Warning: దొంగతనాలు చేస్తే తోలు తీస్తాం: ఎస్పీ

నల్లగొండ, ఏపీబీ న్యూస్​: నల్లగొండ జిల్లా దొంగలకు ఎస్పీ శరత్​ చంద్ర పవార్​ సీరియస్​ వార్నింగ్​ ఇచ్చారు. తరచూ దొంగతనాలకు పాల్పడుతున్న నేరస్తుల తోలుతీస్తాం అని హెచ్చరించారు. జిల్లా పరిధిలో ఇటీవల కాలంలో తరచూ దొంగతనాలు, చోరీలు, చైన్ స్నాచింగ్, ద్విచక్ర వాహనాల చోరీలు, ఇళ్లలో చోరీలు వంటి నేరాలకు పాల్పడుతున్న అలవాటైన నేరస్తులపై జిల్లా పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరించనున్నట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. జిల్లాలో గతంలో దొంగతనాలకు పాల్పడిన వ్యక్తులందరినీ డీటీసీలో కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహించి, నేరాలకు దూరంగా ఉండి సత్ప్రవర్తనతో నేరాలను మానుకొని, సమాజంలో గౌరవప్రదమైన, చట్టబద్ధమైన జీవితం గడపాలని సూచించారు.

nalgonda sp strong warning to thieves

జిల్లాలో నేరాలకు అలవాటుపడిన వ్యక్తుల కదలికలపై పోలీస్ శాఖ ఇప్పటికే ప్రత్యేక నిఘా బృందాలు, నైట్ పెట్రోలింగ్ టీములు, సీసీటీవీ నిఘా వ్యవస్థల ద్వారా నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా తరచూ నేరాలకు పాల్పడుతున్న నేర చరిత్ర కలిగిన వ్యక్తులు, అనుమానితులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించారు. నేర ప్రవృత్తినే ఎంచుకున్న నిందితులు తమ ప్రవర్తనను వెంటనే మార్చుకోకపోతే, ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ (PD Act), రౌడీషీట్‌లు, బైండోవర్ కేసులు, కఠిన చట్టాల కింద అరెస్టులు, రిమాండ్ వంటి చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. ప్రజల ఆస్తి, ప్రాణ భద్రతలకు ముప్పుగా మారే నేరస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. అలాగే దొంగతనాలకు పాల్పడే ముఠాలు, తిరుగుబాటు నేరస్తులు, అంతర్రాష్ట్ర నేరస్తులపై ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించి వారి నెట్‌వర్క్‌ను పూర్తిగా ఛేదించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ప్రజలు సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి:

ప్రజలు కూడా తమ ఇళ్ల వద్ద భద్రతా చర్యలు తప్పనిసరిగా పాటించాలని, సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, పొరుగు వారితో సమన్వయం ఉండాలని సూచించారు. ఏదైనా అనుమానాస్పద వ్యక్తులు లేదా ఘటనలు కనిపిస్తే డయల్ 100 లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు వెంటనే సమాచారం అందించాలని కోరారు. జిల్లాలో శాంతి భద్రతలను పరిరక్షించడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని, నేరాలపై జీరో టాలరెన్స్ విధానంతో పని చేస్తున్నామని ఎస్పీ తెలిపారు.

Share
Share