Special Story: పొలిటికల్ ప్రస్థానంలోకి నల్లమోతు సిద్ధార్ధ.. తండ్రి బాటలో రాజకీయాల్లోకి

మిర్యాలగూడ, ఏపీబీ న్యూస్: మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నలమోతు భాస్కర్రావు కొడుకు సిద్ధార్ధ రాజకీయ ప్రస్థానంలోకి అడుగపెట్టనున్నారు. ఇన్నాళ్ల తండ్రి వెనకాలే ఉండి రాజకీయాలను వంటిపట్టించుకున్న సిద్ధార్ధ ఇకనుంచి ప్రతక్ష్య రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. మిర్యాలగూడకు రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన భాస్కర్రావు గత పదేళ్లలో 10 వేల కోట్లతో అభివృద్ధి చేశారు. అధికారంలో ఉన్నప్పుడు భాస్కర్రావు చేస్తున్న ప్రజాసేవలకు ఆకర్షితుడైన సిద్ధార్ధ 30 ఏళ్ల వయసు నుంచే సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఎన్బీఆర్ ఫౌండేషన్ (నలమోతు భాస్కర్రావు) పేరుతో విస్తృతమైన సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రధానంగా నిరుద్యోగులకు ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వం జారీచేసిన జాబ్ నోటిఫికేషన్లకు ఉచితంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. పండగలు, జాతర్లు జరిగినప్పుడు ఫౌండేషన్ తరపున ఉచిత భోజన, చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో ఎవరు మరణించినా వైకుంట రథాన్ని పంపడం, ఉచితంగా భోజన కార్యక్రమాన్ని నిర్వర్తించడం వంటి కార్యక్ర మాలతో సిద్ధార్ధ వెలుగులోకి వచ్చారు.

పంచాయతీ ఎన్నికలతోనే సిద్ధార్ధ ప్రతక్ష్య రాజకీయాల్లోకి దిగారు. తండ్రి భాస్కర్రావు విదేశీ పర్యటనలో ఉండగానే మిర్యాలగూడలో ఎన్నికల వ్యవహారాలన్ని సిద్ధార్ధ చక్కబెట్టారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేశారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని గమనించిన సిద్ధార్ధ తండ్రి డైరక్షన్లో ఎన్నికల వ్యూహాన్ని పకడ్బందీగా అమలు చేశారు. 119 గ్రామపంచాయతీల్లో 36 పంచాయతీలను కైవసం చేసుకున్నారు. చాలా గ్రామాల్లో స్వల్ప ఓట్ల తేడాలో అభ్యర్థులు ఓడిపోయినప్పటికీ అధికార పార్టీకి చెమటలు పట్టించారు.

పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటిన సిద్ధార్ధ మున్సిపల్ ఎన్నికల్లో మరింత దూకుడుగా వ్యవహారించారు. ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్లో పార్టీకి బలమైన అభ్యర్థులు దొరక్క ఇబ్బందులు పడుతున్న క్రమంలో సిద్ధార్ధ బలమైన టీమ్ను రూపొందించి ఎన్నికల రంగంలోకి దిగారు. తండ్రి భాస్కర్రావు ఎత్తులతో సిద్ధార్ధ ఎన్నికల వాతావరణాన్ని హీటెక్కించారు. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి వస్తే తప్పా కాంగ్రెస్ కు గతిలేదనే స్థాయిలో బీఆర్ఎస్ కేడర్లో జోష్ నింపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ అత్యధిక స్థానాలు గెలిచిన మున్సిపాలిటీ గా మిర్యాలగూడ రికార్డుకెక్కింది. మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సొంత నియోజకర్గం సూర్యాపేటలో 11 వార్డులు వస్తే మిర్యాలగూడలో ఏకంగా 14 వార్డులు కైవసం చేసుకుంది. అధికార పార్టీ సర్వేల ప్రకారం బీఆర్ఎస్కు 20కి పైగా వార్డులు వస్తాయని భావించారు. కానీ సీఎం రేవంత్ పర్యటన తర్వాత మిర్యాలగూడలో కాంగ్రస్ మూకలు సృష్టించిన అల్లర్లతో కేడర్ ఆందోళన చెందింది. అయినప్పటికీ సిద్ధార్ధ వెనకడుగు వేయకుండా కేడర్లో బలం పెంచేందుకు అల్లరి మూకల అంతుచూసేందుకు ప్రత్యక్ష కార్యచరణలోకి దిగారు.

ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్, బీఆర్ఎస్లో యువనాయకత్వానికి లోటు ఏర్పడిందని భావిస్తున్న తరుణంలో గత ఎన్నికల్లో సీనియర్ నేత జానారెడ్డి కొడుకులు రఘువీర్ రెడ్డి, జైవీర్ రెడ్డి, మరో యువనేత చామల కిరణ్ కుమార్ రెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఎన్నికల తర్వాత మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు అమిత్ రెడ్డి ప్రభుత్వంలో చేరిపోయారు. తాజాగా సిద్ధార్ధ రాకతో మరో యువ కెరటం రాజకీయాల్లో అడుగుపెట్టున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్లో యువ నేత జాబితాలో మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ ఉన్నారు. ఇదే కోవలో సిద్ధార్ధ భవిష్యత్తు రాజకీయాలకు దిక్సూచిగా మారుతారనే అభిప్రాయం పార్టీలో, ప్రజల్లో వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి తండ్రిబాటలోనే సిద్ధార్ధ సైతం ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ పడే అవకాశాలు ఉండొచ్చని పార్టీలో చర్చ జరుగుతోంది.

Share
Share