నల్గొండ, ఫిబ్రవరి 16 (ఏపీబీ న్యూస్): నల్గొండ పట్టణాభివృద్ధి సంస్థ (NUDA) చైర్మన్ పదవిపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడనుంది. నల్గొండ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ ఈ కీలక పదవిని దక్కించుకోబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆశీస్సులతో ఆయన పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. మరికొద్ది సేపట్లో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
డిప్యూటీ మేయర్ గా అష్రఫ్ అలీ (ఆమీర్) నియమకం
నుడా చైర్మన్తో పాటు నల్గొండ మున్సిపాలిటీ డిప్యూటీ మేయర్ ఎంపికపై కూడా స్పష్టత రానుంది. ఈ పదవికి అష్రఫ్ అలీ (ఆమీర్) నియమకం. నల్గొండ స్థానిక రాజకీయాల్లో పట్టున్న నాయకులకు ప్రాధాన్యత కల్పించే దిశగా మంత్రి కోమటిరెడ్డి అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది.
క్యాంప్ నుంచి చేరుకున్న కార్పొరేటర్లు
మున్సిపల్ పరిణామాల నేపథ్యంలో గత కొన్ని రోజులుగా క్యాంప్లో ఉన్న కార్పొరేటర్లు నేడు నల్గొండకు చేరుకున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నేడు జిల్లా కేంద్రంలోనే అందుబాటులో ఉండటంతో, కీలక నియామకాలపై ఆయన స్వయంగా ప్రకటన చేయనున్నారు. ఈ నియామకాలతో నల్గొండ కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.
అబ్బగోని రమేష్ గౌడ్ గతంలో మున్సిపల్ వైస్ చైర్మన్గా, తాత్కాలిక చైర్మన్గా సేవలందించిన అనుభవం ఉండటంతో, ఆయనకు ‘నుడా’ పగ్గాలు అప్పగించడం ద్వారా నల్గొండ పట్టణాన్ని మరింత అభివృద్ధి చేయవచ్చని మంత్రి భావిస్తున్నట్లు తెలుస్తోంది.