నంద్యాల, ఏపీబీ న్యూస్: రాజకీయాల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే నాయకులు అరుదుగా ఉంటారు. కానీ, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకుని మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. తన ఇంటిపేరుతో ఉన్న కొణిదెల గ్రామాన్ని (నంద్యాల జిల్లా, పగిడ్యాల మండలం) అభివృద్ధి చేస్తానని గతంలో ఇచ్చిన హామీ మేరకు, తన సొంత నిధుల నుంచి రూ. 50 లక్షలు వెచ్చించి నిర్మించిన భారీ వాటర్ ట్యాంక్ ఇప్పుడు గ్రామస్తుల దాహార్తిని తీరుస్తోంది.
సొంత నిధులతో గ్రామ దత్తత
గత ఎన్నికల ప్రచార సమయంలో నందికొట్కూరు నియోజకవర్గంలోని కొణిదెల గ్రామాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్, తన ఇంటిపేరుతో ఉన్న ఆ గ్రామంలో నెలకొన్న మౌలిక సదుపాయాల కొరతను చూసి చలించిపోయారు. తాము అధికారంలోకి వచ్చాక ఈ గ్రామాన్ని దత్తత తీసుకుంటానని అప్పట్లో హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి తాను ఉప ముఖ్యమంత్రి అయ్యాక, ప్రభుత్వ నిధుల కోసం వేచి చూడకుండా తన వ్యక్తిగత ట్రస్ట్ ద్వారా రూ. 50 లక్షల చెక్కును జిల్లా కలెక్టర్కు అందజేశారు.
90 వేల లీటర్ల సామర్థ్యంతో వాటర్ ట్యాంక్
గ్రామంలో ప్రధాన సమస్యగా ఉన్న తాగునీటి ఎద్దడిని పరిష్కరించేందుకు ఈ నిధులతో 90 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన భారీ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ను నిర్మించారు.
మౌలిక సదుపాయాలు: కేవలం వాటర్ ట్యాంక్ మాత్రమే కాకుండా, మిగిలిన నిధులతో గ్రామంలో సీసీ రోడ్లు, మురుగు కాలువల అభివృద్ధి పనులను కూడా చేపట్టారు.
ప్రజల హర్షం: దశాబ్దాలుగా తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్న తమకు, పవన్ కళ్యాణ్ చేసిన ఈ సాయం మరువలేనిదని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల పర్యవేక్షణ
నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య అభ్యర్థన మేరకు పవన్ కళ్యాణ్ ఈ నిధులను తక్షణమే విడుదల చేశారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆధ్వర్యంలో ఈ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు. రాజకీయాల్లో మాట ఇచ్చి తప్పడం కాకుండా, తన సొంత డబ్బుతో గ్రామాభివృద్ధికి పాటుపడటం పట్ల సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.