- కార్పోరేషన్ ఎన్నికల్లో బుర్రి శ్రీనివాస్‌రెడ్డికి తోడుగా బాల్య మిత్రుడు మాజీ జడ్పీటీసీ పాశం రాంరెడ్డి
- మంత్రి కోమటిరెడ్డి సూచన మేరకు రంగంలోకి రాంరెడ్డి అభ్యర్థుల ఎంపిక మొదలు, ఎన్నికలు పూర్తియ్యే వరకు
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్లగొండ కార్పోరేషన్ ఎన్నికల్లో మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డికి తోడుగా అతని బాల్య మిత్రుడు తిప్పర్తి మాజీ జడ్పీటీసీ పాశం రాంరెడ్డి రంగంలోకి దిగారు. ఎల్కేజీ(LKG) నుంచి ఇంటర్(Inter) వరకు వీరిద్దరి స్నేహం కొనసాగింది, ఆ తర్వాత కూడా ఎన్జీ(NG) కాలేజీ లో క్రికెట్ టీమ్‌లో కలిసి ఆడారు. శ్రీనివాస్ రెడ్డి ఎస్వీఎస్(NVS) స్కూల్లో చదువుకోగా, రాంరెడ్డి వివేకానంద స్కూల్లో ఎల్కేజీ(LKG) నుంచి టెన్త్(10th) వరకు చదివారు. ఆ తర్వాత ఇంటర్ కూడా ఇద్దరిది ఒకే బ్యాచ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ వీళ్ల జూనియర్, అయితే మేయర్ ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది. మేయర్ పదవి కోసం గుమ్మల మోహన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి పోటీపడుతున్న క్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచన మేరకు రాంరెడ్డి ఎంట్రీ ఇవ్వడం చర్చనీయాంశమైంది. కార్పోరేటర్ల ఎంపిక కూడా క్లిష్టంగా మారి చాలా వార్డుల్లో అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది.

ఇక టికెట్ కష్టమని భావిస్తున్న ఆశావహులు మెల్లగా బీఆర్ఎస్లోకి జారుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఒక్కో వార్డు నుంచి ముగ్గురు అభ్యర్థులను ఎంపిక చేసి, వాళ్లలో ప్రజామోదం కలిగిన అభ్యర్థులను ఎంపిక చేసే దాంట్లో రాంరెడ్డి కీలక పాత్ర పోషించనున్నారు. పోలీస్, ఇంటిలిజెన్స్, సొంత సర్వేల ద్వారా అభ్యర్థుల ఎంపిక జరగనుంది. బీఆర్ఎస్లో ఉన్నప్పుడు మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డితో విభేదించిన రాంరెడ్డికి పట్టణ రాజకీయాల్లోకి ప్రవేశించడం ఒకింత శుభపరిణామంగా కాంగ్రెస్ కేడర్ భావిస్తోంది. శ్రీనివాస్ రెడ్డి, మోహన్ రెడ్డి, రాంరెడ్డిల కలయికతో మేయర్ పదవి కైవసం చేసుకోవడం సులభమని పార్టీ శ్రేణులు చెప్తున్నారు.