Breaking News: రేపటి నుంచి ‘నో హెల్మెట్ – నో పెట్రోల్’

నల్లగొండ, ఏపీబీ న్యూస్:​ జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా తీసుకున్న నిర్ణయం మేరకు, రేపటి నుంచి (బుధవారం) నల్గొండ జిల్లా వ్యాప్తంగా ‘నో హెల్మెట్ – నో పెట్రోల్’ నిబంధనను అమలు చేయనున్నట్లు జిల్లా ఎస్పీ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నిర్ణయం ప్రకారం, జిల్లా పరిధిలోని అన్ని పెట్రోల్ బంకుల్లో హెల్మెట్ ధరించకుండా వచ్చిన ద్విచక్ర వాహనదారులకు పెట్రోల్ సరఫరా చేయరాదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు.

nalgonda sp Sharat Chandra Pawar IPS

ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్న పెట్రోల్ బంక్ నిర్వాహకులు, సిబ్బందికి ఈ నిబంధన అమలుపై స్పష్టమైన సూచనలు ఇవ్వడం జరిగింది. అలాగే, ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ప్రాధాన్యతపై అవగాహన కల్పిస్తూ కౌన్సిలింగ్ కార్యక్రమాలు కూడా నిర్వహించామని ఆయన పేర్కొన్నారు.

రోడ్డు ప్రమాదాలలో ద్విచక్ర వాహనదారులే అధికంగా ప్రాణాలు కోల్పోతున్నారని, ముఖ్యంగా హెల్మెట్ ధరించకపోవడం వల్ల తల గాయాలు తీవ్రంగా మారి ప్రాణనష్టం సంభవిస్తున్న ఘటనలు ఎక్కువగా ఉన్నాయని, ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, ప్రజల ప్రాణాలను కాపాడడం ప్రధాన లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

no helmet no petrol

ప్రతి ద్విచక్ర వాహనదారుడు తన భద్రతతో పాటు కుటుంబ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తప్పనిసరిగా హెల్మెట్ ధరించి మాత్రమే వాహనం నడపాలని జిల్లా పోలీస్ శాఖ విజ్ఞప్తి చేసింది. ప్రజల సహకారం ఉంటేనే రోడ్డు భద్రత సాధ్యమవుతుందని, అందరూ చట్టాలను గౌరవిస్తూ నిబంధనలు పాటించి తమ ప్రాణాలను తాము కాపాడుకోవాలని జిల్లా పోలీస్ శాఖ కోరింది.

Share
Share