Municipal Elections: నల్గొండ ‘పుర’ పోరు: 2,855 మంది పోలింగ్ సిబ్బంది కేటాయింపు పూర్తి

నల్గొండ, ఏపీబీ న్యూస్: జిల్లాలో ఈ నెల 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలకమైన పోలింగ్ సిబ్బంది తుది ర్యాండమైజేషన్ ప్రక్రియ సోమవారం జిల్లా కలెక్టరేట్లో విజయవంతంగా పూర్తయింది. జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, మున్సిపల్ ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకులు (రాష్ట్ర ఎస్సీఈఆర్టీ సంచాలకులు) జి. రమేష్ సమక్షంలో కంప్యూటరైజ్డ్ పద్ధతిలో ఈ ఎంపికను నిర్వహించారు.

నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు మిర్యాలగూడ, నందికొండ, హలియా, దేవరకొండ, చండూరు, చిట్యాల మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 475 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల నిబంధనల ప్రకారం ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఉండేందుకు 20 శాతం అదనపు (రిజర్వ్) సిబ్బందిని కూడా సిద్ధం చేశారు.

ర్యాండమైజేషన్ ద్వారా మొత్తం 2,855 మంది సిబ్బందికి విధులను కేటాయించారు.

  • ప్రిసైడింగ్ అధికారులు (PO): 571 మంది
  • అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు (APO): 571 మంది
  • ఇతర పోలింగ్ అధికారులు (OPO): 1,713 మంది

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ర్యాండమైజేషన్ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, సాఫ్ట్వేర్ ఆధారంగా నిర్వహించినట్లు తెలిపారు. ఏ అధికారికి ఏ కేంద్రంలో విధి కేటాయించారో చివరి నిమిషం వరకు గోప్యంగా ఉంటుందని, దీనివల్ల ఎన్నికల నిష్పక్షపాతంగా జరుగుతాయని పేర్కొన్నారు. సిబ్బంది అందరూ తమకు కేటాయించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) జె. శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి మరియు ఇతర ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.

Share
Share