- నల్గొండ పోలీసు చేతికి బిట్టు, చింటూ, సోనూ కొత్త శునకాల ప్రవేశం
- 8 నెలల కఠోర శిక్షణ పూర్తి చేసుకొని వచ్చిన డాగ్ హ్యాండర్లు
- మర్డర్లు, దొంగతనాలు కేసులో నేరస్థులను పట్టుకోవడంలో దిట్ట
- ముందస్తు తనిఖీలతో ప్రమాదాలను పసిగట్టడం లో ప్రావీణ్యత
- స్వాగతం పలికిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్
నల్లగొండ, ఏపీబీ న్యూస్: జిల్లా పోలీస్ యంత్రాంగం భద్రతా పరంగా మరింత బలోపేతమైంది. నేరాల దర్యాప్తులోనూ, పేలుడు పదార్థాల గుర్తింపులోనూ కీలక పాత్ర పోషించే మూడు నూతన శునకాలు ఎనిమిది నెలల కఠిన శిక్షణ పూర్తి చేసుకుని జిల్లాకు చేరుకున్నాయి. ఈ మేరకు నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ గారిని డాగ్ హ్యాండ్లర్లు మర్యాదపూర్వకంగా కలిసి, శిక్షణ వివరాలను వెల్లడించారు.
8 నెలల కఠోర శిక్షణ.. ఐఐటీఏలో మెరుగులు
హైదరాబాద్ సమీపంలోని మొయినాబాద్లో గల ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ (ISW) డాగ్ ట్రైనింగ్ సెంటర్లో ఈ శునకాలు ఎనిమిది నెలల పాటు ప్రత్యేక శిక్షణ పొందాయి.
బిట్టు, చింటూ: ఇవి ‘స్నిఫర్’ రకానికి చెందినవి. పేలుడు పదార్థాలను పసిగట్టడంలో వీటికి ప్రత్యేక నైపుణ్యం ఉంది.
సోను: ఇది ‘ట్రాకర్’ రకానికి చెందిన శునకం. నేరస్థుల అడుగుజాడలను పసిగట్టి కేసుల ఛేదనలో పోలీసులకు సహకరిస్తుంది.
నేర పరిశోధనలో కీలకం: ఎస్పీ శరత్ చంద్ర పవార్
ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ, ఆధునిక సాంకేతికతతో పాటు ఇటువంటి శునక దళం పోలీసులకు వెన్నుముక వంటివని పేర్కొన్నారు.
“హత్యలు, దొంగతనాలు వంటి క్లిష్టమైన కేసుల్లో ట్రాకర్ శునకం (సోను) కీలక ఆధారాలను అందిస్తుంది. అలాగే వి.ఐ.పి పర్యటనలు, బహిరంగ సభలు, జాతరల సమయంలో స్నిఫర్ శునకాలు (బిట్టు, చింటూ) తనిఖీలు నిర్వహించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రక్షణ కల్పిస్తాయి.” అని ఆయన వివరించారు.

విధుల్లో చేరిన డాగ్ హ్యాండ్లర్లు
శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్లు ఫకృద్దీన్, సతీష్, దుర్గాప్రసాద్లు తమకు కేటాయించిన శునకాల సామర్థ్యాలను ఎస్పీకి వివరించారు. గందరగోళ పరిస్థితుల్లో కూడా విధి నిర్వహణలో ఇవి ఏమాత్రం తడబడకుండా పనిచేస్తాయని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ సీఐ రాము, అడ్మిన్ ఆర్.ఐ సంతోష్, ఆర్ఎస్ఐలు సాయిరాం, సంతోష్, శ్రావణి, అశోక్, హెడ్ కానిస్టేబుల్ కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. నూతన శునకాల రాకతో జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ మరింత పటిష్టం కానుందని పోలీస్ శాఖ ధీమా వ్యక్తం చేసింది.