నల్లగొండ, ఏపీబీ న్యూస్: నకిరేకల్–నాగార్జునసాగర్ జాతీయ రహదారి-565 పై రహదారి మెరుగుదల పనులకు భారత ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు నల్గొండ పట్టణ పరిధిలో 20.300 నుంచి 23.730 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉండగా, నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ లోని పానగల్ బైపాస్ రోడ్డు నుంచి డీఈఓ ఆఫీస్ వరకు రోడ్డు విస్తరణ కోసం కేంద్ర ప్రభుత్వం రూ14.45 కోట్లు మంజూరు చేసింది. 2025–26 వార్షిక ప్రణాళిక కింద అమలు చేయనున్నారు. రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ (సెంట్రల్ జోన్) విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం, రూ.14.45 కోట్ల అంచనా వ్యయంతో ఈ పనులకు పరిపాలనా, సాంకేతిక మరియు ఆర్థిక ఆమోదాలు లభించాయి. బ్లాక్ టాపింగ్ ద్వారా రహదారి ఉపరితలాన్ని మెరుగుపరచడం జరుగుతుంది.
తెలంగాణ ఆర్&బీ(R&B) శాఖ సమర్పించిన ప్రతిపాదనకు ఎటువంటి మార్పులు లేకుండా పూర్తిస్థాయిలో ఆమోదం లభించింది. టెక్నికల్ నోట్లో పేర్కొన్న గడువులోనే పనులను పూర్తి చేయాలని మంత్రిత్వ శాఖ ఆదేశించింది. అలాగే టెండర్ ఖర్చు ఆమోదించిన అంచనా వ్యయాన్ని 5 శాతం మించితే, సవరణ ఆమోదం తీసుకోవాలని స్పష్టం చేసింది. అమలు సమయంలో కేంద్ర పథకాల కింద జాతీయ రహదారి పనులకు సంబంధించిన అన్ని టెండర్ మరియు అమలు మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని అధికారులు సూచించారు.
గతంలో పానగల్ బైపాస్ రోడ్డు (ఇందిరా గాంధీ విగ్రహం) నుంచి రామగిరి, క్లాక్ టవర్ సెంటర్, డీఈఓ ఆఫీస్ మీదుగా సాగర్ రోడ్డు వరకు NH565 రోడ్డు విస్తరణ కోసం ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. రోడ్డుకు ఇరువైపులా ఉన్న షాపులు, పలువురి గృహాలు విస్తరణలో పోతుండడంతో ప్రజలు, వ్యాపారులు ఆందోళన చేపట్టారు. వీరిలో కొందరు కోర్టుకు కూడా వెళ్లారు. అప్పటినుంచి ఈ రోడ్డు ఎలాంటి విస్తరణకు నోచుకోకుండా పెండింగ్ లో ఉంది. కాగా, రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినీమటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చొరవ తీసుకొని ఈ హైవే రోడ్డును బైపాస్ మీదుగా మార్చారు. పెండింగ్లో ఉన్న ఈ రోడ్డుకు నిధుల మంజూరి కోసం పలుమార్లు మంత్రి కోమటిరెడ్డి కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రిని కలిశారు.
ఎట్టకేలకు పెండింగ్లో ఉన్న రోడ్డు అభివృద్ధి పనులకు రూ. 14.45 కోట్లు మంజూరయ్యాయి. పెండింగ్ లో ఉన్న ఈ రోడ్డు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు కావడం పట్ల మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి మంత్రి కోమటిరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు. స్మార్ట్ సిటీ అభివృద్ధిలో భాగంగా ఈ రోడ్డును కూడా అభివృద్ధి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.