APB News Exclusive: పల్లెల్లో క్లీన్​ అండ్​ గ్రీన్​.. 675 పల్లె ప్రకృతి వనాలు విధ్వంసం..

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పంచాయతీరాజ్ యంత్రాంగం గ్రామాలను జల్లెడ పడుతోంది. ఈ నెల 6 నుంచి మొదలైన ఈ కార్యక్రమం 15 వరకు రోజువారీ షెడ్యూల్ రూపొందించారు. పది రోజుల పాటు చేయాల్సిన కార్యక్రమాల గురించి పక్కా ప్రణాళిక రూపొందించారు. దీని ప్రకారం ఆయా గ్రామాల్లో ప్రతి రోజు చేస్తున్న కార్యక్రమాల వివరాలను ప్రభుత్వానికి రిపోర్ట్ చేస్తున్నారు. గత రెండేళ్ల నుంచి పంచాయతీల్లో పాలకవర్గాలు లేక ఎక్కడికక్కడే పారిశుద్ధ్య సమస్యలు పేరుకుపోయాయి. ముఖ్యంగా మురికి కాల్వల్లో పూడిక తీయకపోవడంతో కంపు కొడుతున్నాయి. మరోవైపు ఇళ్లలో తడి, పొడి చెత్త వేరు చేయడం పైన సరియైన అవగాహన లేక జనాలు ఎక్కడ పడితే అక్కడ చెత్తనే పారబోస్తున్నారు. మురికి కాల్వలో నీరు చేరడంతో దోమలు విజృంభిస్తున్నాయి. ఇంకుడు గుంతలు లేకపోగా, మురికి కాల్వలు క్లీన్ చేయకపోవడంతో రోడ్ల పైన డ్రైనేజీ వాటర్ ప్రవహిస్తోంది. చెత్త డంపింగ్ యార్డుల్లో సరియైన నిర్వహణ చేయలేదు. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలు నిర్వహణ గాలికి వదిలేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామాల్లో గుర్తించిన సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తున్నారు.

ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా నల్లగొండ జిల్లాలో ఈనెల 6 నుంచి ఇప్పటి వరకు 85,862 ఇళ్లలో చెత్తను వేరు చేయడం పైన అవగాహన కల్పించారు. 2,90,893 ఇళ్లల్లో మాత్రం తడి, పొడి చెత్తను వేరు చేస్తున్నారు. చాలా ఇళ్లలో చెత్తను వేరు చేయడం పైన అవగాహన లేక రోడ్ల పైన పాడేస్తున్నారు. దీంతో గ్రామాల్లో తడి, పొడి చెత్తను వేరు చేయాలని చెప్పడంతో పాటు, చెత్త డబ్బాలు కూడా పంపిణీ చేస్తున్నారు. 668 చెత్త డంపింగ్ యార్డుల్లో సమస్యలు పేరుకుపోయాయి. మెయింటెన్స్ లేక అధ్వాన్నంగా తయారయ్యాయి.

5,019 కిలోల పొడిచెత్తను తొలగించారు. ఇప్పటి వరకు 1025 చోట్ల పొడిచెత్త నిల్వ ఉన్న ప్రదేశాలను గుర్తించి, వాటిల్లో 1005 ప్రదేశాల్లో నిల్వ ఉన్న 5 వేల కిలోల పొడిచెత్తను ధ్వంసం చేశారు. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాల్లో సరియైన నిర్వహణ లేక మొక్కలు, చెట్లు పూర్తిగా ఎండిపోయాయి. 675 వనాలు విధ్వంసానికి గురియ్యాయి. ప్రకృతి వనాలు ఏర్పాటు చేసిన కాంట్రాక్టులు అగ్రిమెంట్ ప్రకారం మూడేళ్ల పాటు నిర్వహణ బాధ్యత వాళ్లదే. ఆ తర్వాత గ్రామ పంచాయతీలు మెయింటెన్ చేయాలి. కానీ గత రెండేళ్ల నుంచి పాలకవర్గాలు లేకపోవడంతో వనాలన్నీ ఎండిపోయాయి.

మురికాల్వల్లో పూడికతీయకపోవడంతో చెత్త, చెదారంతో నిండిపోయాయి. ఇళ్లలో నుంచి వచ్చే మురుగు నీరు ప్రవహించేందుకు వీలు లేకుండా పూడుకుపోయాయి. జిల్లాలో 3,059 కిలోమీటర్ల మేర పంచాయతీ రోడ్లు ఉన్నాయి. 1881 రోడ్లను చీపర్లుతో శుభ్రం చేశారు. కానీ 1684 కిలోమీటర్ల మేర ఉన్న మురికికాల్వలు మాత్రం అధ్వాన్నంగా ఉన్నాయి. దీంట్లో 1022 కిలోమీటర్ల మేర మురికికాల్వల్లో పూడిక తీశారు. 7,819 కేజీల బ్లీచింగ్ పౌడర్ చల్లారు. 678 ఇంకుడు గుంతులు శాంక్షన్ చేశారు. 327 ఇంకుడు గుంతలు గ్రౌండింగ్ అయ్యాయి. 2,526 తాగునీటి ట్యాంకులకు గాను ఓహెచ్ఎస్సార్ 2,420 ట్యాంకులు క్లీన్ చేశారు.

ఆఫీసుల్లో పెండింగ్లో ఉన్న ఫైల్స్ అన్నీ చకాచకా క్లియర్ చేస్తున్నారు. జిల్లా పరిషత్, డీఆర్డీఏ(DRDA), డీపీఓ(DPO), ఎంపీడీఓ(MPDO), ఎంపీవో(MPO) స్థాయిలో మొత్తం 622 ఫైల్స్ పెండింగ్లో ఉన్నాయి. దీంట్లో రొటీన్ ఫైల్స్ 452 క్లియర్ చేశారు. పదేళ్ల నుంచి పెండింగ్లో ఉన్న ఫైల్స్ మూడు, 50 ఏళ్ల నుంచి పెండింగ్లో ఉన్న ఫైల్స్ 2, మొత్తం కలిపి 457 ఫైల్స్ క్లియర్ చేయగా, ఇంకా 165 ఫైల్స్ బ్యాలెన్స్ ఉన్నాయి.

ప్రభుత్వ పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రాలు, సంక్షేమ హాస్టల్స్, ఆర్టీసీ బస్టాండ్లు, హెల్త్ సెంటర్లు, ఇతర పబ్లిక్, ప్రభుత్వ సంస్థలు అన్ని కలిపి 3,799 క్లీన్ చేశారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు 1283, అంగన్ వాడీ కేంద్రాలు 1789, సంక్షేమ హాస్టల్స్ 114, బస్టాండ్లు 126, సబ్ సెంటర్లు 220 ఉన్నాయి.

Share
Share