నల్గొండ (నిడమనూరు), ఏపీబీ న్యూస్: జిల్లాలోని నిడమనూరు మండలం ముకుందాపురం వద్ద శనివారం రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నియంత్రణ కోల్పోయిన ఓ కారు నాగార్జున సాగర్ ఎడమ కాల్వ (NSP Canal)లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో భార్యాభర్తలు గల్లంతు కాగా, ఆదివారం ఉదయం భార్య మృతదేహాన్ని రెస్క్యూ బృందాలు వెలికితీశాయి.

సహాయక చర్యలను పర్యవేక్షించిన కలెక్టర్, ఎస్పీ:
ఆదివారం ఉదయం జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్తో కలిసి ప్రమాద స్థలాన్ని సందర్శించారు. సహాయక చర్యల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ.. త్రిపురారం మండలం కంప సాగర్కు చెందిన తల్లం పుల్లయ్య, పద్మ దంపతులు శనివారం రాత్రి 7:30 గంటల సమయంలో కారులో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు.

నిలిచిన రాత్రి గాలింపు.. ఉదయాన్నే బయటపడ్డ కారు:
ప్రమాదం జరిగిన వెంటనే రెవెన్యూ, పోలీస్, ఫైర్, ఎస్డీఆర్ఎఫ్ (SDRF) మరియు గజ ఈతగాళ్ల బృందాలు రంగంలోకి దిగాయి. అయితే చీకటి కారణంగా శనివారం రాత్రి కారును బయటకు తీయడం సాధ్యపడలేదు. ఆదివారం ఉదయం ఎన్డీఆర్ఎఫ్ (NDRF) సహకారంతో కారును వెలికితీశారు. కారులో పద్మ మృతదేహం లభ్యం కాగా, గల్లంతైన పుల్లయ్య కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడించారు.

సమన్వయంతో గాలింపు:
అన్ని శాఖల సమన్వయంతో రెండో మృతదేహం కోసం గాలిస్తున్నామని, సాధ్యమైనంత త్వరగా వెలికి తీస్తామని అధికారులు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు జె. శ్రీనివాస్, వై. అశోక్ రెడ్డి, మిర్యాలగూడ డిఎస్పి రాజశేఖర్ రాజు మరియు ఇతర రెవెన్యూ, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.