించాలి
- ఏప్రిల్ నుంచి మరో విడత ఇందిరమ్మ ఇళ్లు
- ఉమ్మడి జిల్లా సమీక్షా సమావేశంలో మంత్రులు
- అడ్లూరి లక్ష్మణ్, కోమటిరెడ్డి, మండలి చైర్మన్ గుత్తా
నల్లగొండ, ఏపీబీ న్యూస్: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి అమలు చేస్తున్న ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని అమలు చేయడంలో అధికారుల నిర్లక్ష్యాన్ని ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని ఇంచార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్, జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు హెచ్చరించారు. ఈ నెల 6 నుంచి మొదలైన కార్యక్రమం వంద రోజుల పాటు కొనసాగుతుందని (జూన్ 12 వరకు) చెప్పారు. శనివారం నల్లగొండలో జరిగిన ఉమ్మడి జిల్లా సమీక్షా సమావేశంలో వారు మాట్లాడారు. మొన్నటి వరకు గ్రామాల్లో, పట్టణాల్లో పాలకవర్గాలు లేక సమస్యలు పేరుకుపోయాయని, వాటిన్నింటిని పరిష్కరించడమే ఈ ప్రణాళిక ముఖ్య ఉద్దేశమని మంత్రులు తెలిపారు. జిల్లా కలెక్టర్లు ప్రతి నెల 15 రోజుల పాటు క్షేత్రస్థాయిలో పర్యటించాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించాలని చెప్పారు. ప్రధానంగా రేషన్కార్డు లు, ఇందిరమ్మ ఇళ్లు, సన్న బియ్యం, ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా, రైతుభరోసా వంటి కార్యక్రమాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించాలని చెప్పారు.
99 రోజుల పాటు అమలు చేసే ప్రణాళిక కార్యక్రమాల రోజువారీ షెడ్యూల్ రూపొందించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసేందుకు ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపు క్రియేట్ జరిగిందని, ప్రతి రోజు కార్యక్రమాలకు సంబంధించిన రిపోర్ట్ను అప్లోడ్ చేయాలని మంత్రులు సూచించారు. గ్రామ సభలు, పట్టణ సభలు నిర్వహించాలని, అక్కడ గుర్తించిన సమస్యల పరిష్కారినికే ప్రయార్టీ ఇవ్వాలని చెప్పారు. మొత్తంగా ఈ ప్రణాళిక అమలును విజయవంతం చేసి, ఉమ్మడి జిల్లాను రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలబెట్టాలని మంత్రులు స్పష్టం చేశారు.
పరిసరాల శుభ్రత..పెండింగ్ ఫైల్స్ క్లియర్ చేయాలి: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక పేరు మీద ముఖ్యమైన 10 అంశాల వారిగా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. పరిసరాల పరిశుభ్రత, పెండింగ్ ఫైల్ పరిష్కారంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి. పెండింగ్ ఫైల్స్ క్లియర్ చేయాలి. రైతులకు సంబంధించిన అంశాలు, సంక్షేమ కార్యక్రమాలు, రోడ్డు ప్రమాదాల పైన అవగాహన కల్పించాలి. ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు సోమవారం వరకు క్లియర్ చేస్తారు. ఏప్రిల్ నుండి మరో విడత ఇందిరమ్మ ఇళ్లు శాంక్షన్ చేస్తాం. వ్యవసాయంలో సోలార్ విద్యుత్ వినియోగించుకోవాలి.

ప్రజాప్రతినిధుల సమన్వయంతో పనిచేయాలి: అడ్లూరి లక్ష్మణ్, ఇంచార్జి మంత్రి
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు చేరాల్సిన అవసరం ఉందని, అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో పథకాలు పేద ప్రజలకు అందేలా చూడాలని, ప్రభుత్వ ఆదేశాలను అందరూ కచ్చితంగా పాటించాలి. ప్రజల వద్దకు నేరుగా వెళ్లేలా కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలి. జిల్లా కలెక్టర్లు ఈ కార్యక్రమాలను ప్రతిరోజు పర్యవేక్షించాలి.
తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలి: మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక అమలులో భాగంగా మొదటి అంశమైన పరిశుభ్రత లో భాగంగా గ్రామ పంచాయతీలకు గతంలో ఇచ్చిన ట్రాక్టర్లన్నీ వినియోగంలోకి తేవాలి. వేసవి దృష్ట్యా తాగునీటి సమస్య తలెత్తకుండా కలెక్టర్లు, ఆర్డబ్ల్యూఎస్(RWS) అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. పాఠశాలల్లో విద్యార్థులు, టీచర్ల సంఖ్య క్రమబద్ధీకరించాలి. రైతులకు యూరియా సమస్య లేకుండా చూడాలి. సోలార్ విద్యుత్ వినియోగం పైన అవగాహన కల్పించాలి.
భగీరథ ఆఫీసర్లు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలి: ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య
గ్రామాల్లో లోవోల్టేజ్ సమస్య లేకుండా చేయాలని, తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలి. ఇందిరమ్మ ఇళ్లలో ఎల్ వన్(L1), ఎల్ టు(L2), సమస్యలను పరిష్కరించాలి. మిషన్ భగీరథ కింద అధికారులు ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకుని తాగునీటి సమస్య లేకుండా చూడాలి.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వేముల వీరేశం, బాలూనాయక్, మందుల సామేలు, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, కుందూరు జయ వీర్ రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ నెల్లి కంటి సత్యం, శంకర్ నాయక్, నల్గొండ మేయర్ బుర్రి చైతన్య, కలెక్టర్లు బి. చంద్రశేఖర్, తేజస్ నంద్ లాల్ పవర్, అనురాగ్ జయంతి, ఎస్పీ శరత్ చంద్ర పవార్ తదితరులు పాల్గొన్నారు.