Breaking News: నల్గొండ..ఇక కార్పొరేషన్…బెనిఫిట్స్ ఇవే

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్లగొండ మున్సిపాలిటీ త్వరలో కార్పోరేషన్​గా మారిపోనుంది. జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సిఫార్సు మేరకు నల్గొండ ను కార్పొరేషన్ చేస్తూ మంగళవారం అసెంబ్లీ లో బిల్లు ప్రవేశ పెట్టారు. దీంతో ఇప్పుడున్న 48 వార్డుల ను పునర్విభజన చేసి కొత్త వార్డులను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. రెండు లేదా మూడు వార్డులు పెరిగే అవకాశం ఉంది.

Komatireddy Venkat Reddy claims shocking allegations

కార్పోరేషన్​ అర్హతలు నల్లగొండ మున్సిపాలిటీకి ఉన్నందున ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన ప్రతిపాధన గురించి ప్రభుత్వం అన్ని కోణాల్లో ఆలోచన చేసి ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం నల్లగొండలో 48 వార్డులు ఉన్నాయి, ఇంకో రెండు వార్డులు పెరిగితే కార్పోరేషన్​గా మారిపోతుంది. సీఎం రేవంత్​ రెడ్డి సొంత జిల్లా మహబూబ్​నగర్​ మున్సిపాలిటీని గ్రేడ్​ పెంచి కార్పోరేషన్​ చేశారు. అదే పద్ధతిలో నల్లగొండను కూడా కార్పోరేషన్​ స్థాయి పెంచేందుకు జనాభా లెక్కలు, వార్డుల్లో ఓటర్ల వివరాలను పరిగణలోకి తీసుకుంటారు.

10 శాతం ఓటర్లతో కొత్త వార్డులు..

నల్లగొండ పట్టణ జనాభా సుమారు 2.50 లక్షల వరకు ఉంటుందని అంచనా. గత మున్సిపల్​ ఎన్నికల్లో శివారు గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేసినందున వార్డుల సంఖ్య 48కి పెరిగింది. కానీ ఇప్పుడు విలీన ప్రతిపాధన తేకుండా జనాభా ఆధారంగా ఓటర్లు సంఖ్యను ప్రామాణికంగా తీసుకుని వార్డులను పెంచుతారు. అధికారిక సమాచారం మేరకు వార్డుల్లో ఉన్న ఓటర్లలో పదిశాతం పెంచడం లేదా తగ్గించడం చేస్తారు. ఈ పదిశాతం ఓటర్లతో కలిపి కొత్త వార్డులు క్రియేట్​ చేస్తారు. కార్పోరేషన్​ చట్టం ప్రకారం 50 వార్డులు ఉంటే సరిపోతుంది. వార్డుల్లో ఓటర్లను పదిశాతం పెంచడం లేదా తగ్గించడం చేస్తే ఎన్ని వార్డులు పెరుగుతాయనేది ఇప్పుడే కచ్చితంగా చెప్పలేమని అధికారులు తెలిపారు. రాజకీయ ప్రయోజనాలు ఆశిస్తే వార్డుల సంఖ్య పెంచొచ్చు. లేదంటే 50 వార్డులతోనే ఆగిపోవచ్చు.

కార్పోరేషన్​ రిజర్వేషన్​లతో ఎన్నికలు…

మున్సిపాలిటీలు, కార్పోరేషన్​ల రిజర్వేషన్​లు వేర్వేరుగానే ఖరారు చేస్తారు. కాంగ్రెస్​ ప్రభుత్వం స్థానిక ఎన్నికల్లో బీసీలకే ప్రియార్టీ ఇవ్వాలనే నిర్ణయానికే కట్టుబడి ఉంది. నల్లగొండ మున్సిపాలిటీగానే ఉంటే బీసీ లేదా ఎస్సీలకు రిజర్వు అవుతుందనే భయం అధికార పార్టీలోని పలువురు లీడర్లలో నెలకొంది. అదే కార్పోరేషన్​గా మారిస్తే రిజర్వేషన్​లు తారుమారయ్యే ఛాన్స్ ఉంటుంది. పైగా నల్లగొండ ను కార్పోరేషన్​ చేశామనే క్రెడిట్​ కాంగ్రెస్​ ప్రభుత్వానికి దక్కుతుంది. వార్డుల్లో రిజర్వేషన్​లు కూడా పూర్తిగా మారిపోతాయి. 

1941లో నల్లగొండ మున్సిపాలిటీ..

నల్లగొండ మున్సిపాలిటీ 1941లో ఏర్పాటైంది. ఆంధ్రప్రదేశ్​ మున్సిపల్​ యాక్ట్​ ప్రకారం 1941లో గ్రేడ్​ 3లో చేర్చారు. ఆ తర్వాత 1955లో గ్రేడ్​ వన్​ మున్సిపాలిటీ జాబితాలో చేరింది. హైదరాబాద్​కు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న నల్లగొండ పట్టణం మీదుగానే జాతీయ, రాష్ట్ర రహాదారులు నిర్మించారు. మహబూబ్​నగర్​, గుంటూరు జిల్లాల సరిహద్దులు ఉన్నాయి. ఇతర జిల్లాలతో పోలిస్తే భౌగోళికంగా విశాలమైంది.

భారీగా నిధులు..ఉద్యోగులకు మేలు

నల్లగొండ కార్పోరేషన్​ స్థాయికి పెంచడం వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు భారీ ఎత్తున సమకూరుతాయి. భూముల ధరలు పెరుగుతాయి. ఇంటి రెంట్లు, పన్నుల రేట్లు పెరుగుతాయి. నల్ల గొండ జిల్లా కేంద్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల హెచ్​ఆర్​ఏ పెరుగుతుంది. సిటీ కాంపెన్​సేషన్​ అలవెన్స్​ పెరుగుతుంది. విశాలమైన రోడ్ల నిర్మాణం జరుగుతుంది. ఇప్పటికే బైపాస్​ రోడ్డు నిర్మాణం, లతీఫ్​ సాహెబ్​ గుట్టమీదకు ఘాట్​ రోడ్డు నిర్మాణంతో పట్టణ రూపురేఖలు మారిపోతుండగా, కార్పోరేషన్ స్థాయికి పెరిగితే పట్టణంలో మరిన్ని మౌలికవసతులు ప్రజలకు లభిస్తాయి.

Share
Share