నల్గొండ, ఏపీబీ న్యూస్: సంక్రాంతి పండుగ సందర్భంగా స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికులు, పర్యాటకుల రాకపోకలతో నేషనల్ హైవే రహదారులపై ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉన్నందున, ఎలాంటి అవాంతరాలు కలగకుండా జిల్లా పోలీస్ శాఖ సమగ్ర కార్యాచరణ అమలు చేస్తోందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. జిల్లా పరిధిలోని నేషనల్ హైవే వెంబడి ట్రాఫిక్ సజావుగా కొనసాగేందుకు అదనపు ట్రాఫిక్ పోలీసులు, క్యూఆర్‌టీ(QRT) బృందాలు, హైవే పెట్రోలింగ్ వాహనాలను మోహరించామని తెలిపారు. ముఖ్యంగా ప్రమాదాలకు ఆస్కారం ఉన్న ప్రాంతాలు, జంక్షన్లు, టోల్ ప్లాజాలు, ధాబాలు, హోటళ్ల వద్ద ప్రత్యేకంగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
డ్రోన్ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ
నేషనల్ హైవే పై ట్రాఫిక్ పరిస్థితిని రియల్ టైమ్‌లో పర్యవేక్షించేందుకు డ్రోన్ కెమెరాలను వినియోగిస్తున్నామని ఎస్పీ తెలిపారు. డ్రోన్‌ల ద్వారా రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి, అక్కడికి వెంటనే ట్రాఫిక్ సిబ్బందిని పంపి ట్రాఫిక్‌ను నియంత్రిస్తున్నామని పేర్కొన్నారు. అక్రమ పార్కింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, రోడ్డుపై వాహనాలు నిలిపివేయడం వంటి ఉల్లంఘనలను డ్రోన్ పర్యవేక్షణ ద్వారా గుర్తించి తక్షణ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. భారీ వాహనాల రాకపోకలను సమయానుసారం నియంత్రించడం, అవసరమైన చోట ట్రాఫిక్ డైవర్షన్లు ఏర్పాటు చేయడం, వాహనాలు చెడిపోతే వెంటనే రోడ్డుపై నుంచి తొలగించేందుకు క్రేన్‌లు సిద్ధంగా ఉంచడం జరిగిందన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారు, అతివేగంగా డ్రైవింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
“సంక్రాంతి పండుగను ప్రజలు సుఖశాంతులతో, సురక్షితంగా జరుపుకునేందుకు జిల్లా పోలీస్ శాఖ పూర్తి అప్రమత్తతతో పనిచేస్తోంది. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ, పోలీస్ సిబ్బందికి సహకరించాలి. అలా చేస్తే నేషనల్ హైవే పై ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రయాణం సాఫీగా సాగుతుంది” అని తెలిపారు. ప్రజలు ఏవైనా అత్యవసర పరిస్థితుల్లో వెంటనే పోలీస్ హెల్ప్‌లైన్ 100 నంబర్ సంప్రదించాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.