- ఆలేరు, తుంగతుర్తి, సూర్యాపేట, మునుగోడులో కాంగ్రెస్కు ధీటుగా బీఆర్ఎస్
- నల్లగొండ, నకిరేకల్లో ఓటర్ల విలక్షణ తీర్పు
- 28 మండలాల్లో ఎన్నికలు జరిగితే 17 మండలాల్లో సత్తా చాటిన బీఆర్ఎస్ సపోర్టర్స్
- మెజార్టీ స్థానాలు కాంగ్రెస్సే అయినప్పటికీ ప్రభుత్వ పథకాల పైన గ్రామ స్థాయిలో ప్రతికూల ప్రభావం
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్, డిసెంబర్ 13
తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు ఎదురీత తప్పలేదు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరుగ్యారెంటీల పథకాల ప్రభావం పల్లెల్లో స్పష్టంగా కనిపించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తొలి సారిగా జరిగిన స్థానిక ఎన్నికల్లో ఎమ్మెల్యేలు ఆశించిన స్థాయిలో ఫలితాలు అందుకోలేకపోయారు. ఉమ్మడి జిల్లాలో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్సే కైవసం చేసుకున్నప్పటికీ 2019లో బీఆర్ఎస్ సాధించినంత స్థాయిలో ఫలితాలు రాబట్టలేకపోయారు. 2019 పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ 85 శాతం స్థానాలు క్లీన్ స్వీప్ చేసింది. కానీ ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్యేలు పంచాయతీ ఎన్నికల ఫలితాలు చూశాక నివ్వెరపోయారు. మొత్తం 28 మండలాల్లో ఎన్నికలు జరిగితే 17 మండలాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య హోరా హోరీ పోటీ జరిగింది. దాంతో ఆయా మండలాల్లో బీఆర్ఎస్ 50శాతం పంచాయతీలు గెలుచుకుంది. ప్రధానంగా ఆలేరు, తుంగతుర్తి, మునుగోడు సెగ్మెంట్లలో కాంగ్రెస్కు ఎదురుగాలి వీచింది.
తుంగతుర్తిలో వర్గపోరు..
తుంగతుర్తి, ఆలేరులో తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన బీర్ల అయిలయ్య, మందుల సామేల్కు గట్టిషాక్ తగిలింది. ఎమ్మెల్యే వైఖరి నచ్చక కాంగ్రెస్లో రెబల్స్ పోటీచేశారు. ఒకేపార్టీలో రెండు వర్గాలు ఉండటం వల్ల బీఆర్ఎస్కు లబ్ధిచేకూరింది. తుంగతుర్తి నియోజక వర్గంలో మొత్తం 128 పంచాయతీల్లో కాంగ్రెస్ మద్ధతుదారులు 76 చోట్ల గెలిస్తే, బీఆర్ఎస్ 40 పంచాయతీలు కైవసం చేసుకుంది. రెబల్స్ 8 మంది గెలుపొందారు. అర్వపల్లి, నూతనకల్, మద్దిరాల, శాలిగౌరారం మండలాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు సత్తా చాటారు.
ఆలేరులో అయిలయ్య ఒంటరి…
ఆలేరులో ఎమ్మెల్యే అయిలయ్య ఒంటిరిగానే పోరాడాల్సి వచ్చింది. అభ్యర్థులను సమన్వయం చేయడంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రత్యర్ధి మాజీ ఎమ్మెల్యే సునీత భర్త గొంగడి మహేందర్ రెడ్డి ఎత్తులను తిప్పికొట్టడంలో అభ్యర్థులు విఫలమయ్యారు. పోల్ మేనేజ్మెంట్, అభ్యర్థుల ఎంపికలో ముందునుంచీ మహేందర్ రెడ్డి ఆచితూచి వ్యవహారించారు. అసెంబ్లీ ఎన్నికల్లో సునీత పైన కనిపించిన వ్యతిరేకత పంచాయతీ ఎన్నికల్లో లేకపోవడం గమనార్హం. స్థానికంగా బీఆర్ఎస్ కేడర్ బలంగా ఉందని చెప్పేందుకు ఆలేరు ఫలితాలే నిదర్శనం. 153 పంచాయతీల్లో కాంగ్రెస్ మద్ధతుదారులు 87 చోట్ల గెలిస్తే..బీఆర్ఎస్ సపోర్టర్స్ 50 చోట్ల గెలుపొందారు. రెబల్స్ 10 మంది గెలుపొందడం గమనార్హం. ఆలేరు, రాజాపేట, బొమ్మల రామారాం, ఆత్మకూరు (ఎం), యాదగిరిగుట్ట మండలాల్లో కాంగ్రెస్కు ధీటుగా బీఆర్ఎస్ నిలిచింది.
మునుగోడులో రెబల్స్ షాక్…
మునుగోడు సెగ్మెంట్లో ఐదు మండలాల్లో ఎన్నికలు జరిగితే నాంపల్లి, చండూరు మండలాల్లో కాంగ్రెస్కు పోటీగా బీఆర్ఎస్ మద్ధతు దారులు సత్తాచాటారు. 104 పంచాయతీల్లో కాంగ్రెస్ 56, బీఆర్ఎస్ 26 గెలిస్తే, రెబల్స్ ఏకంగా 16 మంది గెలుపొందడం విశేషం. విచిత్రమేమంటే తొలిపోరులో ఎక్కువ మంది రెబల్స్ గెలిచిన నియోజక వర్గం మనుగోడు కావడం విశేషం. 16 మంది రెబల్స్ క్యాండేట్లు సర్పంచ్లుగా గెలుపొందారు. మునుగోడు మండలంలో ఐదుగురు, మర్రిగూడలో నలుగురు, నాంపల్లిలో ముగ్గురు, చండూరులో ముగ్గురు రెబల్స్ గెలిచారు. మేజర్ గ్రామపంచాయతీ మునుగోడుతో సహా, చండూరు, నాంపల్లి మండలాల్లో బీఆర్ఎస్ గట్టిపోటీ ఇచ్చింది. నాంపల్లి మండలలో 32 పంచాయ తీల్లో 19 కాంగ్రెస్, 9 బీఆర్ఎస్ గెలిస్తే, చండూరులో 19 పంచాయతీల్లో చెరో ఏడు పంచాయతీలు కైవసం చేసుకోవడం విశేషం.
సూర్యాపేటలో గట్టెక్కని కాంగ్రెస్…
సూర్యాపేట నియోజకవర్గంలో తొలిపోరులో సూర్యాపేట రూరల్, ఆత్మకూరు (ఎస్)లో ఎన్నికలు జరిగాయి. 55 పంచాయతీలకుగాను కాంగ్రెస్ 30, బీఆర్ఎస్ 20 పంచాయతీలు కైవసం చేసుకుంది. బీజేపీ ఇద్దరు, రెబల్స్ ఇద్దరు గెలుపొందారు. మాజీ మంత్రి దామన్నలే నిలేటు ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. వేణారెడ్డి, సర్వోత్తమ్ రెడ్డిలు శ్రమించినప్పటికీ పల్లె ఓటర్లు మాత్రం బీఆర్ఎస్కు మొగ్గుచూపి నట్టు తెలుస్తోంది.
నల్లగొండలో ట్రిపుల్ ఆర్(RRR) ఆపరేషన్…
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొంత నియోజకవర్గం నల్లగొండలో ట్రిపుల్ ఆర్(RRR) ఆపరేషన్ మిశ్రమ ఫలితాలు సాధించాయి. తిప్పర్తి ఇన్ చార్జిగా పాశంరాంరెడ్డి, కనగల్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, నల్లగొండ మండలం గుమ్మల మోహన్ రెడ్డి ఎన్నికల ఇన్చార్జిలుగా రేయింబవళ్లు శ్రమించారు. పార్టీ తరపున అభ్యర్థులకు రూ.4కోట్లు సాయం అందించారు. అయినప్పటికీ నియోజకవర్గంలో 88 పంచాయతీల్లో కాంగ్రె స్ 64 గెలిస్తే, బీఆర్ఎస్ 26 చోట్ల గెలిచింది. బీజేపీ, రెబల్స్ ఇద్దరు గెలుపొందారు. నల్లగొండ రూరల్లోనే పార్టీ తక్కువ స్థానాలు గెలుపొందింది. 31 పంచాయతీల్లో కాంగ్రెస్ 19, బీఆర్ఎస్ 10 చోట్ల గెలి చింది. రూరల్లో బీజేపీ, బీఆర్ఎస్, కమ్యూనిస్టుల పొత్తు వర్కవు ట్ అయినట్టు దీన్నిబట్టి తెలుస్తోంది. తిప్పర్తిలో గతంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వలసొచ్చిన అభ్యర్థులను నిలబెట్టారు. దీంతో బీఆర్ఎస్ గత ఎన్నికల్లో ఓడిపోయిన వారికి అవకాశం ఇవ్వడం ఆ పార్టీకి కలిసొచ్చింది. దాంతో 26 పంచాయతీల్లో కాంగ్రెస్ 20, బీఆర్ఎస్ ఆరు చోట్ల గెలిచింది. కనగల్ మండలంలో ఆరు చోట్ల బీఆర్ఎస్ గెలిస్తే, కాంగ్రెస్ 25 మంది గెలుపొందారు. వ్యక్తిగత ఇమేజ్ కూడా తోడవడంతో కాంగ్రెస్ నష్టపోవాల్సి వచ్చింది.
నకిరేకల్లో వర్గపోరు…
నకిరేకల్ నియోజకవర్గంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం వర్గీయుల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. కట్టంగూరు, గుండ్రాంపల్లి లాంటి గ్రామాల్లో అభ్యర్థులు పోటాపోటీగా ఒక్కొక్కరు రూ.కోటిన్నరకు పైగా ఖర్చు పెట్టారు. ఇరువురి మద్ధతు లభించని వారు సైతం రెబల్స్గా తలపడ్డారు. దీంతో నార్కట్పల్లి, కట్టంగూరు, చిట్యాల మండలాల్లో కాంగ్రెస్కు ధీటుగా బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. 102 పంచాయతీల్లో కాంగ్రెస్ 63, బీఆర్ఎస్ 24 మంది అభ్యర్థులు గెలుపొందారు. ఇక రెబల్స్ 8 మంది గెలవడం విశేషం. నార్కట్పల్లి మండలంలో 17 కాంగ్రెస్ గెలిస్తే, బీఆర్ఎస్ 7గురు గెలుపొందారు. ఈ మండలంలోనే రెబల్స్ నాలుగు గ్రామాల్లో గెలుపొందారు. చిట్యాలలో 11 కాంగ్రెస్, బీఆర్ఎస్ 5, కట్టంగూరులో 12 కాంగ్రెస్, ఐదు బీఆర్ఎస్ గెలిచింది. కట్టంగూరులో మంత్రి కోమటిరెడ్డి వర్గీయులు పైచేయి సాధించారు.
ఆరు గ్యారెంటీల ఎఫెక్ట్..
పంచాయతీ పోరులో ఆరు గ్యారెంటీల హామీలు పూర్తిస్థాయిలో అమలు కాకపోవడంతోనే ప్రతికూల ఫలితాలు వచ్చాయని అధికార పార్టీ లీడర్లు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా పెంచిన ఫించన్లు ఇవ్వకపోడం మైనస్ పాయింట్ కాగా. ప్రభుత్వం వద్ద సరిపడా నిధులు లేకపోవడంతో ఎమ్మెల్యేలు పూర్తిస్థాయిలో అభివృద్ధి పైన దృష్టి పెట్టలేకపోయారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లైన అసెంబ్లీ ఎన్నికల్లో స్థానికంగా ఇచ్చిన హామీలను నెరవేర్చలేపోయారనే అపవాదు కూడా మూటగట్టుకున్నారు.
సెగ్మెంట్ వారీగా పంచాయతీ ఎన్నికల ఫలితాలు (ఫస్ట్ఫేజ్)
| నియోజకవర్గం | మొత్తం జీపీలు | కాంగ్రెస్ | బీఆర్ఎస్ |
| తుంగతుర్తి | 128 | 76 | 40 |
| ఆలేరు | 153 | 87 | 50 |
| సూర్యాపేట | 55 | 30 | 20 |
| నల్లగొండ | 88 | 64 | 26 |
| మునుగోడు | 104 | 56 | 26 |

మొదటి విడతలో 45 శాతం మంది బీఆర్ఎస్ మద్ధతుదారులు గెలుపొందారు. రాబోయే రోజులు అన్నీ బీఆర్ఎస్వే. ఎన్నిక ఏదైనా ఇక మీదట గెలిచేది బీఆర్ఎస్సే. ప్రజల గుండల్లో కేసీఆర్ గూడుకట్టుకుని ఉన్నారు. రేవంత్ రెడ్డి పనితన జనాలకు అర్ధమైంది. కాంగ్రెస్ వల్ల ఏమీకాదని ప్రజలకు తెలిసొచ్చింది. ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు దారుణాలకు పాల్పడుతున్నారు. అధికార దుర్వినియోగం జరుగుతోంది. నిష్పక్షపాతంగా అధికారులు వ్యవహారించడం లేదు. అధికారులు, పోలీసులు, కాంగ్రెస్ నాయకులతో చేతులు కలిపి బీఆర్ఎస్ లీడర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.
ఎన్నిక ఏదైనా ఇక మీద గెలిచేది బీఆర్ఎస్సే అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి శనివారం నల్లగొండలో జరిగిన మీడియా సమావేశంలో వ్యాఖ్యలు చేసారు.