APB News Exclusive: నల్లగొండ టౌన్ ​లో.. ప్రాణాలు తీస్తున్న… వీఐపీ జంక్షన్లు

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్లగొండ కార్పోరేషన్లో రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యంగా మారా యి. మూడు రోజుల వ్యవధిలోనే ఇద్దరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా మారింది. పట్టణంలో వీఐపీల రాకపోకలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు నిర్మించిన జంక్షన్ల వద్ద ట్రాఫిక్ అదుపు తప్పుతోంది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వాహనాలకు ఇబ్బంది కలగొద్దని ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఓపెన్ చేసిన జంక్షన్ ప్రమాదకరంగా మారింది. సుఖేందర్ రెడ్డి వాహనాలు ఎన్జీ కాలేజీ జంక్షన్ వైపు నుంచి  వెళ్లకుండా ఎన్టీఆర్ జంక్షన్ నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు మార్గం సులువుగా ఉండాలని అక్కడ ట్రాఫిక్ ఫ్రీ చేశారు. ఇంకో వైపు నుంచి మంత్రి కోమటిరెడ్డి క్యాంపు ఆఫీసు, మేయర్ బుర్రి చైతన్య నివాసాలు ఉన్నాయి.

శ్రీనగర్ కాలనీ నుంచి వచ్చే వీరి వాహనాలకు ఇబ్బంది ఉండొద్దని ఎన్టీఆర్ జంక్షన్ను ఫ్రీ జోన్గా మార్చారు. దీంతో హైదరాబాద్ మార్గం నుంచి వచ్చే కార్లు, బైక్లు, ఆటోలు ఎన్జీ కాలేజీ సర్కిల్ నుంచి యూటర్న్ తీసుకోకుండా ఎన్టీఆర్ జంక్షన్ నుంచే శ్రీనగర్ కాలనీ వైపు వేగంగా దూసుకొస్తున్నారు. దీనికి సమీపంలోనే మాంగల్య షాపింగ్ మాల్ ఉన్నందున ఆటోల వెయిటింగ్ ట్రాఫిక్ సమస్యను మరింత జఠిలం చేసింది. ఈ జంక్షన్ వద్ద ట్రాఫిక్ ఉల్లంఘిస్తున్న వాహనాదారుల పైన రోజుకు 70 మందికి పెనాల్టీలు వేస్తున్నా పరిస్థితుల్లో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. ఈ జంక్షన్కు కూతవేటు దూరంలో ప్రగతి కాలేజీ, నారాయాణ స్కూల్స్ ఉన్నాయనే ఉద్దేశంతో అక్కడ ట్రాఫిక్ డైవర్షన్ మూసేశారు. ఎన్టీఆర్ జంక్షన్ కూడా క్లోజ్ చేస్తే వాహనదారులు ప్రసాద్ ఉడిపి హోటల్ వద్ద నుంచి యూటర్న్ చేసుకుని రావాల్సి ఉంటుంది. ఈ సమస్యకు పరిష్కారం కనిపెట్టలేక ఫ్రీజోన్గా వదిలేశారు. దీంతో ఈ ప్రాంతంలో తరచూ ప్రమాదాలు, ట్రాఫిక్ పోలీసులతో వాహనదారుల వాగ్వివాదాలు సర్వసాధారణంగా మారాయి.

జడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి నివాసం ప్రసాద్ ఉడిపి హోటల్ గల్లీలోనే ఉంది. జడ్పీ చైర్మన్గా ఉన్నప్పుడు ప్రోటోకాల్ వెహికిల్స్ రాకపోకలకు ఇబ్బంది ఉండొద్దని ప్రసాద్ ఉడిపి హోటల్ వద్ద యూటర్న్ జంక్షన్ ఏర్పాటు చేశారు. క్లాక్ టవర్ నుంచి మర్రిగూడ బైపాస్ వరకు బీఆర్ఎస్ హయాంలోనే నిర్మించిన రోడ్డు కాబట్టి ఇష్టానుసారంగా డివైడర్ల నిర్మాణం, యూటర్న్ పాయింట్స్, జంక్షన్లు నిర్మించారు. అప్పటి కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధుల రాకపోకలు సులువుగా ఉండాలని ఇష్టానుసారంగా డివైడర్లు, జంక్షన్లు కట్టారు. ప్రసాద్ ఉడిపి హోటల్ వద్ద జంక్షన్ వద్దని అప్పట్లోనే అడ్డుకున్నారు. ఇక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో గతంలోనే ఒకరిద్దరు ప్రాణాలు కోల్పోయారు. మళ్లీ సోమవారం తెల్లవారుజామున జరిగిన కారు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మున్సిపాలిటీ కార్మికురాలు ప్రాణాలలో కొట్టుమిట్టాడుతోంది. మితిమీరిన వేగంతో కారు డ్రైవ్ చేయడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు.

పట్టణంలో అతిపెద్దది క్లాక్ టవర్ జంక్షన్. నాలుగు ప్రధాన రహాదారుల కూడలి. ఈ జంక్షన్ వద్ద వాహనదారులు ఎటువైపు నుంచి దూసుకొస్తారో కూడా ఎవరికీ అంతుచిక్కదు. ట్రాఫిక్ పోలీసులు నిత్యం కాపలా కాస్తున్నా ప్రమాదాలు మాత్రం ఆగడం లేదు. గతంలో ఒక లారీ దూసుకరావడంతో బైక్ మీద వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరొక లారీ, ఆటో మీదకు దూసుకెళ్లిన ఘటన లో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.  ట్రాఫిక్ సిగ్నల్స్ గ్రీన్ పడగానే హైదరాబాద్ మార్గం నుంచి వచ్చే వాహనాలు, అటు సూర్యాపేట రోడ్డు నుంచి వచ్చే వాహనాలు ఓవర్ స్పీడ్తో రావడంతో చర్చి సిగ్నల్ వద్ద ట్రాఫిక్ ప్రమాదకరంగా మారింది. మరోవైపు ఇందిరా భవన్ వద్ద ఆందోళనలు, ధర్నాలు, ఇతర కార్యక్రమాలను బ్యాన్ చేయకపోవడం కూడా ట్రాఫిక్ అదుపు తప్పుతుంది. మంత్రి క్యాంపు ఆఫీసు ఇందిరా భవన్ ఓపెన్ కాగానే క్లాక్టవర్ వద్ద జరిగే కార్యక్రమాలకు ప్రత్యామ్నయంగా స్థలం ఏర్పాటు చేస్తామని చెప్పారు.

నిత్యం ట్రాఫిక్ రద్ధీ కనిపించే ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని సుభాష్ విగ్రహాం జంక్షన్ డేంజర్లో ఉంది. ఈ జంక్షన్ వద్ద సిగ్నల్స్ వాహనదారులకు కనిపించవు, పనిచేయవు. జంక్షన్ నిర్మాణం అస్తవ్యస్తంగా ఉంది. దీంతో ఎవరు ఎటువైపు నుంచి దూసుకొస్తారో కూడా తెలియదు. రోడ్డు మీద కాలినడకన వెళ్లే జనాలు కూడా జంక్షన్ వద్దకు చేరుకునే వరకు కనిపించరు. దీంతో గురువారం ఆర్టీసీ బస్సు జంక్షన్ నుంచి బస్టాండ్ వైపు టర్న్ తీసుకునే క్రమంలో అటువైపు నుంచి వస్తున్న మహిళను ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ జంక్షన్ ప్రమాదంగా ఉందని ఆర్టీసీ అధికారులు గతం లోనే గుర్తించారు. బస్సులు, ఆటోలు, కార్లు, బైక్లు ఓవర్ స్పీడ్తో ప్రయాణించడం ప్రమాదాలకు దారితీస్తోంది. దీనికితోడు గత కొద్ది రోజుల నుంచి పట్టణంలో ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయడం లేదు. సీసీకె మెరాలు బంద్ అయ్యాయి. ట్రాఫిక్ పోలీసులు ఒకవైపు సెల్ఫోన్లో ఫోటోలు తీయడం, మరోవైపు ట్రాఫిక్ కంట్రోల్ చేయడం ఇబ్బందికరంగా మారింది.

Share
Share