- మావోయిస్టు కీలక నేత పాకా హనుమంతు ఎన్కౌంటర్
- ఒడిశాలోని కందమాల్ జిల్లా గుమ్మా అటవీ ప్రాంతంలో భద్రతా బలగాల ఎదురుకాల్పులో మృతి
- నల్లగొండ జిల్లా చండూరు మండలం, పుల్లెంల గ్రామం
- హనుమంతు తల పైన రూ.1.10 కోట్ల రివార్డు
- ఏబీవీపీ నేత ఏచూరి శ్రీనివాస్ హత్య కేసులో కీలక నిందితుడు
- జిల్లాలో చివరకు మిగిలింది ఇద్దరు మావోయిస్టులే
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్లగొండ జిల్లాకు చెందిన మావోయిస్టు కీలక నేత పాక హనుమంతు అలియాస్ ఊకే గణేష్ ఒడిశాలోని కందమాల్ జిల్లా గుమ్మా అటవీ ప్రాంతంలో జరిగిన భద్రతా బలగాల ఎదురుకాల్పుల్లో మృతి చెందాడు. విశ్వనీయ సమాచారం మేరకు కందమాల్ జిల్లాలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందగా వా ళ్లలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పాక హనుమంతు కూడా ఉన్నట్టు అక్కడి పోలీసులు వెల్లడించారు. ఆయన తల పైన రూ.1.10 కోట్ల రివార్డు ఉంది. సంఘటన జరిగిన స్థలంలో భద్రతా బలగాలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. ఒడిశా, చత్తీస్ఘడ్ సరిహద్దులో మావోయిస్టుల కోసం గాలింపు జరుగుతోంది. ఈ క్ర మంలో మావోయిస్టులకు, భద్రత బలగాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పులు జరిగినట్టు తెలిసింది. చండూరు మండలం పుల్లెంల గ్రామం, యాదవ సామాజిక వర్గం, పాక చంద్రయ్య, పాపమ్మ దంపతులకు ఆరుగురు సంతానం కాగా, మొదటి సంతానం పాక హనుమంతు అలియాస్ గణేష్ 1961లో జన్మించాడు. హనుమంతుకు ముగ్గురు చెల్లెలు, ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. బాల్యం నుంచే కమ్యూనిస్టు భావజాలంతో ఆయన పెరిగారు. చండూరులో పదో తరగతి వరకు చదివిన హనుమంతు ఇంటర్, డిగ్రీ నల్లగొండలో పూర్తి చేశారు. డిగ్రీ కాలేజీలో రాడికల్ యూనియన్లో చురుగ్గా ఉన్న హనుమంతు 1980లో నల్లగొండలో జరిగిన ఏబీవీపీ నేత ఏచూరి శ్రీనివాస్ హత్య కేసులో కీలకంగా ఉన్నాడు. దీంతో అప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లి నక్సల్స్తో కలిసిపోయాడు. మావోయిస్టు పార్టీలో జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి లీడర్గా అంచెలంచెలుగా ఎదిగాడు. ప్రస్తుతం మూడు రాష్ట్రాలకు కేంద్ర కమిటీ సభ్యుడిగా వ్యవహారిస్తున్నాడు. మావోయిస్టు ఉద్యమంలోకి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులు చని పోయినప్పుడు కూడా గ్రామానికి హనుమంతు రాలేదు. ఆయన ఎన్ కౌంటర్ తో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
గతంలోనే చనిపోయాడని..
కాగా, గతంలో ఛత్తీస్గఢ్లోని గరియాబాద్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో పాక హనుమంతు మృతి చెందినట్లు ఛత్తీస్గఢ్ పోలీస్ అధికారులు వెల్లడించడం గమనార్హం. ఆ సమయంలో గ్రామంలో విషాదం నెలకొంది. 45 సంవత్సరాల క్రితం పాక హనుమంతు మావోయిస్టు పార్టీలోకి వెళ్లారు. ఈ 45 ఏళ్ల పాటు అజ్ఞాతంలోనే గడిపారు. అయితే నాడు చనిపోయింది హనుమంతు కాదని కుటుంబ సభ్యులు, పార్టీ నాయకత్వం ప్రకటించింది. కాగా తాజాగా ఆయన ఒడిస్సాలో మరణించినట్లు పోలీసులు దృవీకరించారు.

మిగిలింది ఇద్దరే…
ఇదిలావుంటే జిల్లాకు చెందిన మావోయిస్టుల్లో ఇప్పటి వరకు 20 మంది వేర్వేరు ఘటనల్లో చనిపోయినట్టు తెలిసింది. చివరిగా ఇద్దరు మాత్రమే పార్టీలో ఉన్నట్టు పోలీసు వర్గాలు చెప్తున్నాయి. వీళ్ల లో మందుగుల భాస్కర్రావు (ఎస్సీ). చిట్యాల మండలం ఉరుమడ్లకు చెందిన ఆయన 2018లో అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఈయన ప్రస్తుతం చత్తీస్ఘడ్లోని డీకేహెచ్ఎఫ్సీ దళంలో పనిచేస్తున్నట్టు తెలిసింది. గుర్రంపోడు మండలం చామలోనిబావికి చెందిన పన్నాల యాదయ్య (గొల్ల) కూడా 2018 నుంచి అజ్ఞాతంలోనే ఉన్నాడు. ఈ యన తలపైన లక్ష రూపాయాల రివార్డు ఉంది.