- గత పాలకవర్గం కూడపెట్టిన 30 ఎకరాల స్థిరాస్తి
- దాంతోనే తీరుతున్న రూ.45 కోట్ల నార్ముల్ అప్పులు
- రూ.61 కోట్ల అప్పుల్లో ఎన్డీడీబీ(NDDB) భరించేది రూ.16 కోట్లే
- మళ్లీ మధర్ డెయిరీ బ్రాండ్‌తోనే పాల వ్యాపారం
- 2014కు ముందు పాలసేకరణ, ప్రాసెస్ నార్మూల్ దే
- ఇకనుంచి సేల్స్, మార్కెటింగ్ మధర్ డెయిరీదే
- పాలసేకరణ, చిల్లింగ్ సెంటర్లు, ధరల వరకే నార్ముల్ రోల్
- 15 ఏళ్ల పాటు కొనసాగనున్న రెండుపార్టీల అగ్రిమెంట్
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయిన నల్లగొండ రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘాన్ని (నార్ముల్) చివరకు చిట్యాల చిల్లింగ్ సెంటరే ప్రాణం పోసింది. మాజీ చైర్మన్లు గుత్తా సుఖేందర్ రెడ్డి, ఆయన తమ్ముడు జితేందర్ రెడ్డి కూడపెట్టిన చిల్లింగ్ సెంటర్ల ఆస్తులే నార్ముల్ ను కష్టాల నుంచి బయట పడేసింది. నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ (NDDB), మధర్ డెయిరీ, నార్ముల్(NARMUL) తో జరిగిన అవగాహన ఒప్పందం లో చిట్యాల చిల్లింగ్ సెంటర్ స్థిరాస్తి ప్రామాణికంగా నిలిచింది. గుత్తా బ్రదర్స్ హయాంలో నార్ముల్ లో వచ్చిన లాభాలతో చిట్యాలలో 30 ఎకరాలు, నల్లగొండలో 7 ఎకరాలు, కొండ మల్లేపల్లిలో 7 ఎకరాలు కొన్నారు. హయత్ నగర్ లోని నార్ముల్ ప్లాంట్ ను 72 ఎకరాల్లో స్థాపించారు. చిట్యాలలోని 30ఎకరాల భూమిని అమ్మేందుకు ఒప్పుకోవడంతోనే ఎన్డీడీబీ చేతులు కలిపేందుకు అంగీకరించింది. మొత్తం 61 కోట్ల నష్టాల్లో ఉన్న నార్ముల్ ను ఆదుకోవడం తమ వల్ల కాదని, చిట్యాల ఆస్తిని తమకు అమ్మేస్తే ఆ మేరకు ఇంకా ఏమైనా బకాయిలు ఉంటే వాటిని వాయిదాల పద్ధతిలో చెల్లిస్తామనే ఒప్పందం రెండు పార్టీల మధ్య జరిగింది. ఇందులో భాగంగా NDDB 30 ఎకరాల స్థలాన్ని మార్కెట్ ధరలతో లెక్క కట్టింది, దాంతోనే రూ.45 కోట్లకు కొనేందుకు సమ్మతించింది. ఎకరం కోటిన్నర చొప్పున 30 ఎకరాలు రూ.45 కోట్లకు కొనేందుకు NDDB ఒప్పుకుంది. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ బిజినెస్ సరిగా లేనందున 30 ఎకరాలు వేలం ద్వారా అమ్మడం కష్టమని, దాంతోనే ఎన్డీడీబీకి గంపగుత్తగా అమ్మేందుకు పాలకవర్గం తీర్మానించింది. మొత్తం 61 కోట్ల బకాయిల్లో రైతులకు ఇవ్వాల్సిన పాల సేకరణ బిల్లులు రూ.25కోట్లు, బ్యాంకు అప్పు రూ.26 కోట్లు, ఉద్యోగుల జీతాలు రూ.4కోట్లు, ప్రైవేటు ఏజెన్సీలకు చెల్లించాల్సిన బిల్లులు రూ.6కోట్లు ఉన్నాయి. ల్యాండ్ అమ్మగా వచ్చిన 45 కోట్లు పోను, బ్యాలెన్స్ ఇంకా రూ .16 కోట్ల అప్పు ఉంటుంది. దీన్ని ఎన్డీడీబీ కి వాయిదాల పద్ధతిలో చెల్లిస్తుంది.
మళ్లీ మధర్ డెయిరీతోనే ఢీల్..
2014కు ముందు ఢిల్లీ మధర్ డెయిరీ, నార్ముల్ కలిసి పాల వ్యాపారం చేశాయి. ఆ తర్వాత తలెత్తిన విభేదాల కారణంగా రెండు వేరు పడ్డాయి. కానీ బ్రాండ్ కోసం నార్ముల్ కోర్టులో కేసు వేసింది. నిజానికి మధర్ డెయిరీ బ్రాండ్ ఢిల్లీదే, కానీ జనాల్లో మధర్ డెయిరీ బ్రాండ్ బలంగా పాతుకుపోవడంతో బ్రాండ్ ఇమేజ్ కోసం గొడవలు జరిగాయి. 2014కు ముందు పాల సేకరణ, పాల ప్రాసెస్ నార్ముల్ చేసింది. మధర్ డెయిరీ పాల అమ్మకాలు నిర్వహించింది, కానీ ఇప్పుడు పరిస్థితులు తారుమారయ్యాయి. మధర్ డెయిరీ పాల అమ్మకం తోపాటు, మార్కెటింగ్ కూడా చేస్తది. ప్లాంట్ ఆపరేషన్ మొత్తం మధర్ డెయిరీ చేతుల్లోకి వెళ్తుంది. నార్ముల్ నుంచి ఎన్నికయ్యే పాలకవర్గం కేవలం పాల సేకరణ, చిల్లింగ్ సెంటర్ల నిర్వహణ, పాల ధరల నిర్ణయం, రైతుల వ్యవహారాలకే పరిమితం కావాల్సి ఉంటది.
ప్లాంట్ వాడుకున్నందుకు ఏటా రూ.5కోట్లు…
పాతపడిపోయిన నార్ముల్ ప్లాంట్ ను మళ్లీ కండీషన్లోకి తెచ్చేందుకు NDDB ద్వారా మధర్ డెయిరీ కొంత పెట్టుబడి పెట్టాల్సి ఉంటది. లీటర్ పాలకు రూ.6.50 కమీషన్ చెల్లించాలి, అదీగాక బ్యాలెన్స్ అప్పు 16 కోట్లు కూడా మధర్ డెయిరీనే భరిస్తుంది. ఈ రెండింటి మధ్య ఎన్డీడీబీ పరస్పర సహాయ సహకారాలు అందిస్తది. 15 ఏళ్ల పాటు ఎన్డీడీబీ సహకారంతో మధర్ డెయిరీ మేనేజ్మెంట్ బాధ్యత వహిస్తుంది. కాబట్టి నార్ముల్ ప్లాంట్ వాడుకున్నందుకు గాను ప్రతి ఏడాది రూ.5 కోట్లు మధర్ డెయిరీ చెల్లించాలన్నది అగ్రిమెంట్. నార్ముల్, ఎన్డీడీబీ, మధర్ డెయిరీ మధ్య జరిగేది కేవలం ఎంఓయూ(MoU) మాత్రమే. టేకోవర్ కాదని, నార్ముల్ ఆస్తుల పైన చిల్లింగ్ సెంటర్ల పైన ఎన్డీడీబీకి ఎలాంటి అధికారాలు ఉండవు.
నార్ముల్ ముందున్న సవాళ్లు ఇవీ…
మధర్ డెయిరీతో ఢీల్ ఆషామాషీ వ్యవహారం కాదని, రైతుల పక్షాన పాలకవర్గం చేయాల్సిన తతంగం చాలా ఉంటదని గతం తాలుకూ సంఘటనలు రుజువు చేస్తున్నాయి. ఒకప్పుడు లక్ష లీటర్ల పాల సేకరణ జరిగేది, కానీ ఇప్పుడు అది 15వేల లీటర్లకు పడిపోయింది. సంస్థలో 300 మంది ఉండాల్సిన ఉద్యోగులు 500 మంది పని చేస్తున్నారు. నెలకు జీతాలు తడిసి మోపడువుతున్నాయి. పాలకవర్గం డైరక్టర్లు, చైర్మన్లు మీటింగ్లు పెట్టిన ప్రతి సారి సిట్టింగ్ ఫీజుల రూపంలో లక్షల రూపాయాలు పిండుకుంటున్నారు. పాల సేకరణ పెంచాల్సిన బాధ్యత పాలకవర్గానిదే. రైతులకు నచ్చచెప్పి, పాల సేకరణ పెంచితే తప్పా మధర్ డెయిరీ వ్యాపారం చేయడం సాధ్యం కాదు. ఇంకోవైపు ఉద్యోగుల జీతాలు తగ్గించడం లేదంటే ఉద్యోగులను తీసేయడం జరగాలి. నార్ముల్ తీసుకున్న ఎలాంటి చర్యల్లో మధర్ డెయిరీ జోక్యం చేసుకోదు. ఇప్పుడు మోస్తున్న భారాన్ని తగ్గించుకుంటూ వస్తేనే మళ్లీ నార్ముల్ కు మంచిరోజులు వస్తాయి. లేదంటే మళ్లీ ఆస్తులు అమ్ముకుని డెయిరీని కాపాడుకోవడం తప్పా మరోమార్గం లేదనే చెప్పాలి.