చౌటుప్పల్ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: రాష్ట్ర సరిహద్దుల గుండా సాగుతున్న మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై ఎక్సైజ్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్గేట్ వద్ద మంగళవారం నిర్వహించిన వాహన తనిఖీల్లో భారీగా ఎండు గంజాయి పట్టుబడింది.
ఒడిశా టు మహారాష్ట్ర.. ఆటోలో కిలోల కొద్దీ గంజాయి!
ఎక్సైజ్ అధికారులకు అందిన ముందస్తు సమాచారం మేరకు టోల్గేట్ వద్ద తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా వచ్చిన ఒక ఆటోను ఆపి తనిఖీ చేయగా, అందులో ప్యాకెట్ల రూపంలో దాచిన గంజాయి బయటపడింది.
అధికారులు మొత్తం 60.685 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన గంజాయి విలువ బహిరంగ మార్కెట్లో సుమారు 25 లక్షల రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. నిందితులు ఈ గంజాయిని ఒడిశా రాష్ట్రంలోని భరంపూర్ నుండి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు విచారణలో తేలింది.
నలుగురు నిందితుల అరెస్ట్
ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల ముఠాను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ముగ్గురు మహారాష్ట్రకు చెందిన వారు కాగా, ఒకరు నల్గొండ జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. నిందితుల నుంచి గంజాయితో పాటు ఒక ఆటో, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని, తదుపరి విచారణ నిమిత్తం వారిని రామన్నపేట ఎక్సైజ్ స్టేషన్కు తరలించారు.
ఆటోల ముసుగులో అంతర్రాష్ట్ర స్మగ్లింగ్?
సాధారణంగా గంజాయి స్మగ్లర్లు ఖరీదైన కార్లు లేదా కంటైనర్లను ఎంచుకుంటారు. కానీ, పోలీసుల కళ్లు గప్పేందుకు ఇప్పుడు ‘ఆటో’లను ఎంచుకోవడం అధికారులను విస్మయానికి గురిచేస్తోంది. సుదూర ప్రాంతాలైన ఒడిశా నుంచి మహారాష్ట్ర వరకు ఒక ఆటోలో ఇంత భారీ మొత్తంలో గంజాయి ప్రయాణించిందంటే, దారిపొడవునా ఉన్న తనిఖీ వ్యవస్థల్లో లోపాలు ఉన్నాయా అనే అనుమానం కలుగుతోంది. పంతంగి టోల్గేట్ వద్ద ఎక్సైజ్ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించి ఈ ముఠాను పట్టుకోవడం అభినందనీయం.